Monday, July 27, 2026
Home Blog Page 4

Pavan vs Telangana | తెలంగాణ అస్తిత్వ గానం.. ఉద్యమ రణన్నినాదం

Pavan vs Telangana | ఆ ఒక్క మాట‌.. తెలంగాణను మ‌ళ్లీ భ‌గ్గుమ‌నేలా చేసింది. ఆవిర్భావ దినోత్స‌వం రోజే అగ్గి రాజేసింది. అస్తిత్వమే ర‌ణ‌ నినాదంగా మారింది. ఉద్య‌మ‌కారుల హెచ్చ‌రిక‌లతో ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ డైలాగ్‌ల‌కు ఈ ప్రాంత‌వాసులు మండి ప‌డుతున్నారు. రాజ‌కీయ పార్టీలు మాట‌ల తూటాలు పేల్చుతున్నాయి. బ‌రాబ‌ర్ ఈ ప్రాంతం మా జాగిరే అంటూ బాజాప్తా స్ప‌ష్టం చేస్తున్నాయి.

జూన్ 2. తెలంగాణ అవ‌త‌రం దినోత్స‌వం. స‌బ్బండ వ‌ర్గాల‌కు పండుగ రోజు. అమ‌ర‌వీరుల‌ను స్మ‌రించుకునే త‌రుణంలో ఒక్క‌సారిగా ఆంధ్రప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ హైద‌రాబాద్ కేంద్రంగా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం లేపాయి. “తెలంగాణ మీ అయ్య జాగీరా” అంటూ చేసిన హాట్ కామెంట్స్‌ ఈ ప్రాంత వాసుల్లో ఆగ్ర‌హం తెప్పించాయి. ఇది తెలంగాణ అస్తిత్వంపై దాడిగా వారు అభివ‌ర్ణిస్తున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ దీనిపై ఘాటుగా స్పందించింది. బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రక్ష‌ణ సేన త‌మ దైన శైలిలో ప‌వ‌న్‌పై విరుచుప‌డ్డాయి.

మాట‌ల యుద్ధం.. ఎవ‌రు ఏమ‌న్నారంటే..

  • “హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావ్‌ అంటున్నారు.. మీరెవరు నన్ను బెదిరించడానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా..” అంటూ పవన్‌ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు.
  • మంత్రి పొన్నం (PONNAM)  స్పందిస్తూ “ముమ్మాటికి ఇది తెలంగాణ ప్ర‌జ‌ల‌ అయ్య‌ల జాగీరే..” అంటూ కౌంట‌ర్ అటాక్ చేశారు. అంతేకాకుంగా గ‌తంలో పవ‌న్ చేసిన కామెంట్స్‌ను ప్ర‌స్తావించారు. తెలంగాణ వ‌స్తే 11 రోజులు అన్నం తిన‌లేద‌ని పేర్కొన‌డం ఆయ‌నకు ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమ‌కు నిద‌ర్శ‌న‌మంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఈ ప్రాంత వాసుల దిష్టితోనే కోన‌సీమ కొబ్బ‌రి ఎండిపోయిందంటూ గతంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు.
  •  “దేశంలో ఎవ‌రు ఎక్క‌డైనా పోటీ చేయ‌వ‌చ్చు.. కానీ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన చారిత్రక పోరాటం, ప్రజల త్యాగాలు, ఆత్మగౌరవ భావనను మాత్రం తక్కువ చేయొద్దు. ఇది ముమ్మాటికి తెలంగాణ భూమి పుత్రుల జాగీరే..” అంటూ బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్ప‌ష్టం చేశారు.
  •  ” ఆంధ్రా ప్రజలతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. సమస్యంతా అక్క‌డి రాజకీయ నాయకులతోనే.. మా అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే ఊరుకోం.. రాజధాని కట్టటం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. తెలంగాణ ఇస్తే 11 రోజులు అన్నం మానేసి పవన్ కళ్యాణ్ కు ఇక్కడేం పని?.. ” అని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్ర‌శ్నించారు. ” తమతో పెట్టుకున్న వాళ్లెవరు బాగుపడలేదని… ఇప్పటికే ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ సాధించుకున్నామని.. మళ్లీ పెట్టుకుంటే పళ్లు రాలుతాయని.. టీఆర్ఎస్ 2.0 అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ” హెచ్చరించారు.
  •  ” ఇది ముమ్మాటికీ మా అయ్య‌ల జాగీరే .. మీరొచ్చి ఏమి మా హైద‌రాబాద్ క‌ట్ట‌లే.. గండికోట నిర్మించ‌లే.. మ‌రోసారి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇలా అగౌర‌వ ప‌రిచేలా మాట్లాడితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. ” అంటూ తెలంగాణ ఉద్య‌మ‌కారుడు పృథ్విరాజ్ పేర్కొన్నారు.
  •  ” ప‌వ‌న్.. ముందు నీ తాత జాగీరు.. తండ్రి జాగీరు.. ఎక్క‌డో..  తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.. ” అని ఎమ్మెల్యే వీరేశం స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.
  • ఇది కూడా చ‌ద‌వండి.. పుష్కర కాలమైనా ఉద్యమ ఆకాంక్షలు నెర‌వేర‌లే!

