Monday, July 27, 2026
Home Blog Page 8

Good News TRS | కవిత పార్టీకి గుడ్ న్యూస్.. టీఆర్ఎస్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్

Good News TRS | కల్వకుంట్ల కవిత ఇటీవల టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆ పార్టీకి గుర్తింపు లభించింది. ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో పార్టీకి సంబంధించిన అనుమతి లేఖ అందజేశారు.
సస్పెన్స్ కు తెర
ఈనెల 25న మేడ్చల్ లోని అద్వయ కన్వేషన్ లో టీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కవిత ప్రకటించే విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి ఈసీ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదని ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం వెలువరించింది. “తెలంగాణ రక్షణ సేన”(TRS) పేరును ఆమోదించింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
ఐదు పేర్ల‌ను ప్ర‌తిపాదించిన క‌విత‌..
తెలంగాణ ప్రజా జాగృతి,తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన,తెలంగాణ రాష్ట్ర జాగృతి,తెలంగాణ ప్రజాశక్తి పేర్లలో ఒక పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కవిత కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. ఈ క్ర‌మంలో అప్లికేషన్ లో మూడో పేరుగా పెట్టిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కు సీఈసీ ఆమోదం తెలిపింది. కాగా, విధి కవిత వైపు నిలిచి టీఆర్ఎస్ పేరును ఆమెకు వచ్చేలా చేసిందని తెలంగాణ రక్షణ సేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే మళ్లీ జిల్లాల బాట
గతంలో జాగృతి పేరిట జనం బాట పట్టిన కవిత తాజాగా పార్టీ ఏర్పాటు తర్వాత తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. జనం బాటలో భాగంగా మిగిలిన జిల్లాలను ఈ విడ‌త‌లో టీఆర్ఎస్ అధ్యక్షురాలు హోదాలో ఆమె చుట్టి రానున్నారు. అలాగే భారీగా చేరిక‌ల‌పై కూడా దృష్టి సారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి.. జూన్ 2.. నిరుద్యోగులకు తీపి కబురు అందబోతుందా

Job Notifications | జూన్ 2.. నిరుద్యోగులకు తీపి కబురు అందబోతుందా

Job Notifications | నీళ్లు.. నిధులు.. నియామకాలు.. నినాదంతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నా.. నియామకాల విషయంలో ఇప్పటికీ నిరుద్యోగుల్లో నిరాశే వ్యక్తమవుతోంది. తెలంగాణ‌ (Telangana) ఏర్పడి పుష్కరకాలం దాటినా ఆశించిన నోటిఫికేషన్లు రాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఏళ్లు గ‌డుస్తున్నా స‌ర్కారు కొలువు అంద‌ని ద్రాక్ష‌గా మారింద‌నే ఆవేద‌న వారి నుంచి వినిపిస్తోంది.
వయసు మించిపోతుంది
ఉద్యమ సమయంలో డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర ఉన్నత విద్య పూర్తిచేసిన యువత రాష్ట్రం వస్తే తమ బ‌తుకులు బాగుప‌డతాయ‌ని భావించారు. ప్ర‌భుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఆశించారు. ఈ క్ర‌మంలో పోరుబాట‌లో ముందు భాగంలో నిలిచారు. అరెస్టులు, నిర్బంధాల‌ను సైతం లెక్క‌చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు 2014లో స్వ‌రాష్ట్రం సిద్ధించింది. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ ప‌ట్టభ‌ద్రుల ఆశ‌లు మాత్రం నెర‌వేర‌ని ప‌రిస్థితి. దశాబ్దం గడిచినా ప్ర‌భుత్వం అడ‌పాద‌డ‌పా నోటిఫికేష‌న్ల‌కు మాత్ర‌మే పరిమితం కావ‌డం.. మ‌రోవైపు కోవిడ్ సైతం అనేక కుటుంబాలను ఛిద్రం చేసిన విష‌యం తెలిసిందే. ఫ‌లితంగా చాలామంది తాత్కాలిక ఉపాధి మార్గాల వైపు మ‌ళ్లారు. రేపో.. మాపో భారీ నోటిఫికేషన్లు రాక‌పోతాయా.. అనే గంపెడాశ‌తో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈక్ర‌మంలో ఏజ్ బార్ అవుతుండ‌డం వారిలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక త‌మ‌కు గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం క‌లేనా అనే భావ‌న వారి నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.
కాంగ్రెస్ స‌ర్కారుపై ఆశ‌లు
ప‌దేళ్ల పాటు ఉద్య‌మ పార్టీ అధికారంలో ఉన్నా త‌మ ఆశ‌లు నెర‌వేర‌లేద‌ని భావించిన నిరుద్యోగులు ఆ పార్టీపై త‌మ కోపాన్ని ఓటు రూపంలో వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ స‌ర్కారును కోరి తెచ్చుకున్నారు. అయితే ‘హ‌స్తం’ పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు స‌మీపిస్తున్నా ప‌రిస్థితిలో మార్పు రాక‌పోవ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ స‌ర్కారు తాజాగా నియామ‌కాల భ‌ర్తీపై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.
అంద‌రి చూపు జూన్ 2 వైపే..
తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వమైన జూన్ 2న ప‌లు నోటిఫికేష‌న్లు జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవాల‌ని టీజీపీఎస్సీ (TGPSC) ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఆ ప్ర‌కారమే రానున్న నోటిఫికేష‌న్లకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద‌ని సూచించింది.
2500 పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు
ఆర్థిక శాఖ నుంచి వ‌చ్చిన క్లియరెన్స్ మేర‌కు త్వ‌ర‌లోనే సుమారు 2500 పోస్టుల భ‌ర్తీకీ టీజీపీఎస్సీ చ‌ర్య‌లు చేప‌డుతుంది. పీసీబీ, టౌన్ ప్లానింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్, విద్య త‌దిత‌ర శాఖ‌ల్లో సంబంధిత ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి..  పెట్రో కొర‌త నిజ‌మేనా.. ప్ర‌భుత్వం ఏం చెబుతుంది

