Wednesday, April 22, 2026
spot_img

Rtc Strike | మోగిన స‌మ్మె సైర‌న్ .. ఆ ప్ర‌గ‌తి చ‌క్రాలు ఏమంటున్నాయ్‌

Rtc Strike | ” నాడు మా గోడును 55 రోజుల పాటు నినదించినం… మా గొంతు నులిమితే భ‌రించినం.. ప‌ట్టుబ‌ట్టి ఆ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించినం..కాంగ్రెస్‌ స‌ర్కారు వ‌స్తే మా క‌ష్టాలు తీరుతాయని భావించినం.. రెండున్న‌రేళ్లు ఎదురుచూసినం.. అయినా ప‌ట్టించుకోలే.. ఓపిక న‌శించి చివ‌ర‌కు పోరుబాట ప‌ట్టినం.. ప్ర‌తీ క్ష‌ణం మా సేవ‌లు స్మ‌రిస్తున్న మీరు.. మా క‌ష్టాలు గుర్తించండి సీఎం సారూ..” అంటూ ఆ ‘ప్ర‌గ‌తి చ‌క్రాలు’ విన్నవిస్తున్నాయి.
మొద‌లైన స‌మ్మె
ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ మోగింది. బుధ‌వారం మొద‌టి షిఫ్టు నుంచే మొద‌లైంది. పొద్దు పొడ‌వ‌క ముందే కార్మికులు రోడ్డెక్క‌గా.. బ‌స్సులు డిపోల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించగా.. ప్ర‌యాణికుల‌కు ఇక్క‌ట్లు మొద‌ల‌య్యాయి. ప్ర‌ధానంగా మ‌హాల‌క్ష్ముల‌కు ల‌క్ష్మీ క‌టాక్షం దూర‌మై వారి అవ‌స్థ‌లు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి.
చ‌ర్చ‌లు విఫ‌లం
ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయ‌డంతో పాటు త‌మ న్యాయ‌మైన డిమాండ్లు నెర‌వేర్చాల‌ని కోరుతూ కార్మికులు జేఏసీగా ఏర్ప‌డి గ‌త నెల‌లో యాజ‌మాన్యానికి స‌మ్మె నోటీస్ అంద‌జేశాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని కోరాయి. 32 డిమాండ్లను యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం ముందుంచాయి. స్పందించ‌కుంటే ఏప్రిల్ 22 నుంచి స‌మ్మెలోకి వెళ్తామ‌ని స్ప‌ష్టం చేశాయి. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి రాత్రి వ‌ర‌కు నిర్వ‌హించిన చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో కార్మికులు అర్ధరాత్రి నుంచే త‌మ ఆందోళ‌న షురూ చేశారు. మొద‌టి షిఫ్టు నుంచే డ్యూటీల‌కు దూర‌మయ్యారు.
ప్ర‌భుత్వ స్పంద‌న ఎలా ఉంది..
స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రభుత్వం న‌లుగురు ఐఏఎస్‌ల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది. చ‌ర్చ‌ల సంద‌ర్భంగా కమిటీ స‌మ‌స్య‌ల అధ్య‌యనానికి నాలుగు వారాల గ‌డువు కోర‌గా కార్మిక సంఘాలు నిరాక‌రించాయి. సంస్థ ప్ర‌యోజ‌నాలు దృష్టిలో పెట్టుకుని కార్మికులంతా విధులకు హాజ‌రు కావాల‌ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోరారు. కాగా, త్వ‌ర‌లోనే మ‌రోమారు కార్మికుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం లేక‌పోలేదని తెలుస్తోంది.
‘మ‌హాల‌క్ష్మి’పై ప్ర‌భావం..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు ప‌ది వేల వ‌ర‌కు బ‌స్సులు డిపోల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. దాదాపు 60లక్ష‌ల‌కు పైగా ప్ర‌యాణికుల‌కు ఇక్క‌ట్లు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ద్వారా ఉచితంగా ప్ర‌యాణించే మ‌హిళ‌లు మ‌ళ్లీ ప్రైవేట్ వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తూ ఇబ్బందులు ప‌డుతున్నారు.

జాగృతి సంపూర్ణ మ‌ద్ద‌తు
( – క‌విత‌, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు)
ఆర్టీసీ కార్మికులంటే ప్రభుత్వం లెక్కలేనితనంతో వ్యవహరిస్తోంది. వారి న్యాయ‌మైన డిమాండ్లను వెంట‌నే నెర‌వేర్చాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాలి. సమ్మెకు తెలంగాణ జాగృతి త‌ర‌ఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.

ఇది కూడా చదవండి :  డైలాగ్ వార్స్‌.. హీటెక్కిన పాలిటిక్స్

spot_img

Hot Topics

Related Articles