Age limit | ” ఉద్యమంలో ముందుండి కొట్లాడినం.. రాష్ట్రం వస్తే మాకు జాబులొస్తయని సంబురపడ్డాం.. పదేళ్లు ఎదురుచూసినం.. మా కల నెరవేరకపోవడంతో ఉద్యమ పార్టీని ఓడించినం.. కాంగ్రెస్ సర్కారును తెచ్చుకున్నం.. రెండున్నరేళ్లవుతున్నా ఈ ప్రభుత్వానిదీ అదే తీరు.. పుష్కర కాలం దాటినా మా కల నెరవేరని పరిస్థితి.. నోటిఫికేషన్లు కరువైనయ్.. నియామకాలు మరుగున పడ్డయ్.. జాబ్ క్యాలెండర్ జాడ లేకుండా పోయింది. మరోవైపు వయోపరిమితి సడలింపు సైతం తొలగించారు.. ఇదేనా మాపై మీ చిత్తశుద్ధి ” అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయసును 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ అప్పటి బీఆర్ ఎస్ సర్కారు మార్చి 19, 2022న జీవో నం. 42 జారీ చేసింది.
- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వయో పరిమితిని మరో రెండేళ్లు అంటే 46ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జీవో నంబర్ 30ను ఫిబ్రవరి 8, 2024న జారీ చేసింది. ఇది రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరితో ఆ గడువు ముగిసింది. మరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయలేదు.
- టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్‌లో 34 ఏళ్లకు పరిమితం చేయడంపై నిరుద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
నిరుద్యోగుల డిమాండ్లు ఇలా..
- కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి. అలాగే 2లక్షల ఉద్యోగాల భర్తీపై చర్యలు తీసుకోవాలి.
- వయో పరిమితి పెంపును తిరిగి 46 ఏళ్లకు పెంచుతూ తక్షణమే జీవో జారీ చేయలి. ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు వర్తింపజేయాలి.
- టీజీపీఎస్సీ(Tgpsc)లో సంస్కరణలతో పాటు త్వరితగతిన నోటిఫికేషన్ల ప్రక్రియ చేపట్టాలి.
- సిలబస్ కమిటీ వేసి ఏడాది గడిచింది. ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వివరాలు వెల్లడించాలి.
- ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలవారీ భృతి అందించాలి.
- పోలీస్, మెగా డీఎస్సీ నియామకాల షెడ్యూల్ త్వరగా ప్రకటించాలి.
ప్రభుత్వానికి వినతులు
- వయోపరిమితి పెంపు అంశం పరిశీలించాలని కోరుతూ నిరుద్యోగులు, విద్యావేత్తలు ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. లేకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.
ఇది కూడా చదవండి .. జూన్ 2.. నిరుద్యోగులకు తీపి కబురు అందబోతుందా




