Caste Caluclations | కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే (SEEEPC)నివేదికతో ఆయా వర్గాల్లో ఐక్యతా రాగం మొదలైంది. ఇప్పటికే తమ జనాభా వివరాలను తెలుసుకొని పలు రంగాల్లో తమ పరిస్థితిని అంచనా వేసుకుంటున్నారు. ప్రధానంగా రాజకీయ అంశంపై చర్చించుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా సర్వత్రా చర్చ
కుల గణనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మేరకు ఆయా వర్గాలు తమ జనాభా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న గణాంకాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రాజకీయ ఆసక్తి ఉన్నవారు పొలిటికల్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికపైనే చర్చకు తెర లేపుతున్నారు. కుల చైతన్య ఆవశ్యకతను వివరిస్తున్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని సూచిస్తున్నారు.
యువత ముందడుగు
రాజకీయాల్లోకి ఒకప్పుడు నాలుగు పదుల వయసు దాటాకే వచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యువత మిగతా రంగాలతో పాటు రాజకీయాలపై ఆసక్తి చూపుతుంది. రిజర్వేషన్లు కూడా కలిసి వచ్చిన చోట ఇప్పటికే గ్రామ, పట్టణ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపారు కూడా. ఈ క్రమంలో తాజాగా.. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ఇప్పటినుంచి గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తమ సామాజిక వర్గం ఓట్లపై ఫోకస్ పెంచుతున్నారు. క్షేత్రస్థాయిలో యువతను ఆకర్షించడంపై దృష్టి సారిస్తున్నారు. ‘మన ఓట్లు మన సీట్లు’గా మారాలంటూ ఐక్యత రాగం అందుకుంటున్నారు. ఈ పరిణామాలను ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాన సామాజిక వర్గాలు తమ వైపు ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఈ సర్వే అంశాలే చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి : ఏ కులం వారు ఎంతమంది.. అధికారిక లెక్కలొచ్చినయ్