Petrol shortage | పెట్రో కొర‌త నిజమేనా.. ప్ర‌భుత్వం ఏం చెబుతుంది

Petrol shortage | రాష్ట్రంలో పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ కొరత పుకార‍్లతో జనం ఇక్కట్లు పడుతున్నారు. అవసరం లేకున్నా ఉదయాన్నే బంకుల బాట పడుతున్నారు. గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఫలితంగా చాలా చోట్ల నోస్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
యుద్ధ ప్రభావం..
పశ్చిమాసియాలో యుద్ధం క్రూడాయిల్ సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఆయిల్‌ కంపెనీలు డీలర్లకు క్రెడిట్‌పై ఇచ్చే విధానానికి స్వస్తి పలికాయి. నగదు ఇచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో గతంతో పోల్చితే కొంత సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రభావం ఉండగా అక్కడ చాలా బంకుల్లో తాజాగా లిమిట్ ప్రకారం ఇంధనం విక్రయిస్తున్న పరిస్థితి. దీంతో తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. సోషల్‌ మీడియా పుకార్లతో చాలా మంది అవసరం లేకున్నా ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు బుధవారం నిర్వహించారు. పోలింగ్‌ తర్వాత కేంద్రం చమురు ధరలు పెంచుతుందనే ఊహాగానాలతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే రద్దీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
బంకులు ఎదుట బారులు
రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల బంక్‌లు ఉదయం నుంచే వినియోగదారులతో బారులు తీరి దర్శనమిస్తున్నాయి. వాహనదారులు గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కొన్ని చోట్ల నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని భావిస్తున్న వాహనదారులు అవసరం లేకున్నా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
స‌రిప‌డా నిల్వ‌లున్నాయంటున్న‌కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు..

  • మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రిప‌డా నిల్వ‌లున్నాయని పేర్కొంటుంది. మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ క‌లెక్ట‌ర్ల‌తో ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై క‌మిటీ ఏర్పాటు చేశామ‌ని, ప్ర‌తీ నాలుగుగంట‌ల‌కోసారి చొప్పున స‌మీక్షిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఎక్క‌డ స‌మ‌స్య‌లున్నా, ఫిర్యాదుల కోసం 1967లో సంప్ర‌దించాల‌ని సూచించారు.
  • కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి తాజాగా ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై స‌మీక్షించిన అనంత‌రం స్పందిస్తూ.. రాష్ట్రంలో పెట్రో కొర‌త లేద‌ని, సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Kcr fires Surya | మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్.. ఎంపీ సూర్యపై మండిప‌డ్డ గులాబీ బాస్‌!

Kcr fires Surya | తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి వస్తుందా.. ఉద్యమ భావజాలం మళ్లీ రగులుతుందా.. అంటే అవుననే సమాధానాలు చెబుతున్నాయి తాజా పరిస్థితులు. ఇటీవల పార్ల‌మెంట్‌లో ఎంపీ తేజశ్రీ సూర్య వ్యాఖ్యల‌పై బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ స‌మావేశంలో గులాబీ బాస్ ఫైర్ అయిన తీరు ఇందుకు బ‌లం చేకూర్చుతుంది.
దుమారం లేపిన ఎంపీ సూర్య వ్యాఖ్యలు..
ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ తేజశ్రీ సూర్య వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఆయన తీరుపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెతాయి. బీజేపీ మినహా అన్ని పార్టీలు, తెలంగాణ ప్రజాస్వామిక వాదులు నిరసన గళం వినిపించారు. ఉద్యమాన్ని కించపరిచిన ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) .. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తేజస్వి సూర్య ఒక పెద్ద వెధవ..ఆయన సభలో అనుచితంగా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదు.. రాష్ట్రానికి చెందిన 16 మంది ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటు.. అదే బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు..’అని పేర్కొన్నారు. తెలంగాణపై బీఆర్ఎస్‌కు ఉన్న చిత్తశుద్ధి మరెవరికీ ఉండదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో తెలంగాణ సెంటిమెంట్ మరోసారి తెర మీదకు వచ్చినట్లు అయింది.
బీజేపీ, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ..
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్‌ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగిన గులాబీ బాస్‌ రానున్న ఎన్నికల్లో తిరిగి పవర్‌లోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఏర్పాటు అంశంపై ఎంపీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో మండిపడ్డారు. బీజేపీతో పాటు కాంగ్రెస్‌ ఎంపీల తీరును తూర్పారా బట్టారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఆవశ్యకతను వివరించారు. ఈ అంశం రానున్న రోజుల్లో రాజకీయ వేడిని పెంచే అవకాశం లేకపోలేదు.
కేంద్రమంత్రి క్షమాపణలు..
ఎంపీ సూర్య వ్యాఖ్యలపై తలెత్తిన దుమారం నేపథ్యంలో అప్రమత్తమైన ఆ పార్టీ నష్ట నివారణపై దృష్టి సారించింది. ఎంపీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నొచ్చుకుంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. అయితే తేజస్వీ మాత్రం తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ ప్రాంత బీజేపీ నేతలు సైతం ఎంపీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నాయని పేర్కొనడం కొసమెరుపు.