Telangana @ 12 | పుష్కర కాలమైనా.. ఉద్యమ ఆకాంక్షలు నెర‌వేర‌లే!

Telangana @ 12 | తెలంగాణ‌.. స‌బ్బండ వ‌ర్గాల పోరాటాల‌కు ప్రతీక‌. ద‌శాబ్దాల ఉద్య‌మ చరిత‌కు నిలువెత్తు సాక్ష్యం. అమ‌రుల‌ త్యాగాలతో సిద్ధించిన ఆ చారిత్ర‌క ఘ‌ట్టానికి నేటికి ప‌న్నెండేళ్లు. పాల‌కులు మారినా.. పుష్క‌ర‌కాలం దాటినా ఉద్య‌మ ఆకాంక్ష‌లు నెరవేర‌లే. ప‌రాయి పాల‌న‌లో ద‌గాప‌డ్డ బ‌తుకులు స్వ‌రాష్ట్రంలోనూ బాగు ప‌డ‌లే. నాడు ప్ర‌త్యేక రాష్ట్ర రాక‌తో మూగ‌బోయిన ఆ గొంతుక‌లు మ‌ళ్లీ ప్ర‌తిధ్వ‌నిస్తున్నాయి. పాల‌కుల తీరుపై పిడికిలెత్తేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ముక్కోటి గొంతుక‌గా..
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ట్యాగ్‌లైన్‌తో ప్రత్యేక రాష్ట్ర పోరు మొదలైంది. ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా సాగింది. దశాబ్దాలుగా అణచివేయబడిన అస్తిత్వ సాధన, ఆత్మగౌరవ పునరుద్ధరణ, సామాజిక న్యాయం కోసం ముక్కోటి గొంతుక నినదించింది.
మలుపుతిప్పిన మలిదశ
తొలిదశ ఉద్యమం 1969లో ప్రారంభమైంది. సుమారు 350కు పైగా యువత‌ పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. నాటి ప్ర‌భుత్వం ఉద్యమాన్నిఅణ‌చివేయ‌గా ప్రత్యేక ఆకాంక్ష మ‌రింత బ‌లంగా మారింది . భువ‌న‌గిరి బ‌హిరంగ స‌భ అనంత‌రం ప‌రిణామ‌ల నేప‌థ్యంలో నాడు డిప్యూటీ స్పీకర్ గా కొన‌సాగిన కేసీఆర్‌(KCR) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపించారు. పార్టీ ఏర్పాటుతో ఉద్యమం రాజకీయ మలుపు తీరిగింది. మలిదశలో సబ్బండ వర్గాలు పిడికిలెత్తాయి. పోరుబాటలో సై అని జై కొట్టాయి. ఈక్ర‌మంలో 2009లో కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివ‌చ్చింది. డిసెంబర్ 9న అప్పటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రతిఘటన రావడంతో కేంద్ర స‌ర్కారు వెన‌క్కి త‌గ్గింది. దీంతో తెలంగాణ‌లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిప‌డింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. సకలజనుల సమ్మెతో యూపీఏ ప్రభుత్వం దిగివ‌చ్చింది. 