Monday, July 27, 2026
Home Blog Page 9

Rtc Strike | మోగిన స‌మ్మె సైర‌న్ .. ఆ ప్ర‌గ‌తి చ‌క్రాలు ఏమంటున్నాయ్‌

Rtc Strike | ” నాడు మా గోడును 55 రోజుల పాటు నినదించినం… మా గొంతు నులిమితే భ‌రించినం.. ప‌ట్టుబ‌ట్టి ఆ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించినం..కాంగ్రెస్‌ స‌ర్కారు వ‌స్తే మా క‌ష్టాలు తీరుతాయని భావించినం.. రెండున్న‌రేళ్లు ఎదురుచూసినం.. అయినా ప‌ట్టించుకోలే.. ఓపిక న‌శించి చివ‌ర‌కు పోరుబాట ప‌ట్టినం.. ప్ర‌తీ క్ష‌ణం మా సేవ‌లు స్మ‌రిస్తున్న మీరు.. మా క‌ష్టాలు గుర్తించండి సీఎం సారూ..” అంటూ ఆ ‘ప్ర‌గ‌తి చ‌క్రాలు’ విన్నవిస్తున్నాయి.
మొద‌లైన స‌మ్మె
ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ మోగింది. బుధ‌వారం మొద‌టి షిఫ్టు నుంచే మొద‌లైంది. పొద్దు పొడ‌వ‌క ముందే కార్మికులు రోడ్డెక్క‌గా.. బ‌స్సులు డిపోల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించగా.. ప్ర‌యాణికుల‌కు ఇక్క‌ట్లు మొద‌ల‌య్యాయి. ప్ర‌ధానంగా మ‌హాల‌క్ష్ముల‌కు ల‌క్ష్మీ క‌టాక్షం దూర‌మై వారి అవ‌స్థ‌లు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి.
చ‌ర్చ‌లు విఫ‌లం
ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయ‌డంతో పాటు త‌మ న్యాయ‌మైన డిమాండ్లు నెర‌వేర్చాల‌ని కోరుతూ కార్మికులు జేఏసీగా ఏర్ప‌డి గ‌త నెల‌లో యాజ‌మాన్యానికి స‌మ్మె నోటీస్ అంద‌జేశాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని కోరాయి. 32 డిమాండ్లను యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం ముందుంచాయి. స్పందించ‌కుంటే ఏప్రిల్ 22 నుంచి స‌మ్మెలోకి వెళ్తామ‌ని స్ప‌ష్టం చేశాయి. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి రాత్రి వ‌ర‌కు నిర్వ‌హించిన చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో కార్మికులు అర్ధరాత్రి నుంచే త‌మ ఆందోళ‌న షురూ చేశారు. మొద‌టి షిఫ్టు నుంచే డ్యూటీల‌కు దూర‌మయ్యారు.
ప్ర‌భుత్వ స్పంద‌న ఎలా ఉంది..
స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రభుత్వం న‌లుగురు ఐఏఎస్‌ల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది. చ‌ర్చ‌ల సంద‌ర్భంగా కమిటీ స‌మ‌స్య‌ల అధ్య‌యనానికి నాలుగు వారాల గ‌డువు కోర‌గా కార్మిక సంఘాలు నిరాక‌రించాయి. సంస్థ ప్ర‌యోజ‌నాలు దృష్టిలో పెట్టుకుని కార్మికులంతా విధులకు హాజ‌రు కావాల‌ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోరారు. కాగా, త్వ‌ర‌లోనే మ‌రోమారు కార్మికుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం లేక‌పోలేదని తెలుస్తోంది.
‘మ‌హాల‌క్ష్మి’పై ప్ర‌భావం..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు ప‌ది వేల వ‌ర‌కు బ‌స్సులు డిపోల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. దాదాపు 60లక్ష‌ల‌కు పైగా ప్ర‌యాణికుల‌కు ఇక్క‌ట్లు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ద్వారా ఉచితంగా ప్ర‌యాణించే మ‌హిళ‌లు మ‌ళ్లీ ప్రైవేట్ వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తూ ఇబ్బందులు ప‌డుతున్నారు.

జాగృతి సంపూర్ణ మ‌ద్ద‌తు
( – క‌విత‌, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు)
ఆర్టీసీ కార్మికులంటే ప్రభుత్వం లెక్కలేనితనంతో వ్యవహరిస్తోంది. వారి న్యాయ‌మైన డిమాండ్లను వెంట‌నే నెర‌వేర్చాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాలి. సమ్మెకు తెలంగాణ జాగృతి త‌ర‌ఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.