ఇది కూడా చ‌ద‌వండి .. బీజేపీలోకి.. మల్లారెడ్డి?

MLA Mallareddy Family | బీజేపీలోకి.. మల్లారెడ్డి?

MLA Mallareddy Family | ‘పాలమ్మిన.. పూలమ్మిన.. బోర్‌వెల్ నడిపిచ్చిన.. కష్టపడ్డ.. కాలేజీలు పెట్టిన.. సక్సెస్ అయిన..’ ఈ డైలాగ్ ఎవరిదో ఇప్పటికే మీకు గుర్తుకొచ్చుంటుంది. ఆయనే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈయన బీఆర్ఎస్‌ (BRS) లో మాస్‌ లీడర్‌గా గుర్తింపు పొందారు. గతంలో కేసీఆర్‌ కేబినేట్‌లో కార్మికశాఖ మంత్రిగానూ పనిచేశారు. గులాబీ బాస్‌కు విధేయుడిగా పేరున్న ఈయన ప్రస్తుతం కుటుంబంతో సహా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా.. అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి.
కమలం పార్టీ టచ్‌లోకి మల్లన్న కుటుంబం..
తన విద్యా సంస్థలకు సంబంధించిన అంశంపై మల్లారెడ్డి ఇటీవల కుటుంబంతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఆయన కోడలు ప్రీతిరెడ్డి తాజాగా రాష్ట్ర బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కీలక నేతలతో సమావేశం కావడం ఊహాగానాలకు తెరతీసింది. ‘కమలం’ పార్టీ తెలంగాణ చీఫ్‌ రామచంద్రరావుతోనూ ఆమె రెండు రోజుల క్రితం బేటీ కావడం మరింత బలం చేకూర్చినట్లయింది. కాగా, డిజిటల్‌ ఇండియా కోసమే అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లుగా ఆమె వివరించారు. తాను బీజేపీలో చేరడం లేదని, ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.
కొట్టి పారేస్తున్న మ‌ల్లారెడ్డి
బీజేపీలో చేరికకు సంబంధించి మల్లారెడ్డి కొట్టిపారేస్తున్నప్పటికీ వరుసగా ఆయన కుటుంబ సభ్యులు కషాయ పార్టీ నేతలతో సమావేశమవుతుండడం ఆసక్తికరంగా మారింది. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంతో పాటు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలను ప్రతిపాదించగా బీజేపీ అధిష్టానం కూడా సూచనప్రాయంగా అంగీకరించినట్లు పొలిటికల్‌ సర్కిల్‌లో టాక్‌ వినిపిస్తోంది.
ఈటలకు చెక్‌ పెట్టేందుకేనా..?
ప్రస్తుతం మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ ఎంపీగా ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. పార్టీలోని ఓవర్గం ఆయనకు చెక్‌ పెట్టేందుకే ఈ స్థానం మల్లారెడ్డి కుటుంబానికి హామీ ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు.

ఇది కూడా చ‌ద‌వండి .. జనాభా లెక్కలో.. మన పేరు సొంతంగా నమోదు చేసుకోవచ్చండోయ్..

Water Purity | మీరు తాగే నీరు మంచిదేనా.. గుర్తించండిలా

Water Purity | ఆరోగ్యానికి నీరు ఎంతో అవ‌స‌రం. అయితే మ‌నం తీసుకునే నీటిలో ఏది మంచిదో తెలుసా.. అందులో ఏ ల‌వ‌ణాలు ఉండాలి.. దానిని ఎలా గుర్తించాలో ఓ సారి తెలుసుకుందామా మ‌రి.

