Greater elections | తొలకరితో వాతావరణం చల్లబడినా మహానగరంలో రాజకీయం మాత్రం వేడెక్కుతోంది. గ్రేటర్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఆయా పొలిటికల్ పార్టీల్లో సందడి మొదలైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ నెల 15 నుంచి చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (SIR) సెప్టెంబర్ చివరన ముగియనుంది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటించిన అనంతరం ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆయా పార్టీలు క్షేత్రస్థాయిపై దృష్టి సారించాయి.
రాజధానిలో డిఫరెంట్ పాలిటిక్స్..
మినీ ఇండియాగా పేరొందిన రాష్ట్ర రాజధానిలో పాలిటిక్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. భిన్న ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన ఓటర్లు ఇక్కడ ఉన్నారు. మైనార్టీలు, ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం కొంత చూపే అవకాశం ఉంటుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. ఆచితూచి అడుగులు వేస్తాయి. ఈ సారి కూడా పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ప్రధాన పార్టీలుగా ఉండగా.. ఈసారి కవిత సారథ్యంలోని టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) కూడా సై అంటుంది. రాష్ట్ర విభజన తర్వాత సైతం గత ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ మరోసారి పోటీకీ ఉవ్విల్లూరుతోంది. జనసేక కూడా ఈ సారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫోకస్ పెంచిన పార్టీలు..
- రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ఇటీవల నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. గ్రేటర్‌లోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మూడు కార్పోరేషన్ల పరిధిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ముమ్మరం చేశారు. కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
- గత రెండు ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ ఎస్ ఈ సారి అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. హ్త్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారానికి దూరమైన ఆ పార్టీ మెజార్టీ స్థానాలను మాత్రం గ్రేటర్ పరిధిలోనే కైవసం చేసుకోవడం గమనార్హం. ఇది తమకు కలిసివచ్చే అవకాశంగా ఆ పార్టీ అధి నాయకత్వం చెప్పుకుంటుంది. ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తూ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
- గ్రేటర్ అనగానే గుర్తొచ్చేది ఏఐఎంఐఎం. ఈ పార్టీకి నిలకడైన ఓటు బ్యాంకు ఉంది. గత రెండు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. దాదాపు 30శాతం స్థానాలను కైవసం చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ సారి మరింత మెరుగైన ఫలితాలు సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే అంతర్గత సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది.
- ఇక గత ఎన్నికల్లో 4 నుంచి 48 స్థానాలకు ఎగబాకిన బీజేపీ ఈసారి పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ రాష్ట్ర రాజధానిలోనూ పాగా వేసేందుకు అడుగులు వేస్తోంది. ఇటీవల నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటిన ఆ పార్టీ అనంతరం తెలంగాణపై ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా గతనెలలో హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో అంతర్గత విబేధాలు కొంత వారికి ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్లో టాక్. అధిష్టానం సత్వరం స్పందించి చర్యలు చేపడితే మాత్రం మెజార్టీ స్థానాలు దక్కే అవకాశం లేకపోలేదు.
- ఇటీవల కల్వకుంట్ల కవిత సారథ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ ( తెలంగాణ రక్షణ సేన) పార్టీ ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఆ పార్టీ చీఫ్ ఇటీవల గ్రేటర్ పరిధిలో వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. గ్రేటర్‌పరిధిలోని మాజీ ప్రతినిధుల చేరికపై ఫోకస్ పెంచారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ బల పరిచిన అభ్యర్థులు పలుచోట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గ్రేటర్‌లోనూ సత్తా చాటి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము కీలకం కానున్నామనే సంకేతం ఇవ్వాలని భావిస్తున్నారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బలంగా ఉండేది. గతంలో ఆ పార్టీ గ్రేటర్ పరిధిలో మంచి ఫలితాలనే సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పూర్తిగా ఏపీకే పరిమితమైనా రెండుసార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటింది. మూడో సారి మాత్రం పోటీకి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఏపీలో కూటిమి ప్రభుత్వంగా అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణలోనూ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తోంది. ఇటీవల నిర్వహించిన మహానాడులో ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడింట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రానున్న గ్రేటర్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లుగాన నారా లోకేశ్ సంకేతాలివ్వడం గమనార్హం.
- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల హైదరాబాద్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తెలంగాణలోనూ తాము పోటీచేస్తామని ప్రకటించారు. ఏపీలో టీడీపీ, బీజేపీతో కూటమిగా ఉన్న జనసేన ఇక్కడ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే ఎన్నికల వరకు ఒకవేళ పొత్తు పొడిస్తే మాత్రం సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
- ఇది కూడా చదవండి.. : సర్కారు బడి @ కార్పొరేట్ స్టడీ .. ఇందులో సీటు హాట్ కాదా మరి!


