Thursday, July 2, 2026

kavitha arrest | కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొదలైంది

  • ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన ఆ పార్టీ బాగుప‌డదు
  • మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయాలని ఏ పోలీస్ మ్యానువల్ లో ఉంది?
  • సీఎం, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలి
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
  • kavitha arrest | ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బోడుప్పల్ లో భూ పోరాటం చేసి అరెస్ట్ అయిన కవిత గురువారం సాయంత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదల‌య్యారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు.
    కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు
    కాంగ్రెస్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్య‌మ‌కారుల‌కు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీల‌ను మ‌రిచిపోయారా అని ప్ర‌శ్నించారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట అమలు చేసే ధైర్యం లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చార‌ని ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలను అడిగితే పోలీసులతో కొట్టిస్తారా అంటూ మండిపడ్డారు. ఉద్యమకారుల నెత్తురు చూసిన ఈ ప్రభుత్వానికి ఇక కౌంట్ డౌన్ మొదలైందన్నారు. గతంలో ఉద్యమకారులతో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదని, ఇప్పుడు మీరు బాగుపడరని అన్నారు. ఆ పార్టీ త‌గిన‌ మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు.
    ఏ పోలీస్ మ్యానువల్ లో ఉంది?
    తనను పోలీసులు అరెస్ట్ చేసిన విధానం పై కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లాలని ఏ మ్యానువల్ లో ఉందో ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్తే పోలీసులకు అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట, ముచ్చట, మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసిన విధానానికి సంబంధించిన‌ వీడియోలు ప్రభుత్వ పెద్దలు చూడాలన్నారు.
    ఏ పార్టీ కూడా మాట్లాడటం లేదు?
    ఉద్యమకారులను రక్తాలు వచ్చేలా కొడితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు మద్దతిస్తే వాళ్లంతా ఉద్యమకారులు కాకుండా పోతారా అని అడిగారు. ఉద్యమకారులను అన్ని పార్టీలు మోసం చేశాయని చెప్పారు. వారి తరుఫున మొదటి పోరాటం మొదలుపెట్టామని…హామీలు అమలు చేసే వరకు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    భూపోరాటం ఉద్రిక్తత
    అంతకు ముందు తెలంగాణ రక్షణ సేన పార్టీ బోడుప్పల్ లో చేపట్టిన భూ పోరాటం తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఓవరాక్షన్ చేశారు. బండ రాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్దుతూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్ట్ లపై లాఠీచార్జి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. కవిత ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్భందించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్నారు. కవిత ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు భూ పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ భారీగా బోడుప్పల్ చేరుకున్నారు. భూ పోరాటం చేసిన ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్టించి, బోనం ఎత్తి ప్రత్యేక పూజాలు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి.. హమ్మయ్య.. మాకూ ఒకటో తారీకే జీతాలు

Hot Topics

Related Articles