నీటి నాణ్య‌తను TDS (Total Dissolved Solids) ద్వారా గుర్తించ‌వ‌చ్చు. అందులోని ఖనిజాలు, లవణాల స్థాయిని TDS మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంటుంది. ధ‌ర సుమారు రూ.200 నుంచి రూ.300 వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • తాగే నీటిలో TDS స్థాయిలు..
    0 -50 mg/L  : మిన‌ర‌ల్స్ అత్య‌ల్పం, తాగేందుకు అంత అనుకూలం కాదు
    50 -150 mg/L : అత్యుత్తమ నాణ్యత గల నీరు
    150 – 300 mg/L : మంచి నీరు
    300 – 600 mg/L : లవణాలు ఎక్కువ, అంత అనుకూలం కాదు
    600 – 900 mg/L : తక్కువ నాణ్యత
    900+ mg/L: తాగడానికి యోగ్యం కాదు (కఠినమైన నీరు)
  • WHO (వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌) ప్ర‌కారం 50 – 300 mg/L వ‌ర‌కు ఉన్న నీరు శ్రేయ‌స్క‌ర‌మ‌ని సూచిస్తుంది.
  •  కొంద‌రికి ఆర్వో, మిన‌ర‌ల్ వాట‌ర్‌తో జాయింట్ పెయిన్స్ వ‌స్తుంటాయి. అలాంటి వారు మున్సిప‌ల్ వాట‌ర్‌ను ఇలా తాగ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణ‌లు పేర్కొంటున్నారు. సాధార‌ణంగా మున్సిప‌ల్ వాట‌ర్ లో TDS స్థాయి 50 – 300 mg/L వ‌ర‌కు ఉంటుంది. ఈ నీటిని వేడిచేసి చ‌ల్లార్చిన త‌ర్వాత రాగి బిందెలో లేదా మ‌ట్టి కుండ‌లో నిల్వ చేసుకుని తాగితే మంచిదని సూచిస్తున్నారు.
  • ప్ర‌తి రోజు ఆరోగ్య‌క‌ర జీవ‌నానికి 2-3 లీటర్లు సరిపోతాయి. శ‌రీర బ‌రువు కేజీకి 30మి.లీ నుంచి 35 మి.లీ చొప్పున అవ‌స‌రం. ఈలెక్క‌న 70 కిలోల బ‌రువు ఉంటే 2.1 నుంచి 2.5 లీట‌ర్ల వ‌ర‌కు తాగ‌వ‌చ్చు. అతిగా తాగితే ‘హైపోనాట్రేమియా’ (శరీరంలో సోడియం తగ్గడం) కు దారితీస్తుంది.
  •  భోజనానికి, నీరు తాగడానికి మధ్య కనీసం 30-45 నిమిషాల గ్యాప్ ఉండాలి.
  •  రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది.

నోట్ : మీకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే, వైద్యుల సలహా మేరకు మాత్రమే నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.

ఇది కూడా చ‌ద‌వండి ..తల్లులూ.. మీ పిల్లలు జాగ్రత్త..! ఈ ఫుడ్ కు కాస్త దూరంగా ఉంచండి

Self Enumeration | జనాభా లెక్కలో.. మన పేరు సొంతంగా నమోదు చేసుకోవచ్చండోయ్..

Self Enumeration | దేశంలో జనాభా లెక్కల (Census-2027) గణన ప్రక్రియ మొదలైంది. ఈసారి ప్రభుత్వం స్వీయ గణనను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు తమ కుటుంబ,ఇంటి వివరాలను se.census.gov.in వెబ్ పోర్టల్‌ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. సులభవంతమైన డిజిటల్ ప్రక్రియ గురించి తెలుసుకుందామా మరి.

  • ముందుగా వెబ్ పోర్టల్ లోని లింక్ ను ఓపెన్ చేయాలి.
  • సెల్ఫ్ ఎన్యుమరేషన్(HLO) లాగిన్ వద్ద తెలంగాణ అని ఎంపిక చేసుకోవాలి. క్యాప్చ ఎంటర్ చేసి వెరిఫైడ్ అండ్ ప్రొసీడ్ ను క్లిక్ చేయాలి.
  • Welcome పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించాలి. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫైడ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. తర్వాత నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి.
  • మీ జిల్లా పట్టణం/ గ్రామం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయాలి.
  • మొబైల్లో లొకేషన్ ఆన్ చేసి మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ సెట్ చేయాలి.
  • ఇళ్ల వివరాలకు సంబంధించి ఇచ్చిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రివ్యూ (preview) ద్వారా చెక్ చేసి సబ్మిట్ చేయాలి.
  • H తో ప్రారంభమయ్యే 11 అఅంకెల SE ID వస్తుంది. దానిని స్క్రీన్ షాట్ లేదా నోట్ చేసుకొని భద్రపరచుకోవాలి.
  • మే 11 తర్వాత మీ ఇంటికి వచ్చి ఘనన అధికారికి ఆ SE ID చూపిస్తే వారు అప్రూవ చేస్తారు.

ఇది కూడా చ‌ద‌వండి ..  పార్టీ పేరు ప్ర‌క‌టించిన క‌విత‌

 

trs kavitha party | టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేన‌..

పార్టీ పేరు ప్ర‌క‌టించిన క‌విత‌
trs kavitha party | జై తెలంగాణ అంటూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త‌న పార్టీ పేరును శ‌నివారం ప్ర‌క‌టించారు. మునీరాబాద్‌లోని అద్వయ కన్వేషన్ వ‌ద్ద ప్రొఫెసర్ జయశంకర్ వేదిక‌గా ఉద‌యం 10గంట‌ల 12 నిమిషాల‌కు తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా ప్ర‌క‌టించారు. పిడికిలెత్తి పేరును అనౌన్స్ చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా త‌మ పార్టీ ప‌ని చేస్తుంద‌ని వెల్ల‌డించారు. అంత‌క‌ముందు గ‌న్ పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు ఆమె నివాళుల‌ర్పించారు. ముందుగా భారీ ర్యాలీగా ప్రొఫెసర్ జయశంకర్ సభ ప్రాంగణానికి చేరుకోగా బోనాలు, బ‌తుక‌మ్మ‌ల‌తో కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

క‌విత స్పీచ్‌.. పాంచ‌జ‌న్యం అజెండాతో..

