Ev Charging Stations | పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం) గురించి ఆలోచిస్తున్నారా.. అయితే చార్జింగ్ సమస్య ఉంటుందని భావిస్తున్నారా.. ఇక ఆ ఫికర్ వీడండి.. ఎంచక్క గ్రీన్ ప్లేట్ వాహనం తెచ్చుకోండి. ధ్వని, వాయు కాలుష్యానికి దూరంగా ఉంటూ మీ ప్రయాణం సాఫీగా సాగించండి.
ప్రభుత్వాల దృష్టి
ప్రస్తుతం ఈవీలు పెరుగుతున్న నేపథ్యంలో చార్జింగ్ సమస్య తలెత్తకుండా ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వాహనదారులకు ఇక్కట్లు తొలగడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కనుంది.
కేంద్రం చొరవ..
పీఎం ఈ-డ్రైవ్ కింద జాతీయ ఈవీ ఛార్జింగ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 72,000 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు గాను రూ.2,000 కోట్లు కేటాయించింది. 50 జాతీయ రహదారి కారిడార్ల వెంబడి, మెట్రో నగరాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలు,రాష్ట్ర రహదారుల వంటి అధిక రద్దీ గల ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు యోచిస్తోంది. బీహెచ్‌ఈఎల్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న EV వినియోగదారులకు ఒకే వేదికగా పనిచేసే ఏకీకృత డిజిటల్ సూపర్ యాప్ అభివృద్ధికి కీలకంగా ఈ సంస్థ పనిచేయనుంది.
గ్రామీణ ప్రాంతాలపై రాష్ట్రం ఫోకస్
గ్రామీణ ప్రాంతాల్లోనూ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వీటిని నిర్వహించాలని యోచిస్తోంది. తొలిదశలో ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోని 35 చోట్ల ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి ద్వారా ఈవీ వినియోగదారులకు సౌలభ్యంతోపాటు ఆయా సంఘాలకు ఆదాయం లభించనుంది.
ఏర్పాటు ఇలా…
ఒక్కో చార్జింగ్ స్టేషన్‌కు రూ.20 లక్షలు వ్యయం అవుతుంది. ఇందులో కేంద్రం ద్వారా పీఎం ఈ డ్రైవ్ కింద రూ.13 లక్షలు సబ్సిడీగా అందుతుంది. మిగిలిన రూ.7 లక్షలను పీఏసీఎస్‌లు భరిస్తాయి. ప్రస్తుతం కిలోవాట్ అవర్ చార్జింగ్ కోసం రూ.18లుగా ప్రతిపాదించారు. ప్రయోగాత్మకంగా చేస్తున్న ఇవి విజయవంతమైతే క్రమంగా రాష్ట్రంలోని మిగిలిన వాటిలోనూ విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
ఇది కూడా చదవండి.. అందరి చూపు..ఈవీ వైపు




