-
సర్కారుకు కట్టు ‘బడి’ నోళ్లకే సంక్షేమ పథకాలు..
-
ఆ ఊరు సంచలన నిర్ణయం
Grama sabha decision | పిల్లలను సర్కారు బడికి పంపినోళ్లకే సంక్షేమ పథకాలంటూ ఆ ఊరు సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రైవేట్‌కు పంపితే ఆ ఇంటికి రేషన్, పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు వంటివి ఉండవని స్పష్టం చేసింది.. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేందుకు ఆ గ్రామం చేసిన తీర్మానం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరినీ ఆలోచింపజేస్తూ హాట్‌టాపిక్ గా నిలిచిన ఆ విలేజే ..హన్మకొండ జిల్లాలోని ముప్పారం (mupparam).
ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ బడులకు పంపేందుకే పేరెంట్స్ మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి అనేక పథకాలు అమలవుతున్నా అటువైపు చూడరు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇరుగుపొరుగు ప్రభావం, సోషల్ స్టేటస్‌తో పాటు ఉపాధ్యాయులు సరిగా పట్టించుకోరనే భావన తల్లిదండ్రుల్లో నాటుకుపోయింది. ఈ క్రమంలో అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివిస్తున్న పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుండగా.. పేదలకు ఉచిత విద్య అందుబాటులో ఉన్నా అందుకోలేని దుస్థితి. ఈ క్రమంలోనే ముప్పారం ముందుకు వచ్చింది. సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ఆదర్శంగా నిలిచేందుకు సిద్ధమైంది.
ఆ ఊరు ఏం చేసిందంటే..
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన గ్రామసభలో పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. సర్కారు బడిని బలోపేతం చేయాలని భావించింది. ఇందులో తల్లిదండ్రుల పాత్ర కీలకమని గుర్తించింది. తదనుగుణంగా కార్యాచరణను ప్రకటించింది. ఈ నిర్ణయం కాస్త కఠినంగా ఉన్నా ఊరు బాగు కోసమేనని స్పష్టం చేసింది. అయితే ఈ చర్చకు కేంద్రబిందువుగా నిలిచింది సర్పంచ్ గుంటిపల్లి రేణుక వెంకట్ చేసిన వ్యాఖ్యనే. ‘ ప్రైవేట్ పాఠశాల ఫీజులు కట్టే స్తోమత ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు అవసరం? ‘ అనే ప్రశ్నను ఆమె గ్రామసభలో లేవనెత్తారు. ఈ క్రమంలోనే చర్చించిన అనంతరం సభ సంచలన తీర్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చకుండా ప్రైవేట్‌కు పంపించే కుటుంబాలకు అందుతున్న పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను నిలిపివేయాలని తీర్మానించి సంబంధిత అధికారులకు సిఫార్సు చేసింది. అంతేకాదు.. తమ ఊరిలోకి విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చే ప్రైవేట్ పాఠశాలల బస్సులు, ఆటోలను అనుమతించకూడదని కూడా నిర్ణయించింది.
అడ్మిషన్లు పెంచేందకు..
తీర్మానానికే పరిమితం కాకుండా ఆచరణలో అమలు చేయాలని గ్రామసభ సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రతి వార్డు సభ్యుడు కనీసం 10 మంది విద్యార్థులను బడిలో చేర్పించాలని నిర్ణయించింది. మరోవైపు పిల్లలందరినీ బడిబాట పట్టించడమే తమ లక్ష్యమని అంటున్నారు గ్రామపెద్దలు. అలాగే తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఉండాలని, పిల్లల పురోగతిపై ఎప్పటికప్పడు ఉపాధ్యాయులతో చర్చించినప్పుడే ప్రభుత్వ విద్య మరింత మెరుగుపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమాజ హితం కోసం తీసుకున్న నిర్ణయం కఠినమైనా సముచితమే అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి.. పిడుగుల కాలం.. జర జాగ్రత్త సుమా!