2013లో తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేసింది. పార్లమెంటులో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లును 2014 ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టారు. అదే రోజు ఆమోదం పొందగా.. ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. మార్చి 1న ప్రెసిడెంట్ (రాష్ట్ర‌ప‌తి) సంతకం చేశారు. 2న గెజిట్‌లో పొందుపర్చారు. ఫైన‌ల్‌గా 2024 జూన్ 2ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినంగా ప్రకటించారు.
పుష్క‌ర‌కాలంలో ఏమైంది..
నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో తెచ్చుకున్న స్వ‌రాష్ట్రంలో 12 ఏళ్లు దాటినా ఈ ప్రాంత‌వాసుల ఆకాంక్ష‌లు నెర‌వేర‌లేద‌ని తెలుస్తోంది. నీళ్లు, నిధుల విష‌యంలో కొంత పురోగ‌తి సాధించినా నియామ‌కాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి ప్ర‌జ్వ‌రిల్లింది. ఈ క్ర‌మంలోనే ప‌దేళ్ల పాల‌న సాగించిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌( అప్ప‌టి టీఆర్ఎస్‌)ను ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం చేశారు. నిరుద్యోగ డిక్ల‌రేష‌న్‌, జాబ్ క్యాలెండ‌ర్ వంటి కీల‌క హామీల‌తో యువ‌త‌ను ఆక‌ర్షించిన హ‌స్తం పార్టీకి 2023లో అధికారం ద‌క్కింది. అయితే రెండున్న‌రేళ్లు గ‌డిచినా నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌క‌పోవ‌డంతో వారిలో అస‌హ‌నం పెరిగింది. ఇంకెన్నాళ్లు అంటూ నిర‌స‌న గ‌ళం మొద‌లైంది. పోరుబాట‌లో ముందు న‌డిచి ఆత్మ బ‌లిదానాల‌కు సైతం వెనుక‌డుగు వేయ‌ని విద్యార్థి, నిరుద్యోగ లోకాన్ని విస్మ‌రిస్తే త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. మ‌రోవైపు అమ‌రుల కుటుంబాలు, ఉద్య‌మ‌కారుల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర‌క‌పోవ‌డంతో ఆయా వ‌ర్గాలు సైతం పాల‌కుల‌పై గుర్రుగా ఉన్నాయి. క‌మిటీల‌తో కాల‌యాప‌న కాకుండా ప‌రిష్కారంపై చొర‌వ‌చూపాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. అయితే ప్ర‌స్తుత  రేవంత్ స‌ర్కారు ఈ ఆవిర్భావ దినోత్స‌వం రోజున ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తుందో వేచి చూడాల్సిందే మ‌రి.

