Monday, July 27, 2026
Home Blog Page 10

Chitchat war | బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి

Chitchat war | ‘పేరు’తో మొదలైన ఆ పోరు చినికి చినికి గాలి వానగా మారిందా.. అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి తాజా పరిస్థితులు. కొత్త పార్టీ వేళ ఇటు కవిత(kavitha).. అటు కేటీఆర్(ktr) చిట్‌చాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఎవరేమన్నారంటే..
కొత్త పార్టీ పేరు విషయంలో జాగృతి అధ్యక్షురాలు ఇటీవల చిట్‌చాట్‌లో ‘బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చని..’ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై గులాబీ పార్టీలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో కేటీఆర్ తాజాగా చిట్‌చాట్‌లో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ‘ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీపరంగా నష్టపోయాం.. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పును పరిశీలిస్తున్నాం.. అయితే అధినేత నిర్ణయమే ఫైనల్‌’ అంటూ చెప్పకొచ్చారు. అలాగే ‘మా నుంచి తప్పులు తెలుసుకున్నాం.. సరిదిద్దుకుంటున్నాం..’ అనడంతో పాటు.. ‘జైలుకు వెళితేనే సీఎం అవుతారనేది భ్రమ..’ అంటూనే  ‘ పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు.. కానీ ఏడిపించకూడదు ‘ అంటూ పరోక్షంగా కవితను ఉద్దేశించి చేసిన విమర్శలు ప్రస్తుతం పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చకు దారి తీశాయి.
జాగృతి నుంచి ప్రతి విమర్శలు..
జాగృతి నుంచి కూడా ప్రతి విమర్శలు మొదలయ్యాయి. మీడియా డిబేట్ల‌లో ఇప్పటికే ప‌లువురు స్పందిస్తున్నారు.

  • ‘ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మా పార్టీని టార్గెట్‌ చేసే క్రమంలో నా బిడ్డను అరెస్టు చేసిందని, ఆమె ఏ తప్పు  చేయలేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే విషయాన్ని.. ‘ సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. న్యాయస్థానం కూడా ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం మరిచిపోయారా.. అని పేర్కొంటున్నారు. మరోవైపు ‘ జైలుకు పోతే కాదు.. జైలుకు పంప‌బ‌డితే ముఖ్య‌మంత్రులు అవుతున్నార‌నే విష‌యాన్ని రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
  • గతంలో పార్టీ పరిస్థితులను.. కవిత లేఖ ద్వారా వివరించి సరిచేసుకుంటే బాగుంటుందని పేర్కొంటే దానిని అధిష్టానం తీవ్రంగా పరిగణించ లేదా.. ఈ క్రమంలోనే చివరికి ఆమెపై వేటు వేయలేదా.. ఇప్పుడు అదే అంశాన్ని కేటీఆర్‌ ‘మా నుంచి కూడా కొన్ని తప్పులు జరిగాయి.. సరిదిద్దుకుంటున్నాం’ అంటూ పేర్కొనడం ఆలస్యంగా మేల్కొన్నట్లుగా భావించ‌వ‌చ్చా.. అని పేర్కొంటున్నారు.
  • ఇంటి ఆడబిడ్డను ఓ వ్యక్తి అసభ్యకరంగా తూలనాడితే కనీసం స్పందించలేదని, ‘ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిదా..’ అని కూడా ప్రశ్నిస్తున్నారు.
  • ఇలా అన్న చెల్లెలు చిట్ చాట్ సంద‌ర్భంగా చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లతో రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నాయి.
  • ఇది కూడా చదవండి : కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!

kavitha party | ఆమె అడుగులు.. వ్యూహాత్మ‌కం!

kavitha party | ప‌శ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్ర‌మ‌వుతుండ‌గా .. తెలంగాణ‌లో పొలిటిక‌ల్ వార్ మొద‌లైంది. ఈనెల 25న కొత్త పార్టీగా రాబోతున్న‌ట్లుగా క‌విత ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జాతీయ పార్టీలే ఉన్నాయ‌ని తాము ‘తెలంగాణ’ ఆత్మ‌గా ఇంటి పార్టీగా రాబోతున్నామ‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు ఆమె వ్యూహాత్మ‌క అడుగులు రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆలోచింప‌జేస్తున్నాయి.

పేరుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌..
బీఆర్ఎస్ నుంచి దూర‌మైన జాగృతి క‌విత ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎజెండాగా పార్టీ ఏర్పాటుపై దృష్టి సారించగా.. ఆ పేరుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌ మొద‌లైంది. ఈసీ వ‌ద్ద ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా న‌మోదైనట్లుగా లీకులొచ్చాయి. అయితే క‌విత ఇటీవ‌ల మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా ‘బీఆర్ఎస్ గా మారిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చని..’ చేసిన కామెంట్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో కొత్త‌ పార్టీ టీఆర్ఎస్‌గా ఉంటుంద‌నే మీడియా క‌థ‌నాలు బీఆర్ఎస్‌లో చ‌ర్చకు దారితీశాయి. అయితే కేటీఆర్ తాజాగా చిట్‌చాట్‌లో తాము బీఆర్ఎస్‌తో న‌ష్ట‌పోయామ‌ని త్వ‌ర‌లో టీఆర్ఎస్‌గా మార‌బోతున్న‌ట్లు చేసిన కామెంట్ రాజ‌కీయవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
అన్నిపార్టీల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు..
పార్టీ అధినేత్రిగా రానున్న త‌రుణంలో క‌విత‌ పాల‌క పార్టీల‌తో పాటు విప‌క్షాల‌పై విమ‌ర్శ‌ల దాడి పెంచారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను ఎండ‌గ‌డుతున్నారు. మ‌రోవైపు కేంద్రంలో బీజేపీ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను తూర్పార ప‌డుతున్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆర్ఎస్‌నూ వ‌ద‌ల‌డం లేదు. ఆ పార్టీ ప్ర‌స్తుతం నిద్రావ‌స్థ‌లో ఉంద‌ని సెటైర్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌నం గొంతుక‌గా వ‌స్తున్న ఆడ‌బిడ్డ‌ను ఆద‌రించి అక్కున చేర్చుకోవాల‌ని ప్రజలను కోరుతున్నారు. పార్టీ ఆవిర్భావానికి అన్ని వ‌ర్గాలు త‌ర‌లిరావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.
విధి విధానాల‌పై సమాలోచ‌న‌లు
స్వ‌యంగా కేసీఆర్ కుమార్తె అయిన క‌విత ఆలోచ‌న‌లు తండ్రిని పోలి ఉంటున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కొత్త పార్టీ విధి విధానాల‌పై ఆయా రంగాల నిపుణుల‌తో ఆమె సుదీర్ష‌ చ‌ర్చ‌లు అంద‌రినీ ఆలోచింప‌జేస్తున్నాయి. ‘ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎజెండాగా.. ప్ర‌శ్నించ‌డమే ల‌క్ష్యంగా’ త‌మ పార్టీ ముందుకు సాగుతుంద‌ని ఆమె ఇదివర‌కే ప్ర‌క‌టించ‌డంతో ఆవిర్భావ స‌భ‌పై అంద‌రి దృష్టి ప‌డింది.

ఇది కూడా చదవండి : స‌గం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!

Be possitive | డాడీ నిన్ను చూడాల‌నిపిస్తుంది.. మమ్మీ అని పిల‌వాల‌నిపిస్తుంది!