ఇది కూడా చదవండి :  డైలాగ్ వార్స్‌.. హీటెక్కిన పాలిటిక్స్

Revnath, Kcr | డైలాగ్స్ వార్.. హీటెక్కిన పాలిటిక్స్!

Revnath, Kcr | రాష్ట్రంలో ఓ వైపు ఎండ‌లు మండిపోతుండ‌గా.. మ‌రోవైపు ప్ర‌ధాన పార్టీల నేత‌ల‌ డైలాగ్స్ పాలిటిక్స్ ను హీటెక్కించాయి. కాళేశ్వ‌రం ప‌ర్య‌ట‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) బీఆర్ఎస్‌పై విరుచుకుప‌డ‌గా.. జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్ (Kcr) కాంగ్రెస్ పాల‌న‌పై మండిప‌డ్డారు. ఒకే రోజు రెండు స‌భ‌ల్లో సీఎం, మాజీ సీఎం మాట‌ల‌ తూటాలు పేల్చారు. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు విసురుకున్నారు. వ‌చ్చేది బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వ‌మే అని గులాబీ బాస్ అంటే.. ప్ర‌తి ప‌క్షం కూడా ద‌క్క‌కుండా చేస్తాన‌ని రేవంత్ స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

సీఎం రేవంత్ ఇలా..
‘తోడెలు బ‌య‌టకెళ్లింది.. ఆ గుండెల‌ద‌రాలే.. ‘ అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి స్పీచ్ మొద‌లుపెట్టిన సీఎం రేవంత్‌.. జీవ‌న్‌రెడ్డి తాజా వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. ‘ ప్ర‌జా పాల‌న ఎందుకు పోవాలె.. పామ్ హౌస్‌ల పండుకున్న పాపాలభైర‌వుడు ఎందుకు అధికారంలోకి రావాలే..’ అంటూ కాంగ్రెస్ నుంచి పోయిన జీవ‌న్‌రెడ్డిని త‌న‌దైన శైలిలో అరుసుకున్నారు. ‘ నువ్వు.. ఓ పెద్ద మ‌నిషివా ‘ అంటూ ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్‌ను ప్ర‌స్తావిస్తూ.. ‘ కాళేశ్వ‌రం పేరిట రూ.ల‌క్ష కోట్ల గోదారిలో క‌లిపితివి.. క‌డుపు మండుతంది.. ఆట‌విక రాజ్య‌మైతే అడ‌విలో చెట్టుకు ఉరేసేటోళ్లు.. నిజాం స‌ర్కారైతే ఊర్ల కోదండ‌మేసి.. లాగుల తొండ‌లిడిసేటోళ్లు..’ అంటూ తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. ‘ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నీకున్న ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఊడ‌గొట్ట‌కుంటే నా పేరు మార్చ‌కుంట బిడ్డ.. 2023లో నిన్ను ఓడ‌గొట్టిన‌.. 2024నీకు గుండు సున్న ఇచ్చిన‌.. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పాత‌రేసిన‌.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఉక్కు పాత‌రేసిన.. జూబ్లిహిల్స్‌, కంటోన్‌మెంట్‌లో నీకు ఘోరి క‌ట్టిన‌.. వ‌చ్చేసారి ఆ ఘోరి మీద మా కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్‌ జెండా ఎగ‌రేస్త‌రు.. ఇదే నా స‌వాల్‌..’ అంటూ స్ప‌ష్టం చేసిన‌ సీఎం.. ‘ ఇగ చూసుకుందాం కేసీఆర్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నువ్వా..నేనా .. ప్ర‌జా పాల‌నా.. పాపాల బైర‌వుడా..’ అంటూ స‌వాల్ విసిరారు. ‘ ఎన్నిక‌లెప్పుడొచ్చినా రాసిపెట్టుకో.. జ‌గిత్యాలలో నిన్ను రాజ‌కీయంగా వంద మీట‌ర్ల గోతి తీసి పాత‌రేసే కార్య‌క్ర‌మం మా కార్త‌క‌ర్త‌లు తీసుకుంటరు..’ అని తీవ్రంగా విమ‌ర్శించారు. ‘ఏడాది ఓపిక ప‌ట్ట‌లేక శ‌త్రువుతో చేతులు క‌లిపిన జీవ‌న్‌రెడ్డికి సిగ్గుండాలే ..’అంటూ ఘాటుగా స్పందించారు.