  • మన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన
  • తెలంగాణ ప్రజలు, మేధావులు, బుద్ది జీవులు, తెలంగాణ అభివృద్ధి కోరుకునే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
  • నా జీవితంలో ఇదొక మరుపురాని రోజు
  • మనందరం కలుసుకొని పనిచేసే విధంగా ఆ దైవం చేసిందని నమ్ముతున్నా..
  • తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు, అనేక రకాల కష్టాలు పడిన, రాష్ట్ర వస్తే చాలని భావించిన వాళ్లకు నమస్కారం..
  • సింగరేణి కార్మికులంటే ఇష్టం, అంతకన్నా ఆడబిడ్డలంటే ఇంకా ఇష్టం..
  • జెన్ జీ వారసులు, యూత్ కు పేరు పేరున నమస్కారం
  • ఏం జరుగుతుందని ఇవ్వాళ రాష్ట్రంలో చాలా మంది ఎదురుచూస్తున్నారు
  • 20 ఏళ్లుగా నేను, తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర మీకు తెలుసు
  • ఆడబిడ్డలందరినీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా ఊరురా బతుకమ్మ కార్యక్రమం ద్వారా చేశాం
  • జాగృతి ఆడబిడ్డల చేతిలో కాగడ అయ్యింది
  • మన సంస్కృతి గురించి చెప్పుకోవటానికి బతుకమ్మ వచ్చాక బలం వచ్చింది
  • ఇది మా సంస్కృతిని అని బతుకమ్మ పాట ద్వారా పున పరిచయం చేసకున్నాం.
  • తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాది వేసింది మా జాగృతి ఆడబిడ్డలు
  • కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మనం కలలు కన్నా తెలంగాణ రాలేదు
  • మన కలలు ఇప్పటికీ కూడా నిజం కాలేదు
  • కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది.
  • సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది
  • ఏ తరహాలో పనిచేయాలో అలా జరగలేదని చెప్పటానికి బాధగా ఉంది
  • ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులు అయ్యాయి
  • ఫోన్ మాట్లాడాలంటే భయం. దారుణమైన నిఘా నీడలో మనం బతికాం
  • మనం అనుకున్న తెలంగాణ రాలేదని మీకు చెబుతున్నా
  • ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా
  • తెలంగాణ సాధించటంలో భాగమైనందుకు నా జన్మ ధన్యమైంది
  • నా తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదు
  • ఆ తప్పులను దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలి
  • అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్ర సేన గా వస్తున్నాం
  • పోరాటాలకు రాజకీయ శక్తి, అధికారం ఉంటే ఇంకా బాగా పనిచేయవచ్చు
  • అందుకోసమే ఈ పార్టీ మీ ముందుకు వచ్చింది
  • రాజకీయ పార్టీకి రాజకీయ ఆత్మ ఉండాలి. అజెండా ఉండాలి
  • బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మ కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది
  • తెలంగాణలోని మూడు కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నా
  • అమ్మతనంతో, ఆర్ధితో పాలన జరిగినప్పుడే కష్టాలు తీరుతాయి.
  • రైతాంగ పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఇలా సాగుతూనే ఉంది.
  • చాకలి ఐలమ్మ, గద్దరన్న, మారోజు వీరన్న సహా అనేక మంది పోరాటం చేస్తేనే ఇలా మార్పులు వచ్చాయి
  • అమర వీరులు, కేసీఆర్ గారు అనేక మంది కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది
  • సమ్మక్క సారక్క నాటి నుంచే సామాజిక పోరాటం జరిగింది
  • కొండ లక్ష్మణ్ బాపూజీ, పాపన్న గౌడ్, పంతు నాయక్ గారు, జనార్ధన్ రావు గారి స్ఫూర్తిని తీసుకుంటాం
  • రాజ్యాంగ బద్దంగా రాజకీయ శక్తితో ప్రజాపోరాటాలు మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తాం
  • తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకు ఊరికే రాలేదు
  • బీజేపీ కి తెలంగాణ రావటమే ఇష్టం లేదు
  • తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటారు
  • మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చుతారు
  • అగ్రనాయకత్వం అలా మాట్లాడితే బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట్లాడరు
  • మనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయిన సరే మన బీజేపీ ఎంపీలు మాట్లాడరు
  • సామాజిక న్యాయం అనే దానికే బద్ద వ్యతిరేకి బీజేపీ
  • మహిళ బిల్లు పక్కన పెట్టారు. బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారు
  • పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారు
  • ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి మన ఏడు మండలాలు తీసుకున్నారు
  • అయిన సరే ఈ బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవరు
  • ఈ బీజేపీ బానిస ఎంపీలకు నేను సవాల్ చేస్తున్నా
  • మీరు తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద ఐదు గ్రామాలను తెలంగాణకు పట్టుకురండి
  • పోలవరం పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోతాయి
  • దానిపై జాగృతి తరఫున మేము మాట్లాడాం. ఆంధ్రా వారికి, కేంద్రానికి లేఖ రాశాం
  • మీకు సిగ్గు ఉంటే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలు తెలంగాణకు తేవాలి
  • బీఆర్ఎస్ పార్టీ నుంచి తొట్ట తొలి ముఖ్యమంత్రి అయ్యారు. మంచి సాలు తీయాల్సింది
  • నీళ్లు, నిధులు, నియామాకాలు అనే నినాదంతో తెచ్చుకున్నాం
  • పదేళ్లలో నీళ్ల కోసం బీఆర్ఎస్ లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసింది
  • కానీ 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చింది
  • పాలమూరు, కాళేశ్వరం కోసమే లక్షా 21 వేల కోట్లు ఖర్చు చేసింది
  • ఈ విషయాన్ని నేను బాధతో చెబుతున్నా
  • ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు
  • ఆనాడు చేనేత కార్మికులు చనిపోతే బిక్షమెత్తి సాయం చేసిన వ్యక్తి కేసీఆర్
  • ఈనాటి కేసీఆర్ మరమనిషి, మారిన మనిషి
  • వెలుగుమట్లలో, హైడ్రాలో ఇళ్లు కూలితే వచ్చారా, అయ్యా కేసీఆర్ రావాలి అంటే కూడా రాలేదు
  • చేవెళ్ల దగ్గర కష్టమొస్తే వచ్చారా?
  • ఆయన మారిన మనిషి, మర మనిషి. మన మనిషి కాదు
  • గుంటనక్కలు, తోడేళ్లలో ఖైదీ అయిన మర మనిషి
  • దుఖంతో చెబుతున్న మాటలు ఇవి. సంతోషంతో కాదు
  • ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేశారు. కానీ పాలమూరు కోసం ఏం చేయలేదు
  • ఆనాటి కేసీఆర్ అయితే అక్కడే కుర్చీ వేసుకొని దాన్ని పూర్తి చేసేవారు