Be possitive | ఆ క్ష‌ణం క‌న్నీటి పొర నా దృష్టికి తెరవేసింది.. మెద‌డును మొద్దుబార్చింది. గుండెను రాయిలా మార్చేసింది. ఉద‌యం చెవిని తాకిన ఆ వైఫల్యపు వార్త నా జీవితానికి చరమగీతం పాడింది. క్షణికావేశం మీకు కడుపుకోతగా.. నాకు తీరని వ్యథగా మిగిల్చింది. చదువే సర్వస్వం అనుకునే నేను చివరికి నన్నే కోల్పోవాల్సి వచ్చింది. ఇప్ప‌టికీ ఏడాద‌వుతుంది డాడీ మీకు దూరమై. అమ్మ ఎలా ఉంది.. అక్క బాగుందా.. ఈ రోజు త‌మ్ముడి రిజ‌ల్ట్ అంట క‌దా.. టెన్ష‌న్ ప‌డ‌క‌ను. మార్కులే జీవితం కాద‌ని చెప్పు. వాడి భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇవ్వు. నా మాటగా చెప్పు.

చివరి ప్రయాణం మరచిపోలేక పోతున్నా
నా మీద మీ ప్రేమ‌ను ఆ దేవుడు చూడ‌లేక‌పోయాడేమా.. అందుకే న‌న్ను మీ నుంచి దూరం చేసిన‌ట్లున్నాడు. ఆ రోజు విగ‌త జీవిగా న‌న్ను చూసిన నువ్వు.. “ఎక్క‌డికి పోయిన‌వ్ త‌ల్లీ” అంటూ వెక్కివెక్కి ఏడ్వ‌డం నేను పుట్టిన‌ప్ప‌టి నుంచి చూడ‌లే డాడీ. నా మీద ప‌డి మ‌మ్మీ సొమ్మ‌సిల్లడం చూసి లేపాల‌నిపించింది. కానీ, నా శక్తి స‌రిపోలే. ఫ్రెండ్స్‌ అంతా “మ‌మ్మ‌ల్ని వ‌ద‌లిపోయావా” అంటూ క‌న్నీటితో చేసిన చివ‌రి ప్ర‌యాణం యాదికొస్తనే ఉంది.
తొందరపడకండి..
డాడీ ఎంతో మందికి గైడెన్స్ ఇచ్చే మీరు న‌న్నెందుకు మార్చ‌లేక‌పోయారు. నా మొండిత‌నం, సున్నిత‌త్వం మీకే ఎక్కువ తెలుసు. నేను బాధ‌ప‌డుతా అనుకున్నారా? అదే కాబోలు. అందుకే ఒక్క‌మాట కూడా అన‌లేదు. మార్కులే జీవితం కాదు అని మీరు ప‌దేప‌దే చెప్పినా నేనే వినిపించుకోలేదు. మీ ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌లేక‌పోయా అని భ‌య‌ప‌డ్డా. తొంద‌ర‌ప‌డ్డా. ఆ బలహీన క్ష‌ణం ఖ‌రీదు నా నిండు ప్రాణం. మీకు దూర‌మై నేటికి ఏడాది. ఇక్కడ పలకరించే వాళ్లు లేరు.. తినమని బతిమలాడే మీరు లేరు. ఒంట‌రిగా శూన్యంలో ఉంటున్నా.. ఏడువని రోజులేదు.. డాడీ నిన్ను మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది.. మ‌మ్మీని గ‌ట్టిగా హ‌త్తుకుని ఏడ‌వాల‌నిపిస్తుంది. ఫ్రెండ్స్.. ఒక్క‌టి మాత్రం నిజం.. మార్కులు అంటూ నాలాగా తొంద‌ర‌ప‌డ‌కండి. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోకండి క‌న్న‌వారికి క‌డుపుకోత మిగ‌ల్చ‌కండి.

( ఇంటర్ ఫ‌లితాల వేళ గ‌తేడాది త‌నువుచాలించిన ఓ అమ్మాయి ఆత్మ‌ఘోష‌కు అక్ష‌ర‌రూపం)

Petrol cheap | అక్కడ రూ.2లకే లీటర్ పెట్రోల్!