కేసీఆర్ ఇలా..
‘ ఆరు నూరైనా వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే.. అప్పుడు జీవ‌న్‌రెడ్డి మంచి ప‌ద‌విలో ఉంటార‌ని..’ ప్ర‌సంగం షురూ చేసిన గులాబీ బాస్ తెలంగాణ ఉద్య‌మ ప్ర‌స్తానాన్ని త‌న‌దైన శైలిలో వివ‌రించారు. కాంగ్రెస్ పాల‌న‌లో వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. ‘ గ‌తంలో ప్ర‌తీ ఇంటికి మిష‌న్ భ‌గీర‌థ నీళ్లిచ్చిన‌మ్‌.. ఇప్ప‌డేం రోగం పుట్టింది.. ఇప్పుడెందుకు ఆ ప‌థ‌కం కుంటుతంది.. ఎందుకు నీళ్లు వ‌స్త‌లేవు.. దీనికి చేయాల్సింది ఒక్క‌టే.. లాగులు ప‌లిగేదాకా సంపాలె.. క‌ట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి.. ఐదేండ్లు న‌డిచింది గ‌దా.. మరి మీకేం బీమారొచ్చంది.. నాక‌ర్థం కాదు.. ఇంతింత మాట‌లు.. అడ్డం.. పొడుగు మాట్లాడొత్త‌దా.. పొద్దున్లేత్తే కేసీఆర్ చావాలె.. నువ్వు వెయ్యి జ‌న్మ‌లెత్తినా నేను చావ‌ను నా కొడ‌కా.. అనుకుంటున్నావేమో.. పిల్లి శాపానికి ఉట్టి తెగుత‌దా.. ఈ వెద‌వ‌లు కేసీఆర్ సావాలంటే కేసీఆర్ స‌త్త‌డా..’ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక‌ ‘బోడ‌గుండు హైడ్రాను తెచ్చి ఆగ‌మాగం చేస్తుండ్రు.. బీఆర్ఎస్ గ‌వ‌ర్నమెంట్ రాగానే దానిని ఎత్తి అవ‌త‌ల పడేస్త‌..’ అంటూ త‌న మార్కు పంచులతో శ్రేణుల్లో జోష్ పెంచారు గులాబీ బాస్‌.

ఇది కూడా చదవండి :  రేవంత్ కాంగ్రెస్.. 

Kavitha party | కొత్త పార్టీ వైపు.. అందరి చూపు

Kavitha party | ఏప్రిల్ 25.. క‌విత కొత్త పార్టీ ఆవిర్భావం. మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆ తేదీ స‌మీపిస్తున్న‌ త‌రుణంలో చేరికలు ఊపందుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆమెతో ట‌చ్‌లోకి వచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పేరున్ననేత‌లు ముందుకు రాక‌పోవ‌డంతో తాజా ప‌రిణామాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి క‌ల‌గిస్తున్నాయి.
అన్ని పార్టీల నుంచి..?
కేసీఆర్ త‌న‌య కావ‌డంతో పాటు ఉద్య‌మ స‌మ‌యంలో జాగృతి ద్వారా బ‌తుక‌మ్మ ఫేంగా నిలిచిన‌ క‌వితకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక చాలా మంది పేరున్న నేత‌లు త‌న‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు ఆమె గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే వారి పేర్లు మాత్రం వెల్ల‌డంచలేదు. కొత్త పార్టీ ఏర్పాటుకు స‌మ‌యం ఆస‌న్నం కావ‌డంతో ఆయా నేత‌లు ప్ర‌స్తుతం తామున్న పార్టీల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ‌గా ప్ర‌ధాన పార్టీలకు చెందిన వారు ఉన్న‌ట్లుగా స‌మాచారం.
బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్‌..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ ఆదివారం జాగృతిలో చేరారు. ఈయ‌న ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసి క‌విత స‌మ‌క్షంలో జాగృతి కండువా క‌ప్పుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌ధాన పార్టీల్లో అల‌జడి మొద‌లైంది. ఇప్ప‌టి వ‌రకు పేరున్న నేత‌ల జాయినింగ్ లేక‌పోవ‌డంతో ప్ర‌ధాన పార్టీలు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. తాజా ప‌రిణామాల‌తో అల‌ర్ట్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ చేరిక‌లు ఉండే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవ‌ల‌ నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ భారీ అనుచర గ‌ణంతో జాగృతిలో చేరిన విష‌యం తెలిసిందే.
డీలిమిటేషన్ లేకపోవడంతో..
ఈసారి రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు డీలిమిటేషన్ ఆధారంగా ఉంటాయని నిన్న మొన్నటి వరకు ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్డీఏ ప్ర‌భుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గాలు పెరుగుతాయని ఆశపడ్డ చాలామందికి నిరాశే ఎదురైంది. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న వారు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. దాదాపు ప్ర‌ధాన రాజకీయ పార్టీల్లో ఇప్పుడున్న స్థానాల్లో పోటీ ఉండడంతో భవిష్యత్ పరిణామాలను బెరీజు వేసుకుంటూ ప‌లువురు దారులు వెతుక్కుంటున్నారు. అనువైన వేదికలను ఎంచుకుంటున్నారు. కొత్త పార్టీల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో అంద‌రి చూపు జాగృతి వైపు ప‌డింది. మున్ముందు చేరిక‌లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి :  రేవంత్ కాంగ్రెస్..!