ఇది కూడా చ‌ద‌వండి.. జూన్ 1 నుంచి మార్పులివే.. ఓ లుక్కేయండి

New Updates | జూన్ 1 నుంచి మార్పులివే.. ఓ లుక్కేయండి

New Updates | కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి ప‌లు విభాగాల్లో కీల‌క మార్పులను అమ‌లులోకి తీసుకురానున్న‌ట్లుగా ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆదాయ‌పు ప‌న్ను, బ్యాంకింగ్, ఇంధ‌న‌ రంగాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా మ‌రి.
పాన్ కార్డు విషయంలో..
ఇక నుంచి ఒక రోజులో రూ.50వేల‌ కంటే ఎక్కువ నగదు జమ చేయడానికి పాన్ కార్డు అవసరం లేదు. ఒక‌వేళ ఆర్థిక సంవత్సరంలో మీ అన్ని బ్యాంకు ఖాతాల నుంచి చేప‌ట్టే న‌గ‌దు డిపాజిట్లు, విత్‌డ్రాల‌కు సంబంధించి రూ.10 లక్షలు దాటితే మాత్రమే కార్డు అందించాల్సి ఉంటుంది. అలాగే ఆస్తి క్ర‌య విక్ర‌యాల‌ కోసం పాన్ పరిమితి గ‌తంలో రూ.10 లక్షల వర‌కు ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.20 లక్షలకు పెంచారు. అలాగే ఆదాయపు పన్ను చట్టం-2025 ప్ర‌కారం ఈ (2026-27) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి అడ్వాన్స్ టాక్స్ వాయిదా చెల్లింపున‌కు జూన్ 15 తుది గ‌డువు. ఈ ప‌రిధిలోకి వ‌చ్చే వారు స‌కాలంలో చెల్లించ‌క‌పోతే ప్రతి నెల ఒక‌ శాతం చొప్పున వడ్డీ పెనాల్టీ పడ‌నుంది.
యూపీఐ మోసాలకు ఇక చెక్
డిజిటల్ మోసాలు అరికట్టే చర్యల్లో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వినియోగ‌దారుల‌కు రిలీఫ్ ఇచ్చేలా అప్‌డేట్ తీసుకువ‌చ్చింది. మ‌నం డ‌బ్బులు ఎవ‌రికైనా పంపాల‌నుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ లేదా మొబైల్ నంబర్ ఎంట‌ర్ చేస్తాం. ఈ స‌మ‌యంలో గ్ర‌హీత (ఆ వ్య‌క్తి) బ్యాంకులో నమోదు చేసుకున్న పేరు మాత్ర‌మే ఇకపై స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. గ‌తంలో మారుపేర్ల‌తో కేటుగాళ్లు మోసాల‌కు పాల్ప‌డేవారు. అలాంటి వాటికి ఇది చెక్ పెడుతుంది. అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూపీఐ ద్వారా నేరుగా ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణలను అవకాశం క‌ల్పిస్తుంది. అయితే స‌ద‌రు మెంబ‌ర్‌ను అనుమతించేందుకు గాను ప‌లు పరీక్షలు చేస్తోంది. తద్వారా మోసాల‌కు తావు లేకుండా ప్ర‌క్రియ సుల‌భ‌త‌రం కానుంది.
ఏటీఎం చార్జీలు పెరిగే అవ‌కాశం..
ఓ వైపు ఆన్‌లైన్, డిజిట‌ల్ పేమెంట్లు సులువుగా మారుతున్నత‌రుణంలో సంప్ర‌దాయ‌ బ్యాంకింగ్ కాస్త ఖరీదు కానుంది. ప‌లు వాణిజ్య బ్యాంకులు ఏటీఎం చార్జీలను సవరిస్తున్నాయి. దీనివల్ల లిమిట్ దాటి నగదు విత్‌డ్రా చేసినా, మినీ స్టేట్‌మెంట్ , బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటివి సేవ‌లు ఎక్కువ సార్లు వినియోగించినా కొంత మేర చార్జీలు పెర‌గ‌నున్నాయి.
పెరిగిన గ్యాస్‌ ధరలు
ప్రతి నెల ఒకటో తేదీన‌ ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ , సీఎన్‌జీ ధరలను సమీక్షిస్తున్నాయి. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ. వెయ్యి వ‌ర‌కు పెరిగిన విష‌యం తెలిసిందే. తాజాగా జూన్ 1 నుంచి మ‌రో రూ.42 లు పెంచ‌డంతో వ్యాపారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
ఇది కూడా చ‌ద‌వండి.. ఇక బ్యాంకుల వంతు.. ఏఐ దెబ్బకు ఊడిపోనున్న ఉద్యోగాలు!