  • Petrol cheap | ప‌శ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై చూపింది. హోర్ముజ్‌ జ‌ల సంధిని ఇరాన్ మూసివేయ‌డంతో క్రూడాయిల్ ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించింది. పెట్రోల్ ధ‌ర‌ల‌కు ఒక్క‌సారిగా రెక్క‌లోచ్చాయి. అయితే ఆ దేశాల్లో మాత్రం ఇప్పటికీ చాలా చౌకండి. వాటి గురించి తెలుసుకుందామా మ‌రి. ( ఏప్రిల్ 6, 2026 ధరల ఆధారంగా)
    లిబియాలో రూ.2.14 మాత్ర‌మే..
    ప్ర‌పంచంలోనే పెట్రోల్(petorl) ధ‌ర అతి త‌క్కువ‌గా ఉన్న దేశం లిబియా. ఇక్క‌డ లీట‌ర్ కేవ‌లం 0.023 డాల‌ర్లు మాత్ర‌మే. అంటే మ‌న క‌రెన్సీలో రూ. 2.14లు. త‌ర్వాత‌ స్థానాల్లో ఇరాన్ (రూ.2.70), వెనుజులా (రూ.3.26), అంగోలా(రూ.30.43), కువైట్ (రూ.31.55), అల్జీరియా (రూ.32.95), తుర్క‌మెనిస్తాన్ (రూ.39.83), ఈజిప్ట్ (రూ.40.86), క‌జ‌కిస్తాన్ (రూ.48.95),ఖ‌తార్ (రూ.52.30), సౌదీ అరేబియా (రూ.57.79), ఒమ‌న్ (రూ.57.89), ఇరాక్ (రూ.60.40), బెహ్రాయిన్ (రూ.62.36) ఉన్నాయి.
    మన పొరుగు దేశాల్లో
    ఇండోనేషియా(రూ.67.69), భూటాన్ (రూ.85.38), బంగ్లాదేశ్ (రూ.90.50),మాల్దీవులు(రూ.96.46), ఆఫ్ఘనిస్తాన్ (రూ.88.82), ఇండియాలో రూ.101.39, చైనా(రూ.124.86), పాకిస్తాన్(రూ.126.25), నేపాల్(రూ.126.44), శ్రీలంక(రూ.134.26), బర్మా(రూ.141.52)
    అక్కడ మాత్రం చాలా హాట్
    హాంగ్ కాంగ్ లో ప్రపంచంలోనే అత్యధికంగా రూ.384.90 గా ఉంది. తర్వాత మాల్వి(రూ.358.18), నెదర్లాండ్స్(రూ.252.18), డెన్మార్క్(రూ.250.79) ఇజ్రాయిల్(రూ.245.76), మొనాకో(రూ.239.34), జర్మనీ(రూ.235.24), లిచ్ టెస్టిన్(రూ.231.05), సింగపూర్(రూ.223.98), గ్రీస్(రూ.223.79), అల్బెనీయా(రూ.223.70), ఫిన్ ల్యాండ్(రూ.219.69), స్విట్జర్లాండ్(రూ.218.58), ఫ్రాన్స్(రూ.215.04)
  • ఇది కూడా చదవండి : స‌గం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!

Telangana politics | స‌గం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!

Telangana politics | కాంగ్రెస్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు సమీపిస్తుంది. ఇంకో స‌గం పిరియడే మిగిలింది. ఆయా పార్టీలు అప్పుడే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెడుతున్నాయి. అధికార పార్టీ హామీల అమ‌లుపై దృష్టి సారిస్తుండ‌గా.. విప‌క్షాలు స‌ర్కారు తీరును ఎండ‌గడుతూ క్షేత్ర స్థాయిపై న‌జ‌ర్ పెంచుతున్నాయి. బ‌లం, బ‌ల‌హీన‌త‌ల‌ను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