Mark Politcs | రేవంత్ కాంగ్రెస్..!

Mark politcs | కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. అయినా పదేళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. క్షేత్రస్థాయిలో కేడర్ ఉన్నా సమన్వయ పరిచే లీడర్ లేడనే విమర్శలు వెల్లువెత్తాయి. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన గులాబీ పార్టీ తమకు ఎదురు లేదనుకుని దేశ రాజకీయాల వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలో ‘హస్తం’ అందుకున్న రేవంత్.. రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించారు. ముఖ్యమంత్రిగా కొలువుదీరి.. గులాబీ బాస్ ను ‘హౌస్’కు పరిమితం చేశారు.
మార్క్ చూపుతూ..
కాంగ్రెస్ రాజ‌కీయాల్లో సీఎం రేవంత్ మార్క్ చూపుతున్నారు. పార్టీలో పాతుకుపోయిన‌ వ‌ర్గ‌పోరు, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లకు చెక్ పెడుతూనే.. విప‌క్షాల‌కు పంచ్ డైలాగ్‌లతో చుక్క‌లు చూపుతున్నారు. పాలి’ట్రిక్స్‌’కు ప‌దునుపెడుతూ ఉద్య‌మ‌నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజ‌కీయాల్లోనూ చ‌తురుత ప్ర‌దర్శిస్తూ అధిష్టానానికి చేరువ‌వుతున్నారు. రాజ‌న్న మాదిరిగా రే’వ‌న్’తన్న‌గా మారాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు.
కౌంట‌ర్ స‌భ‌కు శ్రీ‌కారం..
సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి ఇటీవ‌ల కాంగ్రెస్ ను వీడారు. ‘కారు’ గూటికి చేరువ‌య్యారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం జ‌గిత్యాల స‌భ ద్వారా ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు. అధికారం కోల్పోయాక‌ ఎక్కువగా ఫాంహౌస్‌కే ప‌రిమిత‌మైన కేసీఆర్ (Kcr) చాలాకాలం త‌ర్వాత ఈ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల తర్వాత బ‌ల‌హీనమైన ఆ పార్టీకి ఉత్త‌ర తెలంగాణ వేదిక‌గా తిరిగి జ‌వ‌స‌త్వాలు నింపేందుకు గులాబీ బాస్ సిద్ధ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) వ్యూహాత్మ‌కంగా కాళేశ్వ‌రం అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. కౌంట‌ర్‌గా అదే రోజున మేడిగ‌డ్డ వ‌ద్ద భారీ బ‌హిరంగ స‌భ‌కు సిద్ధ‌మ‌య్యారు.
టార్గెట్ బీఆర్ఎస్సే..
దాదాపు రూ.లక్ష కోట్ల‌తో క‌ట్టిన కాళేశ్వరం.. కూలేశ్వ‌రంగా మారింద‌ని.. ఇప్ప‌టికే ప్రాజెక్టు అవినితీపై ప‌లు వేదిక‌ల ద్వారా ఎండ‌గ‌ట్టిన ముఖ్య‌మంత్రి మ‌రోసారి బీఆర్ఎస్ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేసేందుకే ఈ స‌భ నిర్వహిస్తున్న‌ట్లుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో టాక్. కుంగిన మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఆ రోజున పరిశీలించ‌నున్నారు. పునరుద్ధరణ పనులపై అధికారులతో సమీక్షించి.. అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో త‌న పంచ్ డైలాగ్‌లతో గులాబీ పార్టీపై విరుచుకుప‌డే అవకాశం లేక‌పోలేదు.
అధిష్టానానికి చేరువ‌వుతూ..
డీలిమిటిష‌న్ కు సంబంధించి లోక్‌స‌భ‌లో 50శాతం సీట్ల పెంపు అంశంపై.. ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌కు తీరని అన్యాయం జ‌రుగుతుంద‌ని మొద‌టి నుంచి గొంతెత్తిన రేవంత్.. హైబ్రిడ్ మోడ‌ల్ అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. ఆయా రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రుల‌ను ఏక‌ తాటిపైకి తేవ‌డంలో స‌ఫ‌లీకృతం అయ్యారు. తాజాగా 131వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ బిల్లు వీగిపోవ‌డంలో సీఎం ఎనుముల కీల‌కపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలోనూ ప‌డ్డారు. ఫ‌లితంగా మూడు బిల్లుల‌ను ఒకేసారి చ‌ట్టాలుగా మార్చుదామ‌నుకున్న బీజేపీ స‌ర్కారుకూ గ‌ట్టి షాక్ ఇచ్చారు.
పార్టీ బ‌లోపేతం దిశ‌గా..
మ‌రోవైపు పార్టీలో వ‌ర్గ‌పోరుకు క్ర‌మంగా చెక్ పెడుతూ వ‌స్తున్నారు. గీత దాటే నేత‌ల విష‌యంలో అధిష్టానానికి వివ‌రిస్తూ త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పార్టీపై నెగిటివ్ ప్ర‌భావం ప‌డ‌కుండా పావులు క‌దుపుతున్నారు. తాజాగా వెలుగుమ‌ట్ల ఘ‌ట‌న విష‌యంలో న‌ష్టాన్ని గుర్తించిన ఆయ‌న మ‌రింత‌ పెర‌గ‌కుండా స‌త్వ‌ర చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో ‘హ‌స్తం’ బ‌లోపేతంపై ఫోక‌స్ పెంచారు. పార్టీ ర‌హిత ఎన్నిక‌లు అయినా పంచాయ‌తీ పోరును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఫ‌లితాల‌పై ప్ర‌భావం చూపారు. మున్సిప‌ల్ లోనూ అదే తీరు కొన‌సాగించారు. రానున్న ప‌రిష‌త్‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ ఇదే ఒర‌వ‌డి కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. నాడు రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హరించిన తీరును అనుస‌రిస్తున్నారు. రే’వ‌న్‌’త‌న్న‌గా ప్ర‌జ‌ల గుండెల్లో ముద్రవేసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు.