  • కానీ మారిన కేసీఆర్ మాత్రం పంజాబ్, గుజరాత్, బీహర్ కు పోయారు
  • రాష్ట్రంలో మొత్తం పీకి కట్టలు కట్టామని, నేషనల్ పార్టీ అంటూ పోయారు
  • కానీ తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకోని ఉంటే పాలమూరు రంగారెడ్డి పారకపోయేదా?
  • నేను ఎన్ని మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెబుతలేరు
  • దీనికి సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేలా చేస్తుంది
  • సింగరేణి గనిలో కార్మికుడు చనిపోతే చూసి వచ్చిన వ్యక్తి
  • తెలంగాణ వచ్చాక ఏమైంది ఆ ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా?
  • నాకు తండ్రి కావచ్చు అది వేరే విషయం
  • కేసీఆర్ గారు రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు
  • కేటీఆర్ గారు అంటే ఆయనకు పెద్దగా తెలియదు
  • ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ గారు అంటున్నారు
  • నా పిల్లలు తప్పు చేస్తే నేను వదిలివేస్తానా?
  • ఒక కర్కోటక పాలకుడి పాలన నడుస్తోంది
  • అర్థరాత్రి ఇండ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన మన పాత కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు
  • నన్ను పార్టీ నుంచి బయటకు పంపిస్తే వెంటనే పార్టీ పెట్టలేదు
  • మారుతారేమోనని చాలా రోజులు వేచి చూశా
  • ఆనాడు ఉద్యమకారులకు జరిగింది. ఇప్పుడు నాకు జరిగింది
  • కేసీఆర్ కోసం ఇళ్లు, భూములు అమ్ముకున్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు
  • తెలంగాణ ఉద్యమంలో మనల్ని లాఠీలతో కొడితే తల్లి కోడిలా కాపాడుకోవాల్సిన కేసీఆర్ ఎక్కడ పోయిండు
  • పదేళ్లలో 2 ఏండ్లకు ఒకసారి నామినేషన్ పదవులు ఇచ్చిన సరే 30 వేల పదవులు వస్తుండే
  • ఆనాడు అవహేళన చేసిన వారే అధికారంలో వచ్చిన తర్వాత మళ్లీ అవహేళన చేశారు
  • ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడే అమ్మతనం, మమకారం పోయింది
  • అందుకే అంటున్న ఆయన మన కేసీఆర్ కాదు మారిన మర మనిషి కేసీఆర్
  • అందుకే నేను ఈ పార్టీ పెట్టి వస్తున్నా. ఈ గడ్డకు ఏమీ జరిగిన ప్రాణం అడ్డుపెట్టి పనిచేసే వాళ్లు కావాలి
  • అలా మనం ముందుకు పోదామా?
  • అవినీతి జరిగిందని అని చెప్పిన నన్ను సస్పెండ్ చేసి అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు
  • ఆత్మ లేని మరబొమ్మ కేసీఆర్. ఇవ్వాళ మన కేసీఆర్ కాదు
  • అందుకే ఎదురుగా నిలబడి కొట్లాడుతున్న నాతో పాటు వస్తారా?
  • ఇప్పుడు ఇళ్లు మాత్రమే అలికం. ముందున్నది ముసళ్ల పండగ
  • ఇవ్వాళ రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది
  • వెలుగుమట్లలో అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ ఇళ్లను కూలగొడితే బాధతో ఒక గర్భిణీ కి అబార్షన్ అయ్యింది
  • ఆ గర్భిణీ తండ్రి రోదన ఇంకా కళ్ల ముందు మెదులుతోంది. అందుకే కర్కోటకుడు, నియంత అంటా.
  • రెండు నెలల చిన్నారి చనిపోతే ఇప్పటికీ కూడా కేసు పెటట్టం లేదు
  • గురుకులాల్లో విషం పెట్టి పిల్లలను చంపితే ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు
  • కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ కేసు పెట్టలేదు
  • కాంగ్రెస్ మీద కచ్చితంగా మనమే పోరాటం చేస్తాం
  • ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం
  • ఇప్పుడున్న మూడు పార్టీలు కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతి తో నిండిపోయాయి
  • మనం ఐదు అంశాలపై పోరాటం చేద్దాం. పాంచజన్యం మాదిరిగా మనం ముందుకు పోవాలి
  • మొదటిది విద్య. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు
  • ప్రభుత్వ స్కూల్ లో కనీస సదుపాయాలు లేవు
  • గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో…బడిని అంతే పవిత్రంగా చూడాలి
  • ప్రతి ఊరిలో బడి ఉండాలే, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి
  • మన ప్రభుత్వం వస్తుంది. నేను మీ అమ్మను. నేను జేబు చూడాను. కడుపు చూస్తాను.
  • ప్రైవేట్ పాఠశాలలో చదివినా సరే ఒక్క రూపాయి భారం పడకుండా ఉచిత విద్య బాధ్యత తీసుకుంటాం
  • ప్రాథమిక విద్య నుంచి పీహెచ్డీ వరకైనా సరే ఉచిత విద్య ఇస్తాం
  • గతంలో రక్తం అమ్ముకునేవాళ్లు ఇప్పుడు గిగ్ వర్కర్లుగా విద్యార్థులు పనిచేస్తున్నారు
  • ఎంత వరకు చదువుకున్న సరే వారికి రూపాయి కూడా భారం కానివ్వం
  • ఎంత పెద్ద రోగం అయినా సరే రూపాయి కూడా భారం కానివ్వం
  • ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తే తెలంగాణ బిడ్డలే డబ్బులు సంపాదించి ప్రభుత్వానికి ఇస్తారు
  • మూడోది రైతు. రైతులకు అరసు పాట పాడినట్లు అంత ఇస్తాం, ఇంత ఇస్తామంటారు
  • నేను రైతును అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాం
  • ఏ ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్లిన సరే రైతును గౌరవించేలా చేస్తాం
  • 24 గంటల విద్యుత్, యూరియ ఇలా అన్ని విషయాల్లో వారికి న్యాయం చేస్తాం
  • రైతునే రాజు చేసే విధంగా మేము చేస్తాం
  • ఇక నాలుగో అంశం ఉపాధి. అన్ని ప్రభుత్వాలు ఉపాధి కల్పిస్తామని చెబుతుంటారు
  • ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు.
  • మీరు ఒక ఆలోచన తో వస్తే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు మీ అమ్మ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది
  • నా యూత్ ను నేను నమ్ముతున్నా. డైరెక్ట్ గా వారికి మేము రుణాలు ఇస్తాం
  • ఉద్యోగం చేయాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్
  • మేము అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే ఒక నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం
  • మన ఉద్యమకారులు వారి వయసు, రక్తాన్ని ఉద్యమం కోసం ధారబోశారు
  • వారికి జూన్ 2, 2014 ను కటాఫ్ తేదీగా పెట్టుకొని లక్ష సూపర్ న్యూమరరీ జాబ్స్ ను క్రియేట్ చేస్తాం
  • పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో తెలంగాణ రాష్ట్ర సేన జెండా
  • జెండా మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్.. దాని మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో TRS పేరు
  • కింద ఆకుపచ్చ రంగు పట్టి దాని మధ్యలో తెలుగు లో తెలంగాణ రాష్ట్ర సేన పేరు