  • హామీల అమలుపై హస్తం ఫోకస్..
    కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం విధితమే. ఇందులో కొన్ని అమలు చేయగా .. మరికొన్ని మిగిలాయి. ఓ వైపు వెంటాడుతున్న అప్పులు.. మరోవైపు సంక్షేమ పథకాల అమలు సర్కారు కు కత్తి మీద సాముగా మారాయి. ప్రధానంగా నిరుద్యోగ యువతకు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలుపై తర్జన బర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే పింఛన్ పెంపు, మహిళలకు రూ.2,500 నగదు, స్కూటీల పంపిణీ, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలపై దృష్టి సారించాల్సి ఉంది. మరో ఏడాదిన్నర గడిస్తే ఎన్నికల మూడ్ ఉంటుంది. అప్పుడు చేస్తే మైలేజ్ కన్నా నెగిటివ్ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు పూర్తికాగానే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసి ఎన్నికల ఎజెండాతో ముందుకు సాగేలా ‘హస్తం’అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.
  • వ్యూహాలకు పదును పెడుతున్న గులాబీ బాస్
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ ను చేజార్చుకుంది. ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఓటరు నాడి తెలిసిన గులాబీ బాస్ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. మళ్లీ కేసేఆరే కావాలని జనం నుంచి రావాలన్నదే ఆయన లక్ష్యం. క్రియాశీలకంగా కనిపించకున్నా వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతున్నారు పెద్ద సారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ను టార్గెట్ చేసే పనిలో నిమగ్నమవుతున్నారు.
  • పుంజుకుంటున్న ‘కమలం’
    అసెంబ్లీ ఎన్నికల నుంచి కమలం పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటున్నట్లుగా తెలుస్తుంది. శాసనసభ తో పాటు మండలిలోనూ ఆ పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకుంది. లోక్ సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో సగం సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటుకుంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను రెపరెపలాడించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గతంలో ఆ పార్టీకి ఊపు తెచ్చిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్(bandi sanjay) కి తిరిగి రాష్ట్ర పగ్గాలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా ఆ పార్టీ శ్రేణుల్లో టాక్. అయితే నేతల మధ్య సమన్వయ లోపం కాషాయ పార్టీకి కొంత మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • అందరి చూపు కవిత పార్టీ పైనే
    ఈనెల 25న పార్టీ ఆవిర్భావం ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే. విధి విధానాలు.. జెండా, ఎజెండాపై ఆమె కసరత్తు చేస్తున్నారు. ‘తెలంగాణ జాగృతి పార్టీ’గా పేరు బయటకు రాగా ‘టీఆర్ఎస్’ గా కూడా ఉండవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలన్నది కవిత ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఉన్నాయని, తాము ఇంటి పార్టీగా వస్తున్నట్లుగా జాగృతి అధ్యక్షురాలు తాజాగా ప్రకటించారు. జమిలి ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయనున్న క్రమంలో మహిళా అధ్యక్షురాలుగా వస్తున్న ఈ పార్టీని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
  • ఇది కూడా చదవండి అవునండీ.. యుద్ధానికి బ్రేక్.. కండిషన్స్‌ అప్లై!

results | ఆ రిజల్ట్స్ ఎప్పుడంటే..

results | ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చేస్తున్నారు. ఈ మేరకు బోర్డు కూడా ఏర్పాట్లను వేగవంతం చేసింది. శుక్రవారం విడుదల చేయనున్నట్లు తెలిసింది.
9.97 లక్షల మంది..
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. మొత్తం 9 లక్షల 97 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే ఫెయిల్ అయిన వారి పేపర్లను అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈనెల 10న ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
జెఈఈ మెయిన్స్
దేశవ్యాప్తంగా రెండో విడత(session 2) జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఎన్టీఏ ఈ నెల 2 నుంచి 8 వరకు నిర్వహించింది. సుమారు 11.23 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 11 లేదా 12న కీ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 20 మధ్యలో ఫలితాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ నెల 23 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లుగా ఎన్టీఏ తన వెబ్సైట్లో పేర్కొంది.

ఇది కూడా చదవండి :  అవునండీ.. యుద్ధానికి బ్రేక్.. కండిషన్స్‌ అప్లై!

War breake | అవునండీ.. యుద్ధానికి బ్రేక్.. కండిషన్స్‌ అప్లై!

