Friday, July 3, 2026

Ippa laddu | మ‌హువా కు.. వాహ్‌వా అనాల్సిందే

ఇప్ప‌ల‌డ్డు.. ఆరోగ్యం మెండు

Ippa laddu | ఇప్ప‌ల‌డ్డు.. .నోరూరించ‌డంతో పాటు ర‌క్త హీన‌త‌కు చెక్ పెట్టే దివ్యఔష‌ధం. ప్ర‌కృతి సిద్ధంగా ల‌భించే ముడిప‌దార్థాల‌తో ఆదివాసీల చేతిలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాచీన వంట‌కం మ‌హువాకు.. జ‌నం వాహ్‌వా అంటున్నారు. కేవ‌లం రక్త‌హీన‌త‌ను అరిక‌ట్ట‌డమే కాకుండా ఎముక‌ల స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తూ రోగ‌నిరోధ‌క‌ శ‌క్తిని పెంపొందించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంద‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అంగ‌న్‌వాడీ, ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల్లో వీటిని విద్యార్థినులు, గ‌ర్భిణుల‌కు అంద‌జేస్తున్నారు. ఇది విజ‌య‌వంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమ‌లుకు ప్ర‌భుత్వం యోచిస్తోంది. మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి మోదీ మ‌న్‌కీ బాత్‌లో ఈ ఇప్ప‌లడ్డును ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌డంతో పాటు త‌యారీదారుల‌ను అభినందించిన విష‌యం తెలిసిందే.
ఆదివాసీ ఆహారంగా అందుబాటులో..
ఈ లడ్డు ఆదివాసీ ఆహారంగా ఉట్నూర్‌లో అందుబాటులో ఉంది. ఐటీడీఏ స‌హ‌కారంతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ద్వారా విక్ర‌యిస్తున్నారు. వీటిని తినడం వల్ల ర‌క్తంలో హీమోగ్లోబిన్ శాతం పెంపు, మోకాళ్ల‌నొప్పులు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతున్న‌ట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క‌ సంస్థ‌లు సైతం ప‌రిశీలించాయి. ఐసీఎంఆర్ ఆధారంగా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియ‌న్ (NIN) ప‌రిశీలించింది. ఇందులో ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, విట‌మిన్‌సీ, కెరోటిన్‌ వంటివి అధికంగా ఉన్న‌ట్లుగా గుర్తించింది.
వీటిలో ఏమేం ఉంటాయంటే..
వీటి తయారీలో ఇప్ప పువ్వుతో పాటు కాజు, బాదం, కిస్మిస్‌, నువ్వులు, బెల్లం, ప‌ల్లీలు కలిపి తయారు చేస్తారు. ఐటీడీఏ కేంద్రంతో పాటు ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లోనూ ప్ర‌స్తుతం విక్ర‌యిస్తున్నారు.
ఎన్ ఐ ఎన్ సూచ‌న‌లు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనుల్లో రక్తహీనత ఏళ్లుగా వేధిస్తోంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, బాలిక‌ల్లో ఏడుశాతం లోపు ఉండ‌డంతో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.ఈ క్ర‌మంలో వారికి ఇప్ప లడ్డూలు ఇవ్వాలని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సూచించింది. ఈక్ర‌మంలో అప్ప‌టి క‌లెక్ట‌ర్ దివ్య‌దేవ‌రాజ‌న్ ప్ర‌త్యేక చొర‌వ చూపారు. ఐటీడీఏ స‌హ‌కారంతో రూ.25 లక్షలతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘంతో ఉట్నూర్‌లో ఓ ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. లడ్డూతోపాటు ఇప్పతో కూడిన‌ వివిధ ఆహార పదార్థాల తయారీలో ప్ర‌త్యేక శిక్షణ ఇప్పించారు. ఆదివాసీ ఆహారం పేరిట విక్ర‌యిస్తున్నారు.
ప్రయోగాత్మకంగా
ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో మూడువేల మందికి మొదటి విడతగా ఇప్ప లడ్డూలు పంపిణీ చేశారు. హిమోగ్లోబిన్‌ 7 నుంచి 8 శాతం ఉన్న వారికి రోజుకొకటి చొప్పున 45 రోజులు పంపిణీ చేశారు. అనంత‌రం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో స‌గ‌టున హెచ్‌బీ మ‌రో 1.5శాతం పెరిగిన‌ట్లు నిర్ధారణ అయ్యింది. వైద్యులు, ఉన్న‌తాధికారుల సూచ‌న‌తో జ‌నం నుంచి కూడా ఆద‌ర‌ణ క్ర‌మంలో పెరుగుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి.. పిడుగుల కాలం.. జ‌ర జాగ్ర‌త్త సుమా!

 

Hot Topics

Related Articles