Weather update | వేసవి ఎండలకు మండిపోయిన జనానికి చల్లని కబురు అందింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ఏటా జూన్ రాకముందే రుతుపవనాలు ప్రవేశించేవి. ఈ ఏడాది మే 26న నైరుతి (southwest) కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఎల్సినో ప్రభావంతో కొంత ఆలస్యమయ్యాయి. ఈనెల 4న కేరళను తాకాయి. ప్రస్తుతం అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే రెండు రోజులుగా కేరళలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లోకి ఆగమం మొదలైనా వారం రోజుల్లో విస్తరించనున్నాయి. ఈ ఏడాది ఎల్సినో కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సెప్టెంబరు వరకు కొంత పుంజుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
నైరుతి కీలకం..
దేశంలో నైరుతి రుతుపవనాలే కీలకం. ఏడాది పొడవునా కురిసే మొత్తం వర్షపాతంలో దాదాపు 80 శాతం వాటా వీటిదే ఉంటుంది. సాగునీటి వసతి లేని భూములకు ఈ వర్షాలే ఆధారం. అందుకే మెజార్టీ రైతాంగం వీటిపైనే ఆశలు పెట్టుకుంటారు. వర్షపాతం ఆధారంగా అనుకూలమైన పంటల సాగుకు మొగ్గు చూపుతారు.
రాష్ట్రంలో ఇలా..
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, నిర్మల్ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో అత్యధికంగా 5.08 సెం.మీ వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరికొన్నిప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురువనున్నట్లు వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద ఉండవద్దని సూచిస్తుంది. వీలైనంత త్వరగా పక్కా భవనంలోకి వెళ్లడం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి.. బొగ్గుబాయి బాటలో.. కవితమ్మ