War breake | డెడ్‌లైన్ ముగిసింది.. ఇక యుద్ధం తప్పదనే సమయంలో ఎంట్రీ ఇచ్చింది పాకిస్తాన్‌. మధ్యవర్తిత్వం జరిపి సీజ్‌ ఫైర్‌(కాల్పుల విరమణ)కు కారణమైంది. ఇరాన్‌, యూఎస్‌ మధ్య రెండు వారాల చర్చలకు అవకాశం కల్పించింది. హోర్మజ్‌ జలసంధి విషయంలో అంగీకరించిన ఇరాన్‌ తాను పెట్టిన షరతులు.. ట్రంప్(trump) ఇచ్చిన హామీలపై త్వరలోనే ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
చివరి నిమిషంలో..
ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇజ్రాయిల్‌ అగ్రరాజ్యం సహకారంతో ఇరాన్‌పై దాడులకు పాల్పడుతుండగా అంతే ధీటుగా ఇరాన్‌ కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న క్రమంలో ట్రంప్‌ ఓ గడువు విధించారు. అప్పటి వరకు హోర్మజ్ జలసంధి ఓపెన్ చేయాల్సిందే అని ఇరాన్‌కు అల్టీమెటం జారీ చేశారు. లేకుంటే నరకం చూపిస్తామని.. నాగరికతను అంతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఆ గడువు ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ఎంట్రీ ఇచ్చి రెండు వారాల కాల్పుల విరమణ పాటించాలని అమెరికాకు, జలసంధి తెరవాలని ఇరాన్‌కు ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. అయితే తాము పెట్టిన పది షరతులకు అంగీకరిస్తేనే ఓకే అంటూ ఇరాన్‌ ప్రకటించగా.. ట్రంప్‌ సుముఖత వ్యక్తం చేస్తూ కాల్పుల విరమణకు సానుకూలమని చెప్పారు.
సీజ్‌ ఫైర్‌ ప్రకటన తర్వాత పరిణామాలు..

  • పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ నెల 10 నుంచి ఇరు దేశాలతో పాకిస్తాన్‌ వేదికగా ప్రత్యక్ష చర్చలు ఉంటాయని ప్రకటించారు.
  • ఇజ్రాయిల్‌ ట్రంప్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా ప్రకటించినా లెబనాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని పేర్కొనడం గమనార్హం.
  • ఇరాన్‌ సుప్రిం నేత మొజ్తాబా ఖమేని ప్రకటనలో స్పందిస్తూ.. కాల్పుల విరమణ మాత్రమే అని.. యుద్ధం విరమించలేదని పేర్కొన్నారు. అలాగే 14 రోజుల పాటు హోర్మజ్‌ జలసంధి వద్ద భద్రత దళాలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు.
  • ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50శాతం సుంకాలు విదిస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు.
  • ఇరాన్‌తో యుద్దంలో తాము విజయం సాధించామని, తమ ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్లుగా అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ప్రకటించారు. ఇరాన్‌ ప్రాధేయపడడంతో ట్రంప్‌ దయచూపినట్లుగా పేర్కొన్నారు.
  • ఇది కూడా చదవండిహోర్ముజ్.. ‘సంధి’ చిన్నది.. రవాణా పెద్దది

TRS Name | ఆ కొత్త పార్టీ టీఆర్ఎస్సా.. ఇది నిజమేనా.. వారిలో కలవరం!