ఇది కూడా చదవండి :  కులం లెక్కలు.. ఐక్యతా రాగాలు..మారనున్న రాజకీయాలు

Caste Caluclations | కులం లెక్కలు.. ఐక్యతా రాగాలు..మారనున్న రాజకీయాలు

Caste Caluclations | కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక, కుల గ‌ణ‌న‌ సర్వే (SEEEPC)నివేదికతో ఆయా వర్గాల్లో ఐక్యతా రాగం మొదలైంది. ఇప్పటికే తమ జనాభా వివరాలను తెలుసుకొని ప‌లు రంగాల్లో తమ పరిస్థితిని అంచనా వేసుకుంటున్నారు. ప్రధానంగా రాజకీయ అంశంపై చర్చించుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా సర్వత్రా చర్చ
కుల గణనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మేరకు ఆయా వర్గాలు తమ జనాభా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న గణాంకాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రాజకీయ ఆసక్తి ఉన్నవారు పొలిటికల్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికపైనే చర్చకు తెర లేపుతున్నారు. కుల చైతన్య ఆవశ్యకతను వివరిస్తున్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని సూచిస్తున్నారు.
యువత ముందడుగు
రాజకీయాల్లోకి ఒక‌ప్పుడు నాలుగు పదుల వయసు దాటాకే వచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యువత మిగతా రంగాలతో పాటు రాజకీయాలపై ఆసక్తి చూపుతుంది. రిజర్వేషన్లు కూడా కలిసి వచ్చిన చోట ఇప్పటికే గ్రామ, పట్టణ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపారు కూడా. ఈ క్రమంలో తాజాగా.. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ఇప్పటినుంచి గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తమ సామాజిక వర్గం ఓట్లపై ఫోకస్ పెంచుతున్నారు. క్షేత్రస్థాయిలో యువతను ఆకర్షించడంపై దృష్టి సారిస్తున్నారు. ‘మన ఓట్లు మన సీట్లు’గా మారాలంటూ ఐక్యత రాగం అందుకుంటున్నారు. ఈ పరిణామాలను ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్ర‌ధాన‌ సామాజిక వర్గాలు తమ వైపు ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఈ సర్వే అంశాలే చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి : ఏ కులం వారు ఎంతమంది.. అధికారిక లెక్కలొచ్చినయ్

Caste Survey | ఏ కులం వారు ఎంతమంది.. అధికారిక లెక్కలొచ్చినయ్

Caste Survey | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పై దృష్టి సారించింది. ఈ మేరకు చేపట్టిన తెలంగాణ సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్‌మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ (SEEEPC) సర్వే -2024 వివరాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.  