kavitha party | ప్రజా గొంతుకగా.. (క)ష్టాల‌కు (వి)ల‌పించ‌క‌ (త)రిమేసే వజ్రాయుధంగా..

kavitha party | టిక్‌..టిక్‌..టిక్‌.. రోజులు గ‌డిచాయి. గంట‌లే మిగిలాయి.. స‌ర్వోద‌యానికి వేళ‌యింది. పిడికిలెత్తే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఉద్యమ వీరుల మది నిండుగా.. సబ్బండ వర్గాలకు అండగా నిలిచే ఆ జెండా ఇక నింగినంట‌నుంది. ప్ర‌జా గొంతుక ఇక జ‌న జాగృతిగా ర‌ణం చేయ‌నుంది. జై తెలంగాణ అని నిన‌దించ‌నుంది. (క)ష్టాల‌కు (వి)ల‌పించ‌క‌ (త)రిమేసే కొత్త పార్టీగా శ‌నివారం పురుడుపోసుకోనుంది. మ‌హిళా రాజ‌కీయ శ‌క్తిగా ఆవిర్భ‌వించ‌నుంది. 

రేపే క‌విత కొత్త పార్టీ..
తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత(kavitha) కొత్త పార్టీకి రేపే నామ‌క‌రణం. గ‌న్‌పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరులకు సంస్మర‌ణ అనంత‌రంమునీరాబాద్ వేదిక‌గా నూత‌న పార్టీ ఆవిర్భవించ‌నుంది. ఆ వెంట‌నే జెండా, ఎజెండా విడుద‌ల కానుంది. జాగృతి సైన్యం క‌వాతు న‌డుమ క‌విత త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ముఖ చిత్రాన్ని ఆవిష్క‌రిస్తారు. మూడున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను ప్ర‌తిబింబిస్తారు.

