Monday, April 20, 2026
spot_img

Kavitha party | కొత్త పార్టీ వైపు.. అందరి చూపు

Kavitha party | ఏప్రిల్ 25.. క‌విత కొత్త పార్టీ ఆవిర్భావం. మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆ తేదీ స‌మీపిస్తున్న‌ త‌రుణంలో చేరికలు ఊపందుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆమెతో ట‌చ్‌లోకి వచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పేరున్ననేత‌లు ముందుకు రాక‌పోవ‌డంతో తాజా ప‌రిణామాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి క‌ల‌గిస్తున్నాయి.
అన్ని పార్టీల నుంచి..?
కేసీఆర్ త‌న‌య కావ‌డంతో పాటు ఉద్య‌మ స‌మ‌యంలో జాగృతి ద్వారా బ‌తుక‌మ్మ ఫేంగా నిలిచిన‌ క‌వితకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక చాలా మంది పేరున్న నేత‌లు త‌న‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు ఆమె గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే వారి పేర్లు మాత్రం వెల్ల‌డంచలేదు. కొత్త పార్టీ ఏర్పాటుకు స‌మ‌యం ఆస‌న్నం కావ‌డంతో ఆయా నేత‌లు ప్ర‌స్తుతం తామున్న పార్టీల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ‌గా ప్ర‌ధాన పార్టీలకు చెందిన వారు ఉన్న‌ట్లుగా స‌మాచారం.
బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్‌..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ ఆదివారం జాగృతిలో చేరారు. ఈయ‌న ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసి క‌విత స‌మ‌క్షంలో జాగృతి కండువా క‌ప్పుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌ధాన పార్టీల్లో అల‌జడి మొద‌లైంది. ఇప్ప‌టి వ‌రకు పేరున్న నేత‌ల జాయినింగ్ లేక‌పోవ‌డంతో ప్ర‌ధాన పార్టీలు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. తాజా ప‌రిణామాల‌తో అల‌ర్ట్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ చేరిక‌లు ఉండే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవ‌ల‌ నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ భారీ అనుచర గ‌ణంతో జాగృతిలో చేరిన విష‌యం తెలిసిందే.
డీలిమిటేషన్ లేకపోవడంతో..
ఈసారి రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు డీలిమిటేషన్ ఆధారంగా ఉంటాయని నిన్న మొన్నటి వరకు ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్డీఏ ప్ర‌భుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గాలు పెరుగుతాయని ఆశపడ్డ చాలామందికి నిరాశే ఎదురైంది. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న వారు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. దాదాపు ప్ర‌ధాన రాజకీయ పార్టీల్లో ఇప్పుడున్న స్థానాల్లో పోటీ ఉండడంతో భవిష్యత్ పరిణామాలను బెరీజు వేసుకుంటూ ప‌లువురు దారులు వెతుక్కుంటున్నారు. అనువైన వేదికలను ఎంచుకుంటున్నారు. కొత్త పార్టీల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో అంద‌రి చూపు జాగృతి వైపు ప‌డింది. మున్ముందు చేరిక‌లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి :  రేవంత్ కాంగ్రెస్..!

spot_img

Hot Topics

Related Articles