kondagattu temple | చేతిలో జెండా.. తలపై పాగా.. ఒకరి వెనక ఒకరుగా దీక్షా పరులతో ఆ దారి కాషాయమయంగా మారింది. అడుగడుగునా అంజన్ననామస్మరణ మారుమోగింది. మండే ఎండలో వందల కిలోమీటర్ల ఆ పాదయాత్ర సోమవారం నుంచే కొండగట్టు(Kondagattu)కు చేరువైంది. జై హనుమాన్ అంటూ కాలినడకన చేరుకున్న స్వాములతో అంజన్న క్షేత్రం పులకించింది. మంగళవారం భక్తజన సంద్రంగా మారింది.
లక్షలాదిగా భక్తులు
ఈ ఏడాది పెద్ద హనుమాన్ జయంతి మంగళవారం కలిసి రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. మాలాధారణ స్వాములు ఒక రోజు ముందుగానే చేరుకున్నారు. దీక్ష విరమణ చేసి అర్ధరాత్రి నుంచే దర్శనానికి బారులు తీరారు. కల్యాణ కట్ట, కోనేరుప్రాంతం భక్తులతో కిక్కిరిసి పోయింది. కాలినడకన వచ్చిన వారు మళ్లీ గంటల తరబడి క్యూలో నిల్చొని ఇబ్బందులు పడ్డారు. వారికి నేరుగా దర్శనం కలిపించాలని భక్తులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.
ఐదు చోట్ల పార్కింగ్ స్థలాలు..
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ సారి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జేఎన్టీయూ మార్గంలోఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేశారు. అక్కడి నుంచి భక్తుల కోసం ఉచిత బస్సు సదుపాయం కల్పించారు.
కిక్కిరిసిన ప్రసాద కౌంటర్లు
విరామం లేకుండా ప్రసాద కౌంటర్లు భక్తులతో కిక్కిరిసి దర్శనమిచ్చాయి. పలువురు దాతలు మజ్జిగ పంపిణీ చేయగా.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం సైతం కొనసాగించారు.
ఇది కూడా చదవండి.. ముందుంది సంక్షోభం.. జాగ్రత్త అంటున్న ప్రధాని.. అసలు మోదీ ఏమన్నారు