Ai Skills Training | బీసీ స్టడీ సర్కిల్ లో ముగిసిన శిక్షణ

Ai Skills Training | కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, IBM సర్టిఫికేషన్ వారి సహ కారంతో నిర్వహించిన నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఏఐ రంగంలో ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం,డిజిటల్ నైపుణ్యాలపై నిపుణులు అవగాహన కల్పించారు. శిక్షణ విజ‌యవంతంగా పూర్తి చేసుకున్న‌ 55 మందికి బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రవి కుమార్ శ‌నివారం సర్టిఫికెట్లు అందజేశారు. యువ‌త‌ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు శశాంక్ రెడ్డి మహేంద్ర రౌత్, బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి.. ఇక బ్యాంకుల వంతు.. ఏఐ దెబ్బకు ఊడిపోనున్న ఉద్యోగాలు!

AI Effect | ఇక బ్యాంకుల వంతు.. ఏఐ దెబ్బకు ఊడిపోనున్న ఉద్యోగాలు!

AI Effect |  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్ర‌భావం ఇప్పటికే టెక్ కంపెనీలపై చూపుతుండగా.. తాజాగా బ్యాంకుల‌పై కూడా ప‌డింది. ఏఐ ఇప్ప‌టికే వేలాది కొలువుల‌ను కొల్ల‌గొడుతూ ఉపాధికి దూరం చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ కోవ‌లోకే చేరింది ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ బ్యాంక్ అయిన‌ స్టాండ‌ర్డ్ చార్టెడ్‌ బ్యాంక్. ఇందులో ప‌నిచేసే దాదాపు 7,800 ఉద్యోగాలు ఊడిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
బ్యాంకులపై ప్రభావం
ఏఐ దెబ్బ‌తో ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో కొలువులు కోల్పోతుండగా తాజాగా అంత‌ర్జాతీయ బ్యాంకుల్లోనూ మొద‌ల‌య్యే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ఆ ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ స్టాండ‌ర్డ్‌ చార్టెడ్ బ్యాంకు తాజాగా 15శాతం ఉద్యోగాల తొలగింపు ప్రక్రియకు శ్రీ‌కారం చుట్టింది. ఈమేర‌కు ఆ బ్యాంకు సీఈవో బిల్‌ వింటర్స్‌ ప్రకట‌న సంచ‌ల‌నంగా మారింది. ఏఐ టూల్స్‌ ద్వారా తక్కువ ఖర్చుతో సమర్ధవంతమైన సేవ‌లు నిర్వహించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయ‌న పేర్కొన్నారు. అయితే ఈ ఉద్యోగుల్లో ఎవరైనా పునఃశిక్షణకు ఆస‌క్తి చూపితే మాత్రం వారికి త‌దుప‌రి నియామ‌కాల్లో ప్రాధాన్యం ఇస్తామని సీఈవో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.
స‌ర్వ‌త్రా టెన్ష‌న్‌
ఈ బ్యాంకు 2030లోగా సుమారు 7,800 మందిని ఇంటికి పంపించాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో ఎక్కువగా భార‌త్‌లోని చెన్నై, బెంగళూరు వారున్నారు. అలాగే చైనాలోని షెంజెన్‌, పోలెండ్‌ రాజధాని వార్సాల్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉన్న‌ట్లుగా బ్యాంకు వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. ఈ అంశం ప్ర‌స్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎప్పుడు ఏ బ్యాంకు ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా టెన్ష‌న్‌ నెలకొంది.

ఇది కూడా చ‌ద‌వండి.. బీజేపీలో ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. కొత్త సార‌థి త‌థ్య‌మేనా?

Bjp Focous | బీజేపీలో ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. కొత్త సార‌థి త‌థ్య‌మేనా..?