జాగృతి నుంచి పార్టీ దాకా ప్రస్థానం..
మలిదశ ఉద్యమ సమయంలో 2006లో అమెరికన్ నుంచి తిరిగి వచ్చిన కవిత అదే ఏడాది తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. బతుకమ్మతో ఊరురా తిరిగి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో మాత్రం ఓటమి చవిచూశారు. 2020లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2022 లోనూ అక్కడి నుంచే మరోసారి ప్రాతినిధ్యం వహించారు. 2024లో కవిత లిక్కర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. దాదాపు 5 నెలల పాటు కవిత జైలు జీవితం గడిపారు. 2024 ఆగస్టు 27న బెయిల్ పై విడుదలయ్యారు. 2025 మే లో కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ లీక్ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చాక ” కేసీఆర్ దేవుడే.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి..” అంటూ చేసిన హాట్ కామెంట్స్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. అప్పటినుంచి కవితకు పార్టీకి మధ్య గ్యాప్ పెరిగింది. 2025 మే 31న తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభించారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులపై ఆమె ధర్నా చేపట్టారు. సెప్టెంబర్ 1న హరీష్ రావు, సంతోష్ రావు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆమెను మరుసటి రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె జాగృతి ద్వారా జనం బాట పట్టారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెంచారు. ఈనెల 25న కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె రాజ‌కీయ సెకండ్ ఇన్నింగ్స్ రేపు షురూ కానుంది.

ఇది కూడా చ‌ద‌వండి : ఆమె అడుగులు.. వ్యూహాత్మ‌కం!

Rtc Strike | ఆర్టీసీ స‌మ్మె ఉధృతం.. ‘మండి’న‌ కార్మికాగ్రహం.. ప్ర‌భుత్వం ఏమంటుంది..

Rtc Strike | ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరింది. గురువారం సైతం బ‌స్సులు రోడ్డెక్క‌లేదు. మ‌రోవైపు కార్మికులు త‌మ‌ ఆందోళ‌నలు కొన‌సాగించారు. ఆయా డిపోలు ధ‌ర్నాలతో ద‌ద్ద‌రిల్ల‌గా.. న‌ర్సంపేట, న‌ల్గొండ ఘ‌ట‌న‌లు రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. ఈ క్ర‌మంలో అల‌ర్ట్ అయిన ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌పై దృష్టి సారించింది. కేబినెట్ స‌మావేశంలోనూ ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. శుక్ర‌వారం కార్మిక జేఏసీతో మ‌రో విడ‌త స‌మావేశం అయ్యేందుకు స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.
న‌ర్సంపేట ఘ‌ట‌న క‌ల‌క‌లం..
వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌(Narsampet) లో కార్మికులు గురువారం ఉద‌యం నుంచి ధ‌ర్నా కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ కోల శంక‌ర్ గౌడ్ అనే కార్మికుడు మ‌ధ్యాహ్నం బ‌స్టాండ్ వ‌ద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన బాధితుడిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రోవైపు నల్గొండ‌లో స‌మ్మె శిబిరం వ‌ద్ద మిర్యాలగూడ డిపో కార్మికుడు వెంక‌న్న డీజిల్ పోసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి య‌త్నించాడు. అక్క‌డే ఉన్న తోటి కార్మికులు, పోలీసులు స‌కాలంలో స్పందించి అత‌డిని కాపాడారు. అలాగే భ‌ద్రాచ‌లం డిపోకు చెందిన కార్మికుడు లింగారెడ్డి గ‌డ్డి మంది తాగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డు కోలుకుంటున్న‌ట్లుగా కార్మికులు చెబుతున్నారు.
అల‌ర్ట‌యిన ప్ర‌భుత్వం
ఈ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయింది. కేబినెట్ స‌మావేశంలో ఈ అంశాన్ని ప్ర‌ధానంగా చ‌ర్చించ‌డంతో పాటు స‌మావేశం పూర్తి కాక‌ముందే సీఎం సూచ‌న‌తో ప‌లువురు మంత్రులు ప్రెస్‌ మీట్ నిర్వ‌హించారు. మంత్రులు శ్రీ‌ధ‌ర్‌బాబు, పొన్నం, కోమ‌టిరెడ్డి, రాజ‌న‌ర్సింహ మాట్లాడుతూ, కార్మికులు సంయ‌మ‌నం పాటించాల‌ని, క్ష‌ణికావేశ నిర్ణ‌యాలు స‌రికాద‌ని, తొంద‌ర‌పాటు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వమ‌ని డిప్యూటీ సీఎం స‌మ‌క్షంలో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మని ప్ర‌క‌టించారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌మ వంతు కృష చేస్తామ‌ని భరోసా కల్పించారు.
కార్మికులు ఏమంటున్నారు..
మ‌రోవైపు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నిస్వాగ‌తిస్తున్న కార్మికులు స‌మ‌స్యల ప‌రిష్కారం విష‌యంలో చిత్త‌శుద్ధి చూపాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. త‌మ‌ని గొంతెమ్మ కోరిక‌లు కావ‌ని.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు మాత్రమే అని అంటున్నారు. న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిశీలించి కాల‌యాప‌న‌ చేయకుండా త్వ‌రగా నెర‌వేర్చాల‌ని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: మోగిన స‌మ్మె సైర‌న్ .. ఆ ప్ర‌గ‌తి చ‌క్రాలు ఏమంటున్నాయ్‌