Tuesday, April 14, 2026
spot_img

Dsc | టెట్ సరే.. డీఎస్సీ ఎప్పుడు?

Dsc | డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసుకుని ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా కేవలం టెట్ నిర్వహిణకే సర్కారు పరిమితమవుతుందన్న విమర్శ వారి నుంచి వినిపిస్తుంది.
మరోసారి టెట్
టెట్నో(tet) టిఫికేషన్ ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈనెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. జూన్ 9 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ ఉంటుందని పేర్కొంది. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ వచ్చాక కేవలం రెండు సార్లు మాత్రమే
నీళ్లు..నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్తో తెచ్చుకున్న తెలంగాణలో పుష్కరకాలంగా కేవలం రెండుసార్లు మాత్రమే డీఎస్సీ నిర్వహించడం పరిస్థితికి అద్దం పడుతుంది. 2017 అక్టోబర్ లో తొలిసారిగా, 2024 డిసెంబర్ లో రెండోసారి ఈ నియామక పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వాలకు నిరుద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
లక్షల్లో అభ్యర్థులు
రాష్ట్రంలో బీఈడీ(bed), డీఈడీ(ded) పూర్తి చేసిన అభ్యర్థుల ప్రస్తుతం 3లక్షలకు పైనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏటా నిర్వహించే టెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 9సార్లు టెట్ నిర్వహించగా.. కేవలం రెండుసార్లు మాత్రమే డీఎస్సీ నిర్వహించడం గమనార్హం.
పోస్టులు వందల్లో.. పోటీ వేలల్లో
గత రెండు డీఎస్సీల్లోనూ చాలా జిల్లాల్లో పోస్టుల సంఖ్య వంద నుంచి మూడు వందలు లోపు మాత్రమే ఉండగా.. సబ్జెక్టుల వారీగా ఈ సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. మరికొన్ని చోట్ల ఒక్కటి కూడా లేకపోవడం పరిస్థితికి అర్థం పడుతుంది. ఈ క్రమంలో పుస్తకాలతో అహోరాత్రులు కుస్తీ పట్టిన అభ్యర్థులు రిజర్వేషన్ కలిసి రాకో.. సల్ప తేడాతో ఉద్యోగానికి దూరమైన వారు ఎందరో . అలాంటి వారు మరో అవకాశం కోసం పుస్తకాలను వీడకుండా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
డీఎస్సీ అవసరమంటున్న విద్యావేత్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తూనే ఉంది. సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఆర్థిక భారమైన ప్రైవేటుకు పంపేందుకు వెనుకాడడం లేదు. పాఠశాల విద్యను బలోపేతం చేయాలనుకున్న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి నూతన విద్యా సంవత్సరం వరకు ఉపాధ్యాయులను అందుబాటులోకి తేవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అక్కడ రూ.2లకే లీటర్ పెట్రోల్

spot_img

Hot Topics

Related Articles