  • సామాజిక వర్గాల వారీగా..
    రాష్ట్రంలో మొత్తం కోటి 12 లక్షల 36 వేల 849 (96.9) శాతం కుటుంబాలను సర్వే చేసింది. మొత్తం 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మంది వివరాలను సేకరించింది. ఇందులో కులాలవారీగా బీసీలు అత్యధికంగా ఉన్నట్లుగా తేల్చింది. వీరు మొత్తం జనాభాలో 56.33(1,99,85,767) శాతం (ఇందులో బీసీ ముస్లింలు 10.08శాతం) ఉండగా.. అలాగే ఎస్సీలు 17. 43 శాతం (61,84,319), ఎస్టీలు 10.45(37,05,929) ఉన్నారు. ఓసీ ముస్లింలు 8,80,424(2.48శాతం), ఓసీలు 44,1,115(13.31శాతం),మిగ‌తా కులాలు 56,01,539(15.79శాతం) ఉన్నారు.
  • కులాల వారీగా ప‌రిశీలిస్తే..
    – మాదిగ సామాజికవర్గం 36,57,551మంది(10.3శాతం)తో టాప్‌లో ఉంది. రెండో స్థానంలో ముదిరాజ్‌(7.4శాతం)లు ఉన్నారు. లంబాడా(బంజారా)లు 24,04,056(6.8శాతం) మందితో మూడో స్థానంలో, యాదవులు (5.7శాతం) 4వ స్థానం, రెడ్డి సామాజిక వర్గం 5వ స్థానంలో ఉన్నారు. ఇక కులం చెప్ప‌ని వారు 11,96,482 (3.4శాతం) ఉన్నారు.
  • జెండర్ ఆధారంగా..
    మొత్తం జ‌నాభాలో 1,79,21,183 మంది (50.51శాతం) పురుషులు ఉన్నారు. మ‌హిళ‌లు 1.75,42,597 (49.45 శాతం), థ‌ర్డ్ జెండ‌ర్ 13,774 మంది (0.04) ఉన్నారు.
  • బీసీల్లో ముదిరాజ్‌లు టాప్‌..
    బీసీల విష‌యానికి వ‌స్తే 1,64,09,179 (46.25శాతం) ఉన్నారు. ఇందులో అత్య‌ధికంగా ముదిరాజ్ సామాజిక వ‌ర్గం ఉంది. వీరి జ‌నాభా 26,39, 027( మొత్తం జ‌నాభాలో 7.4శాతం) ఉన్నారు. త‌ర్వాతి స్థానాల్లో యాద‌వులు 20,18,725(5.7శాతం) ఉన్నారు. మూడో స్థానంలో గౌడ సామాజిక వ‌ర్గం 16,30,187 మంది (4.6శాతం) ఉన్నారు.
    మున్నూరు కాపు 13,75,018(3.9 శాతం)
    ప‌ద్మ‌శాలీలు 11,82.252మంది (3.3శాతం)
    రజకులు 9,95,972 మంది(2.8శాతం)
    కురుమ 7,95, 822 (2.2శాతం)
    ఒడ్డెర 6 ,43,571(1.8శాతం)
    అగ్నికుల క్షత్రియ 5,27, 119(1.5శాతం)
    నాయీ బ్రాహ్మణులు 4,33,785(1.2శాతం)
    కుమ్మర 4,31,363(1.2శాతం)
    వడ్రంగి 4,07,927(1.1శాతం)
    వాల్మీకి, బోయ 3,59,230(1.0శాతం)
    దూదేకుల 2,69,699(0.8శాతం)
    స్వర్ణకార 2, 48,965(0.7శాతం)
    పెరిక 2,30,851(0.6శాతం)
    కమ్మరి 1,65,726(0.5శాతం)
    ఉప్పర 1,24,148((0.3శాతం)
    గంగి రెద్దుల 92,430((0.3శాతం)
    మేదరి 77,645(0.2శాతం)
  • ఇది కూడా చదవండి :  అక్కడ రూ.2లకే లీటర్ పెట్రోల్!

Junk Food | తల్లులూ.. మీ పిల్లలు జాగ్రత్త..! ఈ ఫుడ్ కు కాస్త దూరంగా ఉంచండి

Junk Food | త్వరలోనే వేసవి సెలవులు రాబోతున్నాయి. తల్లుల్లారా.. మీ పిల్లల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వైద్య నిపుణులు సూచిస్తున్న జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచండి. అవి ఏంటి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఓ సారి తెలుసుకుందామా మరి.

