Good news | ఎట్టకేలకు వారి కష్టాలు తీరాయి. రెగ్యులర్ ఉద్యోగుల తో పాటు తమకూ ఒకటవ తారీఖునే జీతాలు అందాయి. ప్రభుత్వ నిర్ణయంతో కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ సిబ్బందిలో హర్షం వ్యక్తం అవుతుంది.
సీఎం ఆదేశాలు మేరకు..
జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఇటీవల ఉన్నతాధికారుల సమీక్షలో పేర్కొన్నారు. వారికి కూడా జాప్యం కాకుండా జీతాలు అందాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్‌లో జాప్యం జరగాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఆర్థిక శాఖ ఈ నెల 1వ తేదీనే జీతాలు విడుదల చేసింది.
25 లోగా ప్రక్రియ పూర్తి..
ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొనగా.. నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు నివేదించారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అకౌంట్లలో జమకాగా.. ఔట్‌సోర్సింగ్ కు సంబంధించి పలు విభాగాల సిబ్బంది నుంచి మాత్రం తమకు ఇంకా రాలేదని పేర్కొనడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: గుడ్ న్యూస్.. వారికి కూడా రైతు భరోసా