Bjp Focous | క‌మ‌లం పార్టీలో ప్ర‌క్షాళ‌న ఉంటుందా.. అంత‌ర్గ‌త విభేదాల‌పై అధిష్టానం దృష్టి సారించిందా.. సార‌థ్య మార్పు త‌థ్య‌మా.. అంటే తాజా ప‌రిస్థితులు అవున‌నే సంకేతాలిస్తున్నాయి. ఉత్త‌రాదిపై పూర్తిస్థాయిలో ప‌ట్టు బిగించిన బీజేపీ ప్ర‌స్తుతం ద‌క్ష‌ణాదిపై ఫోక‌స్ పెంచింది. తెలంగాణ‌లో రానున్న అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్న‌ట్లుగా తెలుస్తోంది.
మెజార్టీ రాష్ట్రాల్లో పాగా..
దేశవ్యాప్తంగా ఇప్ప‌టికే మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ(Bjp), మిత్రపక్షాల ప్ర‌భుత్వాలు కొన‌సాగుతున్నాయి. 29 రాష్ట్రాలకు (ఢిల్లీ క‌లిపి)గాను 17చోట్ల క‌మ‌లం ప్రభుత్వాలే కొన‌సాగుతున్నాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి పాలన సాగుతోంది. మొత్తంగా 21 చోట్ల అంటే దాదాపు 70శాతం పైబ‌డి రాష్ట్రాల్లో కాషాయం హ‌వా క‌నిపిస్తుంది. కేవ‌లం ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే ప్రతిపక్షాల పాలనలో ఉండ‌డం గ‌మ‌నార్హం.
స‌మ‌న్వ‌యంపై ఫోక‌స్‌
ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా మూడింటిని కైవ‌సం చేసుకున్న బీజేపీ ఊపుమీదుంది. కీల‌క‌మైన‌ ప‌శ్చిమ బెంగాల్‌లో పాగా వేసిన కాషాయ పార్టీ తాజాగా ద‌క్షణాదిపై ఫోక‌స్ పెంచింది. తెలంగాణ‌పై దృష్టి సారించింది. వచ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా శ్రేణుల‌ను ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధం చేయాల‌ని భావిస్తోంది. అలాగే నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచే దిశ‌గా రాష్ట్ర సార‌థ్యంలో కీల‌క‌మైన‌ మార్పు తేవాల‌ని యోచిస్తున్న‌టుగా తెలుస్తోంది. ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా కొంద‌రు సీనియ‌ర్ల సేవ‌ల‌ను జాతీయ స్థాయిలో వినియోగించుకోవ‌డం, గ‌వ‌ర్న‌ర్ గా అవ‌కాశం క‌ల్పించ‌డం, ఒక‌రిద్ద‌రిని కేంద్ర కేబినేట్‌లోకి తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్‌లో మార్పులుండేనా..?
రాష్ట్రం నుంచి ప్ర‌స్తుతం కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్ కేంద్ర కేబినెట్‌లో కొన‌సాగుతున్నారు. వీరిలో ఒక‌రిని జాతీయ కార్య‌వ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశాలున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ స్థానాన్ని ఎస్టీ లేదా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారితో భ‌ర్తీ చేయ‌నున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇక ప్ర‌స్తుతం ఉన్న రాష్ట్ర సార‌థిని మార్చాల్సి వ‌స్తే ప్ర‌ధానంగా బీసీ నేత‌లకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లుగా పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే ఓ సీనియ‌ర్‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్లుగా చ‌ర్చ సాగుతోంది. ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డాలంటే మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇది కూడా చ‌ద‌వండి.. ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ఫీజులు ఎంతో తెలుసా..

Ai Skills | ఆధునిక సాంకేతికతపై అవగాహన అవసరం

  • బీసీ స్టడీ సర్కిల్లో లైఫ్ స్కిల్స్, ఏఐ శిక్షణ ప్రారంభం
  • నాలుగు రోజుల పాటు నిపుణులతో ప్రత్యేక తరగతులు
  • స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రవి కుమార్

