Siddipet zphs | ” అమ్మ.. మేం గవర్నమెంట్ స్కూల్ టీచర్లం.. మీ పిల్లలను మన బడికి పంపించండి.. పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం, టై, బెల్ట్, షూ అన్నీ ఉచితమే. మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది. డిజిటల్ క్లాసెస్ తో పాటు ఈ ఏడాది నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నిర్వహిస్తున్నాం.. ” ప్రస్తుతం ఊరూరా బడిబాటలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగతూ చెబుతున్న మాటలివి. అయినా పేరెంట్స్ నుంచి స్పందన అంతంతే. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఈ సర్కారు బడిలో సీటు రావాలంటే ప్రవేశ పరీక్ష రాయాల్సిందే. ఏటా నో అడ్మిషన్ బోర్డు ఇక్కడ ప్రత్యేకత. కార్పొరేట్‌కు మించి వసతులు, సంచలన ఫలితాలతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది సిద్దిపేటలోని ఇందిరానగర్ జెడ్పీ హైస్కూల్ (Indira nagar zp high school).
ఎనిమిదేళ్ల క్రితం ఇది ఓ మామూలు ప్రభుత్వ పాఠశాల. 2018లో ఎస్ఎంసీ చైర్మన్‌గా డాక్టర్ పేర్ల కృష్ణదయాసాగర్, అప్పటి హెచ్ఎం రామస్వామి సమన్వయంతో బడి అభివృద్ధికి అడుగులు పడ్డాయి. గవర్నమెంట్ స్కూల్ అనే న్యూనతాభావం వీడాలని వారు పేరెంట్స్‌కు అవగాహన కల్పించారు. ప్రత్యేకత చాటాలని ఉపాధ్యాయులను కోరగా.. అందరూ సమ్మతించారు. కార్పొరేట్ ధీటుగా బోధనకు శ్రీకారం చుట్టారు. వసతుల కల్పనపై కూడా దృష్టి సారించారు. అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూవడంతో పాఠశాల రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు కోవిడ్ సమయంలోనూ ఇక్కడ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం గమనార్హం.
దాతల చొరవ..
దాతల చొరవతో డిజిటల్ తరగతి గదులు, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్, రొబొటిక్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్, 5 కిలోవాట్ సోలార్ సిస్టమ్, హైజనిక్ ఫుడ్ కోసం లేటెస్ట్ కిచెన్, ప్యూరీఫైడ్ వాటర్ సిస్టమ్ వంటి అధునాతన వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో నాట్కో ఫార్మా సంస్థ చేయూత కీలకమని పాఠశాల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఏటా ప్రవేశపరీక్ష
ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ఏటా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి గాను బుధవారం నిర్వహించారు. 6, 8 తరగతులకు సంబంధించి 220 సీట్లు ఉండగా 700 వరకు దరఖాస్తులు అందాయి. పరీక్షకు 650 మంది హాజరయ్యారు. ఇందులో సుదూర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం.
అత్యుత్తమ ఫలితాలు
ఎస్సెస్సీలో ఇక్కడి విద్యార్థులు ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. దాదాపు వందశాతం ఉత్తీర్ణతతో దూసుకుపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీకి సైతం ఎంపికవుతున్నారు. ఈ ఏడాది ఏకంగా 16మంది సెలక్ట్ కావడం గమనార్హం. అలాగే 15మంది ఎన్ఎంఎంఎస్‌కు సైతం ఎంపికయ్యారు. ఇలా సంచలన ఫలితాలతో ఈ బడి ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రశంసలందుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే సర్కారు లక్ష్యం నెరవేరడం ఖాయం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు సాగాలని ఆశిద్దామా మరి.
- అందరి సహకారంతోనే..
తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల అంకితభావంతో పాటు స్థానిక ఎమ్మెల్యే చొరవతో పాఠశాల అభివృద్ధి పథంలో సాగుతుంది. ప్రస్తుతం అన్ని తరగతుల్లో ఒక్కోదానిలో నాలుగు నుంచి ఐదు సెక్షన్లు ఉన్నాయి. మొత్తం 1,236 మంది విద్యార్థులు, 42 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది నుంచి ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు గాను విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే సన్నద్ధం చేయాలని భావిస్తున్నాం. ఇక్కడ సీటు కోసం ముఖ్యమంత్రి నుంచి సైతం సిఫారసులు వస్తుండడం మా పనితీరుకు నిదర్శనం.
– రాజప్రభాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు - సంప్రదిస్తే గైడ్ చేస్తాం..
ఈ పాఠశాలకు గతంలో ఎస్ఎంసీ చైర్మన్‌గా చేసిన క్రమంలో హెచ్ఎం రామస్వామి గారి ఆలోచనలతో కలిసి ఉపాధ్యాయులను కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాం. కార్పొరేట్ బోధనకు శ్రీకారం చుట్టి ఎమ్మెల్యే సహకారంతో వసతులను మెరుగుపరిచాం. క్రమంగా ఆదరణ పెరిగింది. నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే వరకు వెళ్లడం సంతోషదాయకం. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు రాజ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా అదే స్ఫూర్తి కొనసాగించడం అభినందనీయం. ఇతర పాఠశాలల నుంచి ఎవరైనా సలహాలు,సూచనలు అడిగితే గైడ్ చేసేందుకు సిద్ధం. - – డాక్టర్ పేర్ల కృష్ణదయాసాగర్ , (94902 43095), (బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, సిద్దిపేట్)
ఇది కూడా చదవండి … పిడుగుల కాలం.. జర జాగ్రత్త సుమా!


