Tuesday, June 30, 2026

Be alert | రేపటి నుంచి మార్పులివే.. ఓ లుక్కేయండి మ‌రి

Be alert | ఈ నెల ముగిసింది. రేప‌టి నుంచి జూలై ప్రారంభం కానుంది. ప‌లు విభాగాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక, సేవా త‌దిత‌ర రంగాల్లో రాబోతున్న మార్పులు ప్ర‌జ‌ల నిత్య‌జీవితంలో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. ఆధార్‌, ఐటీ, ఎల్‌పీజీ, పాస్‌పోర్ట్‌, రైల్వే త‌దిత‌ర రంగాల్లో రానున్న‌ అప్‌డేట్‌పై ఓ లుక్కెద్దామా మ‌రి.

  • ఎల్‌పీజీ.. : ప‌శ్చిమాసియా యుద్ధ ప్ర‌భావంతో గ్యాస్ నిబంధ‌న‌ల్లో కేంద్రం ఇటీవ‌ల ప‌లు మార్పులు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎల్పీజీ, పీఎన్జీ రెండు క‌నెక్ష‌న్లు ఉన్న వారు ఎల్పీజీ రద్దు చేసుకోవాల‌ని సూచించింది. 90 రోజుల పాటు అవ‌కాశం ఇచ్చింది. నేటితో గడువు ముగియ‌నుంది. ఈ నిబంధ‌న పాటించ‌కుంటే రేప‌టి నుంచి కొత్త ఎల్పీజీ సిలిండర్‌ బుక్ చేసుకోలేరు. అలాగే కేవైసీ పూర్తి చేయకున్నాఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. మ‌రోవైపు ఇటీవ‌ల కేంద్రం ఎల్‌పీజీ ధ‌ర‌లను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే. తాజాగా యుద్ధ‌ ప్ర‌భావం త‌గ్గిన నేప‌థ్యంలో ఈ రేట్లు కూడా త‌గ్గే అవ‌కాశాలు లేక‌పోలేదు.
  • ఆధార్ అప్డేట్ : రేప‌టి నుంచి ఆధార్ అప్‌డేట్ కోసం ఉదాయ్‌( UIDAI) ప్రత్యేక సేవను తీసుకువ‌స్తుంది. ఇది వ‌రకు ఈ మెయిల్ చిరునామా న‌వీక‌ర‌ణ చేసుకోవాలంటే రూ. 75 చెల్లించాల్సి వ‌చ్చేది. ఇక నుంచి ఈ సేవ‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు.
  • పెర‌గ‌నున్న పాస్‌పోర్ట్ చార్జీలు.. : జూలై 1 నుంచి పాస్ పోర్ట్ ఫీజులు పెరగనున్నాయి. 36 పేజీల స్టాండర్డ్‌ ఫీజు ఇది వరకు రూ.1,500 ఉండేది. ఇది రూ.2,500 కు పెరిగింది. తత్కాల్ పై తాజాగా రూ. 1500 పెంచారు. దీంతో ప్ర‌స్తుత‌మున్న రూ.3,500 ఫీజు రూ.5,000కు చేరింది. 60 పేజీలు ఉన్న పాస్‌పోర్ట్ ఫీజు ఇదివ‌ర‌కు రూ.2వేలు ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.3,500కు చేరింది. తత్కాల్‌ విధానంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.4వేలు చెల్లిస్తుండగా ఇకపై రూ.6వేలు చెల్లించాలి. పాస్ పోర్ట్ పోయిన లేక పాడైపోయిన కొత్త దాని కోసం ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1750 వ‌సూలు చేసేవారు. ఇక నుంచి ఈ చార్జి రూ.4,250 కానుంది.
  • మారిన రైల్వే నిబంధనలు : రైళ్లలో ప్రయాణికుల భద్రత , క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ‘జన్ విశ్వాస్ చట్టం’ కింద నిబంధనలను కఠినతరం చేసింది. జూలై 1 నుంచి వీటిని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ ప్రకారం.. రైళ్లలో, స్టేషన్ ప్రాంగణంలో స్మోక్ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా విధిస్తారు. తీవ్ర‌త బ‌ట్టి టికెట్ తక్షణ రద్దుతో పాటు, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇతరుల బెర్తులను ఆక్రమించుకున్నా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని రైల్వే శాఖ ఇప్ప‌టికే హెచ్చ‌రించింది.
  • ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌లో.. : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2 ఫాంలు దాఖలు చేసేందుకు గాను పన్ను చెల్లింపుదారులకు జూలై 31, 2026 వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి. లేకుంటే జరిమానాతో పాటు కొన్ని పన్ను విధానాలపై నిషేధానికి కూడా దారితీసే అవ‌కాశం ఉంటుంది.
  •  క్రెడిట్ కార్డ్ నిబంధనలు : ఎంపిక చేసిన ఫోన్ పే, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ ల‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక నుంచి రివార్డ్ పాయింట్లపై ఎస్‌బీఐ పరిమితులు విధించింది. ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ వేరియంట్‌లపై ఈ ఎఫెక్ట్ చూప‌నుంది.
  • ఇది కూడా చదవండి.. గుడ్ న్యూస్ వారికి కూడా రైతు భరోసా

Hot Topics

Related Articles