Ai Skills | విద్యార్థులు,యువతలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు లైఫ్ స్కిల్స్, ఏఐ శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ఎం.రవి కుమార్ తెలిపారు.క‌రీంన‌గ‌ర్‌ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ లో లైఫ్ స్కిల్స్ (LIfe skills), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఏఐతో పాటు నైపుణ్యాల‌ను పెంపొందించుకోవాల‌ని సూచించారు. ఈనెల 30 వ‌ర‌కు నిర్వ‌హించనున్న శిక్షణ త‌ర‌గ‌తులను స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. అనంత‌రం ఆయా రంగాల నిపుణులు నిర్దేశిత అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. కార్యక్రమంలో మ్యాజిక్ బస్సు ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి.. అందరి చూపు..ఈవీ వైపు

Ev Charging Stations | ఈవీ కొనుక్కోవ‌చ్చు.. చార్జింగ్‌కు ఇక నో ఫిక‌ర్‌.. ప‌ల్లెల్లోనూ అందుబాటులోకి స్టేష‌న్లు

0

Ev Charging Stations | పెట్రో ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈవీ (ఎల‌క్ట్రిక్ వాహ‌నం) గురించి ఆలోచిస్తున్నారా.. అయితే చార్జింగ్ స‌మ‌స్య ఉంటుంద‌ని భావిస్తున్నారా.. ఇక ఆ ఫిక‌ర్ వీడండి.. ఎంచ‌క్క గ్రీన్ ప్లేట్ వాహ‌నం తెచ్చుకోండి. ధ్వ‌ని, వాయు కాలుష్యానికి దూరంగా ఉంటూ మీ ప్ర‌యాణం సాఫీగా సాగించండి.
ప్ర‌భుత్వాల దృష్టి
ప్ర‌స్తుతం ఈవీలు పెరుగుతున్న‌ నేప‌థ్యంలో చార్జింగ్ స‌మ‌స్య‌ త‌లెత్త‌కుండా ఉండేలా కేంద్ర‌, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప‌ట్ట‌ణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ చార్జింగ్ స్టేష‌న్లను అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. వాహ‌న‌దారుల‌కు ఇక్క‌ట్లు తొల‌గ‌డంతో పాటు నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి ద‌క్క‌నుంది.
కేంద్రం చొర‌వ‌..
పీఎం ఈ-డ్రైవ్ కింద జాతీయ ఈవీ ఛార్జింగ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు వేగవంతం చేసింది. ఈ ప‌థ‌కం కింద దేశవ్యాప్తంగా 72,000 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు గాను రూ.2,000 కోట్లు కేటాయించింది. 50 జాతీయ రహదారి కారిడార్ల వెంబడి, మెట్రో నగరాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలు,రాష్ట్ర రహదారుల వంటి అధిక రద్దీ గల ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు యోచిస్తోంది. బీహెచ్‌ఈఎల్ నోడల్ ఏజెన్సీగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. దేశవ్యాప్తంగా ఉన్న EV వినియోగదారులకు ఒకే వేదికగా పనిచేసే ఏకీకృత డిజిటల్ సూపర్ యాప్ అభివృద్ధికి కీల‌కంగా ఈ సంస్థ ప‌నిచేయనుంది.
గ్రామీణ ప్రాంతాల‌పై రాష్ట్రం ఫోక‌స్
గ్రామీణ ప్రాంతాల్లోనూ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ప్రాథ‌మిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వీటిని నిర్వహించాల‌ని యోచిస్తోంది. తొలిదశలో ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోని 35 చోట్ల ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి ద్వారా ఈవీ వినియోగదారులకు సౌలభ్యంతోపాటు ఆయా సంఘాలకు ఆదాయం లభించ‌నుంది.
ఏర్పాటు ఇలా…
ఒక్కో చార్జింగ్ స్టేషన్‌కు రూ.20 లక్షలు వ్యయం అవుతుంది. ఇందులో కేంద్రం ద్వారా పీఎం ఈ డ్రైవ్ కింద రూ.13 లక్షలు స‌బ్సిడీగా అందుతుంది. మిగిలిన రూ.7 లక్షలను పీఏసీఎస్‌లు భరిస్తాయి. ప్ర‌స్తుతం కిలోవాట్ అవర్ చార్జింగ్ కోసం రూ.18లుగా ప్రతిపాదించారు. ప్ర‌యోగాత్మ‌కంగా చేస్తున్న ఇవి విజ‌య‌వంత‌మైతే క్రమంగా రాష్ట్రంలోని మిగిలిన వాటిలోనూ విస్త‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది.
ఇది కూడా చ‌ద‌వండి.. అందరి చూపు..ఈవీ వైపు

caste Names change | ఆ కులాల పేర్లు మారిపోయాయండి..