TRS Name | టీఆర్ఎస్.. రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వినిపించిన పేరు. స్వరాష్ట సాధనలో ముందు నిలిచిన గొంతుక. అయితే ఈ గులాబీ పార్టీ పేరు నాలుగేళ్ల క్రితం బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన విషయం విధితమే. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆ పేరు మళ్ళీ తెర మీదికి వచ్చింది. పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

25న కవిత కొత్త పార్టీ

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఇటీవల బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత ఈనెల 25న కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ పేరు విషయంలో జాగృతి అధ్యక్షురాలు తాజాగా చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. ‘బీఆర్ఎస్ గా మారిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చని..’ మీడియా చిట్ చాట్ లో ప్రస్తావించిన అంశం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి కరంగా మారింది. ఈ నేపథ్యంలో కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ టీఆర్ఎస్ అయి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గులాబీ పార్టీ వర్గాల్లోనూ కవిత పార్టీ ఏమిటా అన్నచర్చ జోరుగా సాగుతోంది.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఇలా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 2001ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించారు. తన ఉద్యమ పంథాతో దశాబ్దాల స్వరాష్ట్ర కల నెరవేర్చారు. ఫలితం 2014లో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. 2018లోనూ రెండోసారి అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. దేశ రాజకీయాల్లోనూ కీలకంగా మారాలని భావించారు. ఈ క్రమంలో 2022 అక్టోబర్ 5న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (BRS) గా మార్చారు గులాబీ బాస్. అయితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి హ్యాట్రిక్ అవకాశం చేజారింది. పార్లమెంట్ ఫలితాలు సైతం ‘కారు’ పార్టీకి నిరాశ కలిగించడం గమనార్హం. ‘తెలంగాణ’ పే(రు)గు బంధానికి దూరం కావడమే పార్టీ ఓటమికి ఓ కారణంగా విశ్లేషకులు చెప్పుకొచ్చారు. ఓ దశలో మళ్లీ టీఆర్ఎస్ గా మారితే బాగుంటుందని పార్టీలోనూ చర్చ మొదలైంది.

సెంటిమెంటు పేరును వదులుకుంటారా?

ఉద్యమ పార్టీకి కలిసొచ్చిన టీఆర్ఎస్ పేరు వేరే వాళ్లకు వెళ్లదని.. ఈసీ కూడా తమ అనుమతి లేకుండా వేరే వాళ్లకు ఇచ్చే అవకాశం ఉండదని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మీడియా చిట్ చాట్ లో కవిత కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారగా.. ఆమె పూర్వాశ్రమ పార్టీ బీఆర్ఎస్ ను కలవరపాటుకు గురి చేసింది. ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ టీఆర్ఎస్సా మరొకటా అనే సస్పెన్స్ కు తెరపడాలంటే ఈ నెల 25 వరకు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి : కోల్‌బెల్ట్‌పై ‘జాగృతి’ ఫోకస్‌.. ‘సేవ్‌ సింగరేణి’ పేరిట ముందడుగు

Borders no change | సరిహద్దుల మార్పులుండవ్‌.. అప్పటి వరకూ నో చేంజ్‌!

Borders no change | రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లే. అలాగే జిల్లాల పునర్విభజన కూడా ఉండకపోవచ్చు. మరో ఏడాది వరకు బ్రేక్‌ పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఈ విషయాన్ని స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

2027మార్చి చివరి వరకు..
వచ్చే ఏడాది మార్చి 31 వరకు జిల్లా, మండల, గ్రామ సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని కేంద్రం పేర్కొన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో బోథ్ రెవెన్యూ డివిజన్ అంశాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ప్రస్తుతం జన గణన సర్వే నిర్వహిస్తున్న తరుణంలో అది పూర్తయ్యేంతవరకు చేసే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది.
పునర్విభజన నేపథ్యంలో
మరోవైపు జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) కసరత్తు చేపడుతున్న తరుణంలో సరిహద్దుల మార్పులు చేపట్టకూడదని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.
అప్పటివరకు ఆగాల్సిందే
గతంలో అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాలను శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేపట్టడం అవసరమని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి(ponguleti) గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. కొత్త జిల్లాలతో ఏర్పాటుతో పాటు కొన్నిచోట్ల మళ్లీ కలపాలని విన్నపాలు వెల్లువెత్తాయి. ఆందోళనలు కూడా మొదలయ్యాయి. జిల్లా, మండల సాధన సమితిలు ఒకసారిగా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా హుజురాబాద్ ను కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా హనుమకొండ, వరంగల్ ను తిరిగి ఒకే జిల్లాగా మార్చాలని, సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిన హుస్నాబాద్ ను తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ స్థానికుల నుంచి ఆకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జిల్లాలు చాలావరకు తగ్గుతాయని, కొన్ని సరిహద్దులు మారుతాయని ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంటు స్థానాల ఆధారంగా పునర్విభజన జరిగే అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అయితే తాజాగా సీఎం ప్రకటన నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు ఆగల్సిందే అని స్పష్టమవుతోంది.

