Peace deal | ఆ యుద్ధం ఇక ముగిసినట్లేనా… అమెరికా శాంతించిందా.. ఇరాన్ మెట్టు దిగిందా అంటే తాజా పరిస్థితులు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్- అమెరికా (Iran- America) ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడినట్లుగా తెలుస్తోంది. దాదాపు వంద రోజులకు పైబడి కొనసాగిన దాడులకు ఇక ఫుల్‌స్టాప్ పడనుంది.
మూడు నెలల ఉత్కంఠకు తెర
దాదాపు మూడున్నర నెలల పాటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచానికి కంటి మీద కునుకు కరువైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం కారణంగా నిత్యం బాంబుల మోతలు మోగాయి. చమురు క్షేత్రాలు ధ్వంసమయ్యయి. వేలల్లో ప్రాణనష్టం వాటిల్లింది. కోలుకోలేని విధంగా ఆస్తి నష్టం సంభవించింది. ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరలకు రెక్కలొచ్చి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఒక్కసారిగా ప్రపంచం అతలాకుతలమైంది. ఎట్టకేలకు అగ్రరాజ్యం శాంతి చర్చలకు అంగీకరించింది. భారీ నష్టం నేపథ్యంలో ఇరాన్ కూడా పట్టువీడి ఓ మెట్టు దిగింది. ఫలితంగా యుద్దం చివరి అంకానికి చేరువైంది. త్వరలోనే ముగిసినట్లుగా అధికారిక ప్రకటన రానుంది. ఇదే జరిగితే హోర్ముజ్ జలసంధి ఆంక్షలు లేకుండా తెరుచుకోనుంది. మరికొద్ది రోజుల్లో ఇంధన సరఫరా ఇక్కట్లు తొలగిపోనున్నాయి. దీంతో ధరలు కూడా మళ్లీ దిగివచ్చే అవకాశం లేకపోలేదు.
శాంతి ఒప్పందం..
యుద్ధానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందాన్ని (Peace Deal) ఖరారు చేశాయి. తక్షణమే సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లుగా ఇరుదేశాలు ప్రకటించాయి. జూన్ 19న స్విట్జర్లాండ్ వేదికగా అధికారిక ఒప్పందంపై ఆయా దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఈ ఒప్పందానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఖతార్, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్ తో పాటు జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. మరో వైపు ఈ ఒప్పందంపై ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా అధికారిక ప్రకటన చేశారు. ‘ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.. హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి.. ‘ అని వెల్లడించారు. ‘ప్రపంచ నౌకలారా, మీ ఇంజన్లు స్టార్ట్ చేయండి…’ అని ఉత్సాహంగా ట్వీట్ కూడా చేశారు. మరోవైపు శాంతి చర్చల విషయాన్నిఆదివారం ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిబాబాడి కూడా ధృవీకరించారు. ఈ ఒప్పందంపై ఈ నెల 19న అధికారిక సంతకాలు ఉంటాయని శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.
చమురు ధరలు తగ్గే అవకాశం.. ?
శాంతి ఒప్పందం కుదిరి అంతా అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సులభతరం కానున్నాయి. ఆకాశన్నంటిన చమురు ధరలు మళ్లీ దిగివచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకోనున్నట్లుగా వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. : నవంబర్‌లో గ్రేటర్.. ? ఆ పార్టీల స్ట్రాటజీ డిఫరెంట్!