caste Names change | తెలంగాణ ప్ర‌భుత్వం బీసీ జాబితాలో ప‌లు మార్పులు చేప‌ట్టంది. సామాజికంగా అభ్యంత‌ర‌క‌ర‌మైన ప‌దాల‌తో కూడిన ప‌లు కులాల పేర్లు మార్చుతూ నిర్ణ‌యం తీసుకుంది. బీసీ క‌మిష‌న్ సిఫార‌సుల మేర‌కు స‌మాజ గౌర‌వాన్ని కాపాడేందుకు ఈ మార్పులు చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

  • దొమ్మర : ఈ కులం పేరును ప్ర‌స్తుతం గడవంశీయగా మార్చారు.
  • పిచ్చిగుంట్ల : బీసీ జాబితా నుంచి ఈ ప‌దాన్ని పూర్తిగా తొల‌గించేశారు. ఆ స్థానంలో వంశరాజ్‌గా చేర్చారు.
  • తమ్మాలి : శూద్ర కులం అనే అవమానకరమైన పదాన్ని పూర్తిగా తొలగించారు. ఈ వర్గాన్ని ఇప్పుడు అధికారికంగా తమ్మాలి (బ్రాహ్మణేతర)గా పేర్కొన్నారు .
  • బుడబుక్కల: శివక్షత్రియను అధికారిక పర్యాయపదంగా చేర్చారు .
  • చాకలి: అధికారిక పర్యాయపదంగాధోబీని జోడించారు .
  • మేరా: మేరును అధికారిక పర్యాయపదంగా చేర్చారు .
  • వీరముష్టి :వీరభద్రీయ అనే ప్రాధాన్యత పేరుతో తిరిగి ఆర్డర్ చేశారు.
  • వన్నార్: ఈ ప‌దాన్ని తొల‌గించారు. ధోబీ అనే ప‌ర్యాయ‌ప‌దం చేర్చారు. `
  • ఇది కూడా చ‌ద‌వండి.. తెలంగాణ‌లో ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ఫీజులు ఎంతో తెలుసా..

Free Training | ఏఐ, లైఫ్ స్కిల్స్ పై ఉచిత శిక్ష‌ణ

Free Training | నిరుద్యోగుల‌కు ఏఐ (Artificial intelligence), లైఫ్ స్కిల్స్ పై నాలుగు రోజుల ఉచిత శిక్షణ అందించేందుకు బీసీ స్ట‌డీ స‌ర్కిల్ సిద్ధ‌మైంది. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈనెల‌ 27 నుంచి 30 వరకు నిర్వహించనున్న‌ట్లు ఉమ్మ‌డి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల‌ లోపు క‌లిగి ఇంటర్/ డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన‌ వారు అర్హులని పేర్కొన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 ఉదయం 9:30 గంటల లోపు బీసీ స్టడీ సర్కిల్, కరీంనగర్ కార్యాలయంలో ఆఫ్ లైన్ లో(నేరుగా) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత స్టడీ సర్టిఫికెట్స్, కుల, ఆదాయ ధ్రువీకరణ ప‌త్రాలు, ఆధార్ కార్డుతో పాటు రెండు పాస్ పోర్ట్‌ సైజ్ ఫొటోల‌ను జ‌త చేయాల‌ని పేర్కొన్నారు. శిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 08782-268686 నంబ‌ర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

ఇది కూడా చ‌ద‌వండి.. అంద‌రి చూపు.. ఈవీ వైపు