1. ఆలూచిప్స్: అతిగా ప్రాసెస్ చేయబడిన వీటిలో సోడియం, కొవ్వు, క్యాలరీలు ఎక్కువ. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒబెసిటీ, బీపీ, గుండె జబ్బులకు దారితీస్తాయి. అక్రిలమైడ్ అనే రసాయనంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది.

2. వైట్ బ్రెడ్: మైదాతో చేసిన వైట్ బెడ్ లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఫలితంగా షుగర్ లెవల్స్ పెరిగి టైప్ 2 డయాబెటిక్ వచ్చే అవకాశం లేకపోలేదు.

3. ప్రాసెస్డ్ మీట్ : ప్రాసెసింగ్ చేసిన మాంసం( సూపర్ మార్కెట్లలో లభించే రెడ్ మీట్)తో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

4. ఫ్రెంచ్ ఫ్రైస్ : టేస్టీ స్నాక్ గా పేరున్న వీటిని తరచూ తింటే (వారంలో మూడు సార్లకు మించితే) ఒబెసిటీ, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిక్, క్యాన్సర్ కూ దారి తీయవచ్చు. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల అధ్యయంలో ఇది తేలింది.

5. బర్గర్ : ఇందులో కొవ్వు, క్యాలరీలు అధికం. తరచూ తింటే ఒబెసిటీ బారిన పడతారు. కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు తలెత్తుతాయి.

6. కుకీస్ ; వీటి తయారీలో వినియోగించే ఛాన్స్ పాడ్స్, హైడ్రోజనెట్స్ ఆయిల్స్ తో అనారోగ్య సమస్యలు వస్తాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు పేర్కొంటున్నారు.

7. మైక్రో ఓవుడ్ పాప్ కార్న్ : మైక్రో ఓవెన్ లో తయారు చేసే పాప్ కార్న్ లో అక్టోనోలీడ్ యాసిడ్స్ చేరి లివర్, బ్లాడర్ క్యాన్సర్ కు దారి తీయవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

8. డోనట్స్ : మైదాతో చేసిన వీటిలో కొవ్వు, అధిక కేలరీలు ఉండడం వల్ల ఒబెసిటీ, టైప్-2 డయాబెటిక్, గుండె సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి

9. ఐస్ క్రీమ్: సమ్మర్ లో వీటిని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం బారిన పడడంతో పాటు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.

10. కేక్ : ఇందులో రసాయనాలు, కృత్రిమ రంగులు ఎక్కువగా వాడడం వల్ల అలర్జీ,శాస సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి పేరెంట్స్ వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం.

ఇది కూడా చదవండి : టెట్ సరే.. డీఎస్సీ ఎప్పుడు?

US-Iran talks | రెండో విడత చర్చలకు సిద్ధమా.. ఈసారి వేదిక జెనీవానా..?

US-Iran talks | పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ వేదికగా అమెరికా(america), ఇరాన్(iran) మధ్య జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి చర్చలకు సిద్ధమని రెండు దేశాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఈసారి వేదిక మారనున్నట్టుగా తెలుస్తుంది.
ఈ నెల 21వరకు సీజ్ ఫైర్

ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు 39 రోజుల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాలు చర్చలను స్వాగతిస్తూ రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ సీజ్ ఫైర్ కు ఈ నెల 21వరకు గడువు ఉంది. అప్పటివరకు మరోసారి చర్చలు జరిపేందుకు అటు వైట్ హౌస్ నుంచి.. ఇటు ఇరాన్ నుంచి తాజాగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినా ఇరాన్ కండిషన్స్ అప్లైగా పేర్కొంటుడడం గమనార్హం.
వేదిక మారనుందా..
తొలి విడత చర్చలకు సంబంధించి పాక్ వైఖరి పై ఇరాన్ కొంత గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అమెరికా వ్యూహంలో భాగంగా పాక్ వ్యవహరిస్తుందంటూ చర్చల అనంతరం ఆ దేశ డెలిగేట్స్ ఇచ్చిన లీకుల ఆధారంగా బయటకు వచ్చింది. ఈ క్రమంలో కొంత శాంతి ప్రదేశంగా పేరున్న జెనీవా వేదికను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు చైనా, రష్యా, ఇండియా కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా అణు కార్యక్రమం, హోర్ముజ్ జల సంధి పీఠముడిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇజ్రాయిల్ కూడా ఈసారి చర్చల్లో తప్పనిసరిగా ఉండాలని ఇరాన్ పట్టుబడుతుంది. అయితే తదుపరి చర్చలు ఎక్కడ ఉంటాయి.. ఈసారి ట్రంప్ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : హోర్ముజ్.. ‘సంధి’ చిన్నది.. రవాణా పెద్దది

