Job Notifications | నీళ్లు.. నిధులు.. నియామకాలు.. నినాదంతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నా.. నియామకాల విషయంలో ఇప్పటికీ నిరుద్యోగుల్లో నిరాశే వ్యక్తమవుతోంది. తెలంగాణ (Telangana) ఏర్పడి పుష్కరకాలం దాటినా ఆశించిన నోటిఫికేషన్లు రాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఏళ్లు గడుస్తున్నా సర్కారు కొలువు అందని ద్రాక్షగా మారిందనే ఆవేదన వారి నుంచి వినిపిస్తోంది.
వయసు మించిపోతుంది
ఉద్యమ సమయంలో డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర ఉన్నత విద్య పూర్తిచేసిన యువత రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించారు. ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో పోరుబాటలో ముందు భాగంలో నిలిచారు. అరెస్టులు, నిర్బంధాలను సైతం లెక్కచేయలేదు. ఎట్టకేలకు 2014లో స్వరాష్ట్రం సిద్ధించింది. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ పట్టభద్రుల ఆశలు మాత్రం నెరవేరని పరిస్థితి. దశాబ్దం గడిచినా ప్రభుత్వం అడపాదడపా నోటిఫికేషన్లకు మాత్రమే పరిమితం కావడం.. మరోవైపు కోవిడ్ సైతం అనేక కుటుంబాలను ఛిద్రం చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలామంది తాత్కాలిక ఉపాధి మార్గాల వైపు మళ్లారు. రేపో.. మాపో భారీ నోటిఫికేషన్లు రాకపోతాయా.. అనే గంపెడాశతో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఏజ్ బార్ అవుతుండడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఇక తమకు గవర్నమెంట్ ఉద్యోగం కలేనా అనే భావన వారి నుంచి వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ సర్కారుపై ఆశలు
పదేళ్ల పాటు ఉద్యమ పార్టీ అధికారంలో ఉన్నా తమ ఆశలు నెరవేరలేదని భావించిన నిరుద్యోగులు ఆ పార్టీపై తమ కోపాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారును కోరి తెచ్చుకున్నారు. అయితే ‘హస్తం’ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు సమీపిస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కారు తాజాగా నియామకాల భర్తీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అందరి చూపు జూన్ 2 వైపే..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పలు నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ (TGPSC) ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రకారమే రానున్న నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
2500 పోస్టుల భర్తీకి చర్యలు
ఆర్థిక శాఖ నుంచి వచ్చిన క్లియరెన్స్ మేరకు త్వరలోనే సుమారు 2500 పోస్టుల భర్తీకీ టీజీపీఎస్సీ చర్యలు చేపడుతుంది. పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, విద్య తదితర శాఖల్లో సంబంధిత ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి.. పెట్రో కొరత నిజమేనా.. ప్రభుత్వం ఏం చెబుతుంది




