- గ్రేటర్‌ను సెమీఫైనల్‌గా భావిస్తున్న పార్టీలు
- తెలంగాణలో ఆసక్తికరంగా రాజకీయాలు
- TG politics | రాష్ట్రంలో ఎలక్షన్ మూడ్ వచ్చేస్తోంది. రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాయి. కేడర్‌ను సమాయత్తం చేయడంపై ఫోకస్ పెంచాయి. అధికార కాంగ్రెస్ (congress) మరోసారి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈ సారి విజయం తమదే అంటూ ప్రతిపక్షాలూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
- సగం పీరియడ్ కంప్లీట్..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటింది. సగం పీరియడ్ గడిచింది. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆయా పార్టీలన్నీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికలెప్పుడొచ్చినా రెడీ అంటున్నాయి. త్వరలోనే ‘గ్రేటర్’ ఉండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వాటిని సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. అందులో సత్తా చాటేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఫలితాలే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్‌గా ఉంటాయని భావిస్తున్నాయి. - పై ‘చేయి’ సాధించేలా..
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ రానున్న గ్రేటర్ పోరులోనూ పైచేయి సాధించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఇన్‌చార్జీల నియామకంపై దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలో ‘హస్తం’ పార్టీకి ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేకపోవడం కొంత మైనస్. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా గెలిచి గ్రేటర్‌లో పాగా వేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు శ్రేణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూసీ సుందరీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌లో సత్తా చాటి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ మూడు రంగుల జెండాను రెపరెపలాడిస్తామన్న ధీమాను హైకమాండ్‌లో కలిగించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దాదాపు అన్ని సభల్లో సీఎం 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. - స్పీడ్ పెంచిన ‘కారు’
గత ఎన్నికల్లో ఓట్లు సాధించినా.. స్వల్ప తేడా సీట్లతో ఓటమిపాలై హాట్రిక్ విజయాన్ని చేజార్చుకున్న బీఆర్‌ఎస్(BRS) ఈ సారి ఎలాగైనా గెలుపొందాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావు క్షేత్రస్థాయిలోనే ఎక్కువగా ఉంటున్నారు. ప్రజాసమస్యలపై ఫోకస్ పెడుతూ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయం, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల అమలు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారని, అలాగే వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర ఉంటుందని ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇక తెలంగాణ ఆవిర్భావం నుంచి గ్రేటర్‌లో రెండు సార్లు సత్తా చాటిన గులాబీ పార్టీ ఈ సారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. ప్రస్తుతం ఈ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువగా ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కావడం కారు పార్టీకి కలిసివచ్చే అంశం. - ‘కమలం ‘ వికాసమే లక్ష్యంగా..
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ(BJP) తెలంగాణపై ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్‌లో సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటించారు. శ్రేణుల్లో జోష్ నింపారు. గ్రేటర్‌లో సత్తా చాటాలని సూచించారు. అంతేకాదు పార్టీలో గ్రూపు తగాదాలపై దృష్టి సారించిన హైకమాండ్ నేతల మధ్య సమన్వయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఎన్నికల వరకు ప్రతి మూడు నెలలకో జాతీయ నేతలు ఒకరు రాష్ట్రంలో పర్యటిస్తారని కమలం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. - ‘పతంగి’ మరింత ఎగిరేలా..
గ్రేటర్‌లో కీలకంగా ఉన్న AIMIM పార్టీకి ఎమ్మెల్యేలతో పాటు సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దాదాపు 30శాతం సీట్లను కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈసారి కూడా అదే ఫలితాలు సాధించేలా ముందుకు సాగుతుంది. ఈ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలంతా గ్రేటర్ పరిధిలోని వారు కావడం పతంగి పార్టీకి కలిసివచ్చే అవకాశం. మరోవైపు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఈ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు శ్రేణులను ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం. - కవితకు.. టీఆర్‌ఎస్ కలిసొచ్చేనా..
బీఆర్‌ఎస్ నుంచి విభేదించిన ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన(TRS) పేరిట రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పర్యటించారు. తాజాగా బొగ్గుబాయి బాట పేరిట సింగరేణిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణలో ఎక్కువ నియోజకవర్గాల్లో విస్తరించిన కోల్‌బెల్ట్ ప్రాంతంపై పట్టు సాధించేలా ఆమె వ్యూహం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కవిత ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి పలుచోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకున్న విషయం తెలిసిందే. రానున్న గ్రేటర్‌లోనూ సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలు కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వరకు మరికొందరు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీలో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా పార్టీ పేరు విషయంలో ఈసీ నుంచి లేఖ అందడం.. అనంతరం పార్టీ తరఫున కోర్టుకు వెళ్లడం.. వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ అదే పేరు ఉంటే కొంత కలిసొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. - పోటీకి సై అంటున్న జనసేన..
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనూ తమ పార్టీ విస్తరిస్తుందని, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పొత్తుల విషయంలో మాత్రం తేల్చలేదు. ఈ క్రమంలో గ్రేటర్ నుంచే బరిలోకి దిగుతారా.. అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూస్తారో చూడాల్సిందే. - మళ్లీ ‘సైకిల్’ బెల్ వినిపించేనా..?
తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఈ ప్రాంతంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ పూర్తిగా బలహీన పడింది. అయితే ఈ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉండడం, గ్రేటర్ పరిధిలో సీమాంధ్ర ఓటర్లు ఉండడంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇందుకు గతంలో వచ్చిన ఫలితాలే నిదర్శనం. తాజాగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేశ్ దేశంలో మరికొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ త్వరలో పార్టీని విస్తరింపజేస్తామని చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మళ్లీ టీడీపీ ఇక్కడికి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి కూటమీగా పోటీ చేస్తుందా.. లేదా ఒంటరిగా వెళ్తుందా వేచి చూడాలి.
ఇది కూడా చదవండి.. మహువా కు.. వాహ్‌వా అనాల్సిందే


