MODI COMMENT | పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో కరోనా వంటి సంక్షోభం పొంచి ఉంది.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. దుబారాను అరికట్టాలి.. దేశ శ్రేయస్సు దృష్ట్యా త్యాగాలకు సిద్ధం కావాలి.. అంటూ హైదరాబాద్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి మోదీ(modi) దీని నుంచి బయటపడాలంటే దేశప్రజలంతా సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రధాని వ్యాఖ్యల వెనక ఆంతర్యం..
హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ కేవలం రాజకీయ అంశాలే కాదు.. దేశంలో పొంచి ఉన్న సంక్షోభ పరిస్థితులను ప్రస్తావించారు. అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు.
- అంతర్జాతీయంగా పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ప్రజా రవాణాపై దృష్టి సారించడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. మెట్రోలో ప్రయాణించాలని హితవు పలికారు.
- కరోనా సమయంలో చేపట్టిన వర్క్ ఫ్రం హోమ్‌పై కంపెనీలు మరోసారి ఫోకస్ చేయాలని, వర్చువల్ మీటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
- విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడం అత్యవసరమని.. ఇందులో భాగంగా ఏడాది పాటు విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని ఆడంబరాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- వంట నూనె వినియోగాన్నికూడా తగ్గించాలని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆరోగ్యానికి సైతం మంచిదని ఆయన పేర్కొన్నారు.
- బంగారం విషయంపై చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారంది. కనీసం ఏడాది పాటు గోల్డ్ కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించారు.
- దిగుమతులపై ఆధారపడకుండా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
రైతులు సోలార్ విద్యుత్ పై దృష్టి సారించాలని.. అలాగే రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ సాగుపై ఫోకస్ పెంచాలన్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రతీ సంక్షోభాన్ని ఓ సవాలుగా స్వీకరించాలన్నారు. కోవిడ్ సమయంలో చూపిన ఐక్యతను మరోసారి చాటాలని ప్రధాని దేశ ప్రజలను కోరారు.
మొదలైన చర్చ
అప్పుడే ప్రధాని వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. రానున్న సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు మోడీ సూచనలను ప్రజలు ఏ మేరకు పాటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. - ఇది కూడా చదవండి.. 46 నుంచి 34.. ! తగ్గిన వయోపరిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు




