Wednesday, June 17, 2026

 Rythu Bharosa | రైతు భ‌రోసా.. డేట్ ఫిక్స్‌

 Rythu Bharosa | రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది.  అన్న‌దాత‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏటా రెండు సార్లు సాగు పెట్టుబ‌డి సాయం  అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా  ఈ వానాకాలం సీజ‌న్‌కు సంబంధించి రైతు భ‌రోసా డేట్ ను తాజాగా  ఫిక్స్ చేసింది. ఈ నెల 26 నుంచి విడ‌త‌ల వారీగా విడుద‌ల చేయాల‌ని భావిస్తోంది.  సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన‌ వ్య‌వ‌సాయ శాఖ స‌మీక్షలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో కోటి 50 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఈ స్కీం వ‌ర్తింప‌జేయ‌నున్నారు. ఎక‌రానికి రూ. 6వేల చొప్పున దాదాపు రూ.9వేల కోట్లు అవ‌స‌రం కానున్న‌ట్లుగా వ్యవసాయ, ఆర్ధికశాఖ ప్ర‌తిపాదించింది. ఈమేర‌కు సీఎం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ దీనికి ఆమోద‌ముద్ర వేయ‌నుంది.
విడతల వారీగా జమ
కేబినెట్ ఆమోద ముద్ర‌ త‌ర్వాత నిధులు విడుద‌ల కానున్నాయి.  లబ్దిదారులకు విడతల వారీగా బదిలీ చేయనున్నారు. తొలుత ఈనెల 26న రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు తొలుత ఎకరంలోపు వారి ఖాతాల్లో జ‌మ చేస్తారు. తర్వాత మిగిలిన వారికి విడతల వారీగా అందించ‌నున్నారు.  గ‌తంలో వ‌చ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఈ విడ‌త‌లో తొమ్మిది రోజుల్లోనే నిధుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
ఈనెల 20న కిసాన్ స‌మ్మాన్ నిధి
ఈ వానాకాలం సీజ‌న్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల‌ 20న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 23వ విడత నిధులు విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అర్హులైన‌ రైతుల బ్యాంకు ఖాతాల్లో వీటిని  జ‌మ చేస్తారు. అయితే కేంద్రం కేవైసీ నిబంధ‌న త‌ప్ప‌నిస‌రి చేసింది.

Hot Topics

Related Articles