Bandi Episode | కుమారుడి కేసు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీలో ఆటంకాలు ఎదురవుతున్నాయా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్(Brs) తో పాటు కాంగ్రెస్ ఇప్పటికే విమర్శల దాడి పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు కార్యకర్తల నుంచి బండికి పూర్తి మద్దతు లభిస్తున్నా సొంత పార్టీ నేతలు మాత్రం దూరంగా ఉంటుండడం ఆసక్తికరంగా మారింది.
పొలిటికల్‌గా టార్గెట్ అయిన సంజయ్..
గత అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో జోష్ పెంచారు. పార్టీని అన్నీ తానై ముందుకు నడిపారు. ఒక దశలో బిజెపి(bjp) రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా అనే చర్చ సైతం సాగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బండిని రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించి జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. దీనిపై సంజయ్ అప్పట్లో నారాజ్ అయ్యారు. ఈ క్రమంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు కేబినెట్‌లో చోటు కల్పించింది. రానున్న రోజుల్లో మరోసారి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కనుందనే ప్రచార నేపథ్యంలో తాజాగా ఆయన కుమారుడు భగీరథ్ పై కేసు తెరపైకి వచ్చింది. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
విపక్షాల రచ్చ
“మైనర్”పై కేసు అంశం తెరపైకి రాగానే బీఆర్ఎస్ అటాక్ ప్రారంభించింది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పూర్తిగా రంగలోకి దిగి బండిని టార్గెట్ చేశారు. గులాబీ శ్రేణులు ఈ అంశాన్ని ప్రాధాన్యంగా భావించి సోషల్ మీడియాలో హోరెత్తించాయి. నైతిక బాధ్యత వహిస్తూ బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ వారి మధ్య చీకటి ఒప్పందమనే ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో సీఎం రంగంలోకి దిగి డీజీపీని ఆదేశించడంతో సిట్ ఏర్పాటైంది. ఒక్కసారిగా కాంగ్రెస్ కూడా విమర్శల దాడి పెంచింది. ఓవైపు విపక్షాలు విమర్శలు సంధిస్తున్న వేళ అండగా నిలవాల్సిన కమలం పార్టీ కీలక నేతలు మౌనం వహించడంతో సంజయ్ ఒంటరైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రధాని సభలో, కరీంనగర్ ఏక్తా యాత్రలో కార్యకర్తల నుంచి ఆయనకు మద్దతు లభించినా నేతల నుంచి స్పందన కరువవడం ఆసక్తి కలిగిస్తోంది.
ఆసక్తికరంగా వైరి వర్గం తీరు..
గతంలో బండిపై అధిష్టానం వద్ద ఫిర్యాదులతో పాటు లేఖాస్త్రాలు సంధించిన కమలం నేతలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వారు మౌనం వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం కూడా ఈ అంశంపై ఆచీతూచి వ్యవహరిస్తన్నట్లుగా సమాచారం. పార్టీ డ్యామేజ్ కాకుండా అవసరమైన చర్యలపై దృష్టి సారిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు తన కొడుకు భగీరథ్ అమాయకుడని, కావాలనే కొందరు కట్ర పన్నారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ తప్పు చేస్తే శిక్షకు అర్హుడే అంటూ ఆయన పేర్కొంటుండం గమనార్హం. మొత్తంగా బండి ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచినట్లయింది.
ఇది కూడా చదవండి.. నీట్ ఒక్కటేనా.. రద్దు జాబితాలో ఇంకా ఏమైనా ఉన్నాయా..