ఇది కూడా చదవండి : సీట్లు పెరుగుతున్నాయోచ్.. ఎమ్మెల్యే,ఎంపీ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

save singareni | కోల్‌బెల్ట్‌పై ‘జాగృతి’ ఫోకస్‌.. ‘సేవ్‌ సింగరేణి’ పేరిట ముందడుగు

save singareni |సింగరేణి సంస్థ మనుగడ.. కార్మికుల సమస్యలపై తెలంగాణ జాగృతి ఫోకస్‌ పెంచింది. గతంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగిన కవిత త్వరలో పార్టీ పెట్టబోతున్న క్రమంలో కోల్‌బెల్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆమె ఈ ప్రాంతం నుంచే పోటీ చేస్తారా.. అందులో భాగంగా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారా.. వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆరు జిల్లాల పరిధిలో కోల్‌బెల్ట్‌
రాష్ట్రంలో కోల్‌బెల్ట్‌ ప్రాంతం ఆరు జిల్లాల పరిధిలో విస్తరించింది. కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు, ఓపెన్‌కాస్టులు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 12 అసెంబ్లీ, 5 పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. లోక్‌సభ విషయానికి వస్తే ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబ్‌బాద్‌, ఖమ్మం స్థానాల్లో నల్లసూరీలది కీలక పాత్ర. ఉత్తర తెలంగాణలో ఇవి మెజారిటీ స్థానాలు కావడం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
సమస్యల ఎజెండాతో ముందుకు..
టీఆర్‌ఎస్‌(ప్రస్తుత బీఆర్‌ఎస్‌)కు అనుబంధంగా కొనసాగిన టీబీజీకేఎస్‌ సింగరేణిలో గుర్తింపు సంఘంగా వెలుగొందింది. ఆ సమయంలో కవిత గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. దీంతో ఆమెకు ఈ ప్రాంతంపై, కార్మికుల సమస్యలపై అవగాహన ఉంది. త్వరలో పార్టీ పెట్టబోతున్న క్రమంలో బొగ్గు గని కార్మికుల సమస్యలపై ఫోకస్‌ పెంచినట్లు తెలిసింది. ఇందులో భాగంగా తాజాగా ‘సేవ్‌ సింగరేణి’ (save singareni )పేరిట రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి ఐదు తీర్మానాలతో కార్మిక వర్గం దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా డిపెండెంట్‌ ఉద్యోగాల విషయంలో విజిలెన్స్‌ ఎంక్వైరీ చేయాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అలాగే కార్మికవర్గానికి ఇబ్బందికరంగా మారిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటుతో పాటు అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలన్నారు. నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను సింగరేణి సంస్థనే ఆపరేట్ చేయాలన్నారు.
పట్టు సాధించేలా..
ప్రధానంగా సింగరేణి ప్రాంతాల్లో కార్మిక కుటుంబాలతో పాటు పరోక్షంగా ఉపాధి పొందే ఉండే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కార్మికుల సమస్యలపై ఫోకస్‌ చేస్తే రానున్న రోజుల్లో ఆవిర్భవించనున్న కవిత కొత్త పార్టీకి మంచి మైలేజ్‌ ఉండే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఒకవేళ తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ‘ఆమె’కు అందలం దక్కేనా.. రానున్న ఎన్నికల్లో మహిళా శక్తి కీలకం కానుందా?.. ఎవరికి కలిసొచ్చేనో..!