- సింగరేణిపై టీఆర్ఎస్ ఫోకస్
- పార్టీ బలోపేతమే లక్ష్యం
- ఈనెల15 నుంచి తొలివిడత
kavithamma | తెలంగాణ రక్షణ సేన (TRS) సింగరేణిపై ఫోకస్ పెంచింది. నూతనంగా ఆవిర్భవించిన ఆ పార్టీ ఆరు జిల్లాల పరిధిలో ఉన్న కోల్‌బెల్ట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కార్మిక క్షేత్రంపై పట్టు సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘బాయి బాట’ కార్యక్రమానికి సిద్ధమైంది. ఈనెల 15 నుంచి తొలివిడతకు సన్నద్ధమవుతోంది.
గనుల వద్ద ప్రత్యేక సమావేశాలు..
కార్మికులతో మమేకమై వారి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని యోచిస్తున్నారు ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. తొలివిడతలో భాగంగా మందమర్రి రీజియన్ నుంచి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఆమె ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. కార్మిక వర్గం నుంచి సానుకూల స్పందన వస్తే రానున్న అసెంబ్లీ, పార్లమెంట్లో ఆ పార్టీకి విజయావకాశాలు మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు.
మొదటి విడతలో..
తొలి విడతలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈనెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియా మంచి కార్యక్రమాన్ని కవిత షురూ చేస్తారు. ఆయా గనుల్లో పర్యటిస్తారు. అలాగే 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియా, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్జీ–1 ఏరియా,18న ఆర్జీ–2 ఏరియా, 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్జీ–3 ఏరియా, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ లను సందర్శించనున్నారు. కార్మికులను స్వయంగా కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. పరిష్కారం పై చొరవ చూపి పార్టీ పక్షాన అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
గతంలో జాగృతి ఆధ్వర్యంలో
గతంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగిన కవిత బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చాక జాగృతి ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ ఏర్పాటు తర్వాత మరోసారి సింగరేణిపై ఫోకస్ పెంచడం ఆసక్తికరంగా మారింది. కార్మిక వర్గంపై పట్టు ఉన్న ఆమె రానున్న ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచే పోటీ చేయాలని యోచిస్తున్నారా.. అందులో భాగంగానే పార్టీని బలోపేతం చేయడంతో పాటు అనువైన స్థానం కోసం అన్వేషిస్తున్నారా.. వంటి అనేక ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.
కోల్‌బెల్ట్ పరిధిలో ఆరు జిల్లాలు..
కోల్‌బెల్ట్ ప్రాంతం రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో విస్తరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు, ఓపెన్‌కాస్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 12 అసెంబ్లీ, 5 పార్లమెంట్ నియోజకవర్గ స్ధానాలు ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ స్థానాలు. అలాగే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబ్‌బాద్, ఖమ్మం వంటి ఐదు ఎంపీ స్థానాల్లో నల్లసూరీల ఓట్లే కీలకం. మరోవైపు ఉత్తర తెలంగాణ పరంగా పరిశీలిస్తే ఇవి మెజారిటీ స్థానాలుగా ఉండడం గమనార్హం.
ఇది కూడా చదవండి.. తెలంగాణ అస్తిత్వ గానం.. ఉద్యమ రణన్నినాదం




