Professional thieves | కరీంనగర్‌లోని పీఎంజే (PMJ) జ్యూయలరీలో ఈ నెల 3న చోరీకి పాల్పడిన దొంగలు ఎట్టకేలకు దొరికారు. బీహార్, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఈ అంతర్రాష్ట్ర ముఠా వివరాలు వింటే వామ్మో అనాల్సిందే. వీరి నెట్‌వర్క్ అలా ఉంటుంది మరి. గ్యాంగ్‌లీడర్ సుబోద్‌సింగ్ నేతృత్వంలోనే ఈ భారీ చోరీ చోటు చేసుకుంది. ఐదుగురు దొంగల్లో ఇద్దరితో పాటు మరొకరిని అరెస్టు చేసినట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. కేసు వివరాలను గురువారం వెల్లడించారు. మొత్తం 161 తులాల బంగారు ఆభరణాలు. 112 క్యారెట్ల వజ్రాలు చోరీకి గురి కాగా నిందితుల నుంచి కొంత నగదు, ఆభరణాలతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
మొత్తం 13 మంది..
ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 13 మంది పాల్గొన్నారు. ఇందులో జాగీర్ సింగ్ (రఘునాథ్ కర్మాకర్), రావీశ్ కుమార్‌తో పాటు సిమ్‌కార్డులు విక్రయించిన మెహతాఫ్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు దొంగలతో పాటు పరోక్షంగా భాగస్వాములైన వారి ఆచూకీ లభించాల్సి ఉంది.
రెండు నెలల క్రితమే రాష్రానికి వచ్చి ప్లాన్
ఈ దొంగలు రెండు టీంలుగా రెండు నెలల క్రితమే తెలంగాణకు చేరుకున్నారు. ముగ్గురు బీహార్, ఇద్దరు ఆసాన్‌సోల్(బెంగాల్) నుంచి వచ్చి రెక్కీ నిర్వహించారు. పెద్దపల్లి, సిద్దిపేట, ధర్మపురి, మంచిర్యాల, ఖమ్మం, జగిత్యాల, కరీంనగర్‌లో నిర్వహించి చివరకు కరీంనగర్‌ను ఫైనల్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే 11 నిమిషాల్లో తమ పని కానిచ్చారు. దోచుకున్న నగలతో ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం రెండు ద్విచక్ర వాహనాల్లో అంతర్గత రహదారుల ద్వారా ధర్మపురి చేరుకున్నారు. అక్కడి నుంచి గోదావరి దాటారు. రెండు టీంలుగా విడిపోయి మహారాష్ట్ర నుంచి బెంగాల్‌కు పరారయ్యారు.
ముఠా సభ్యుల రిక్రూట్ ఇలా..
సుబోద్‌సింగ్ నేతృత్వంలోని ముఠా సభ్యులను ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకుంటారు. వీరికి ఆయా టీంలను సవన్వయ పరుచుకోవడంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అయితే టీం సభ్యుల వివరాలు అందరికీ తెలియవు. నియామకం అయిన వారికి ప్రతినెలా వేతనాలు, దొంగిలించే మొత్తంలో ఇన్సెంటివ్ ఇస్తారు.
ఓ యాప్ ద్వారా కోఆర్డినెట్
మహారాష్ట్ర- తెలంగాణ బార్డర్ నుంచి ఈ మొత్తం తతంగం నడిపించారు. సాధారణంగా ఉపయోగించే ఓ యాప్ ద్వారానే ముఠా సభ్యులు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకు సాగారు.
మూడు టీంలు
ఈ ముఠాలో మొత్తం మూడు టీంలు ఉంటాయి. ప్రధాన టీం రెక్కీతో పాటు పని కానిచ్చేస్తోంది. రిసీవర్ పార్టీ.. దొంగిలించిన బంగారంతో పాటు ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకుంటాయి. డిస్పోసల్ టీం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కరిగించి నేపాల్‌కు తరలించి అమ్మేయడం చేస్తుంది.
ఏడు రాష్ట్రాల్లో..
ఈ ముఠా ఇప్పటి వరకు బిహార్, పశ్చిమాబెంగాల్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ లో చోరీలకు పాల్పడింది. తెలంగాణలో ఈ గ్యాంగ్‌కు ఇదే మొదటిది. వీరి లక్ష్యం బ్యాంకులు, బంగారు దుకాణాలు. గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్‌కు బంగారు దొంగ (గోల్డెన్ తీఫ్)గా పేరుంది. ఇప్పటి వరకు 400 కిలోల బంగారం చోరీలకు పాల్పడడం గమనార్హం.
అంతా ’11’చుట్టే..
ఈ ఘటన ఆ రోజు ఉదయం 11 గంటలకు మొదలై 11 నిమిషాల పాటు సాగింది. 11 రోజుల తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి.. ‘బండి’ ఒంటరి పోరు.. ఆ లీడర్లలో సంతోషం!