NFBS | దుఃఖంలో బాసటగా.. కుటుంబ పెద్ద మరణిస్తే కేంద్ర సాయం

NFBS | అనుకోని సందర్భంలో కుటుంబ పెద్దను కోల్పోతే బాధిత కుటుంబానికి కేంద్రం అండగా నిలుస్తోంది. ఆర్థిక సాయం అందిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (NFBS)గా ఏప్రిల్,12, 2017 నుంచి ఈ పథకం అమలవుతుంది.
పథకం వివరాలు
* 18 నుంచి 59 సంవత్సరాల మధ్య గల కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయం అందుతుంది.
* మృతుడు బీపీఎల్ జాబితాలో ఉండాలి.
* సహజ/ ప్రమాద మరణం ఏదైనా వర్తిస్తుంది.
ఈ డాక్యుమెంట్స్ కావాలి
* మృతుడి డెత్ సర్టిఫికెట్
* ఆధార్ కార్డ్
* రేషన్ / బీపీఎల్ కార్డ్
* బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
* కుటుంబ సభ్యుల గుర్తింపు వివరాలు
* పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
అప్లై చేసుకోవాలిలా..
* మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఎంపీడీవో ద్వారా,పట్టణ ప్రాంతంలో వారికి మున్సిపల్ కమిషనర్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.
* గమనిక : మరణం సంభవించిన తేదీ నుంచి రెండేళ్లలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఇది కూడా చదవండి :  టెట్ సరే.. డీఎస్సీ ఎప్పుడు?

Dsc | టెట్ సరే.. డీఎస్సీ ఎప్పుడు?

Dsc | డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసుకుని ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా కేవలం టెట్ నిర్వహిణకే సర్కారు పరిమితమవుతుందన్న విమర్శ వారి నుంచి వినిపిస్తుంది.
మరోసారి టెట్
టెట్నో(tet) టిఫికేషన్ ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈనెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. జూన్ 9 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ ఉంటుందని పేర్కొంది. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ వచ్చాక కేవలం రెండు సార్లు మాత్రమే
నీళ్లు..నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్తో తెచ్చుకున్న తెలంగాణలో పుష్కరకాలంగా కేవలం రెండుసార్లు మాత్రమే డీఎస్సీ నిర్వహించడం పరిస్థితికి అద్దం పడుతుంది. 2017 అక్టోబర్ లో తొలిసారిగా, 2024 డిసెంబర్ లో రెండోసారి ఈ నియామక పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వాలకు నిరుద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
లక్షల్లో అభ్యర్థులు
రాష్ట్రంలో బీఈడీ(bed), డీఈడీ(ded) పూర్తి చేసిన అభ్యర్థుల ప్రస్తుతం 3లక్షలకు పైనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏటా నిర్వహించే టెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 9సార్లు టెట్ నిర్వహించగా.. కేవలం రెండుసార్లు మాత్రమే డీఎస్సీ నిర్వహించడం గమనార్హం.
పోస్టులు వందల్లో.. పోటీ వేలల్లో
గత రెండు డీఎస్సీల్లోనూ చాలా జిల్లాల్లో పోస్టుల సంఖ్య వంద నుంచి మూడు వందలు లోపు మాత్రమే ఉండగా.. సబ్జెక్టుల వారీగా ఈ సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. మరికొన్ని చోట్ల ఒక్కటి కూడా లేకపోవడం పరిస్థితికి అర్థం పడుతుంది. ఈ క్రమంలో పుస్తకాలతో అహోరాత్రులు కుస్తీ పట్టిన అభ్యర్థులు రిజర్వేషన్ కలిసి రాకో.. సల్ప తేడాతో ఉద్యోగానికి దూరమైన వారు ఎందరో . అలాంటి వారు మరో అవకాశం కోసం పుస్తకాలను వీడకుండా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
డీఎస్సీ అవసరమంటున్న విద్యావేత్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తూనే ఉంది. సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఆర్థిక భారమైన ప్రైవేటుకు పంపేందుకు వెనుకాడడం లేదు. పాఠశాల విద్యను బలోపేతం చేయాలనుకున్న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి నూతన విద్యా సంవత్సరం వరకు ఉపాధ్యాయులను అందుబాటులోకి తేవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అక్కడ రూ.2లకే లీటర్ పెట్రోల్