Greater news | ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటి ఊపుమీదున్న రేవంత్ సర్కారు గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. సర్ (SIR) ప్రక్రియ పూర్తయిన వెంటనే నవంబర్‌లో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే ఈ సారి గ్రేటర్ పరిధి మూడు కార్పొరేషన్లుగా మారింది. జీహెచ్ఎంసీతో పాటు అదనంగా సైబరాబాద్, మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్లు చేరాయి. డివిజన్ల సంఖ్య కూడా 150 నుంచి 300కు పెరిగాయి. ఎన్నికలకు మరో నాలుగు నెలలే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. గతంలో రెండు సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా పీఠం దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక గులాబీ పార్టీ హ్యాట్రిక్ పై దృష్టి సారించింది. పతంగి పార్టీ గతంతో పోల్చితే సారి మరిన్ని సీట్లు పెంచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక గత ఎన్నికల్లో దూసుకొచ్చిన కమలం పార్టీ ఈ సారి గ్రేటర్‌లో ఎలాగైనా పాగా వేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇటీవల నూతన పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్ (తెలంగాణ రక్షణ సేన) కూడా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకుంటోంది. మరోవైపు టీడీపీ మళ్లీ తెలంగాణలో పునర్‌వైభవం కోసం పావులు కదుపుతోంది. అలాగే జనసేన సైతం ఇక్కడ పోటీకి సై అంటోంది.
2016, 2020 గ్రేటర్ ఫలితాలు ఇలా..
- 2016 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ దుందుబి మోగించింది. ఏకంగా 99 సీట్లతో అధ్యక్ష పీఠం కైవసం చేసుకుంది. సున్నా నుంచి సెంచరీ మార్కుకు చేరువైంది. ఈ ఎన్నికల్లో ఏఐఎంఐఎం 44 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే బీజేపీ నాలుగు సీట్లకు పరిమితం కాగా.. గతంలో 52 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు పడిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైన టీడీపీ ఒక స్థానంతో ఉనికి చాటుకుంది.
- ఇక 2020 ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో రెండో సారి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో కొనసాగినా గతంతో పోల్చితే స్థానాలు తగ్గాయి. అయితే 55 స్థానాలతో టాప్‌లో నిలవడం గమనార్హం. మరోవైపు పతంగి పార్టీకి ఈ సారి కూడా 44 స్థానాలే దక్కాయి. బీజేపీ మాత్రం పూర్తిగా బలపడింది. 4 నుంచి 48 స్థానాలకు ఎగబాకింది. రాజధానిలోనూ కమలం పార్టీ బలోపేతమైనట్లుగా సంకేతాలిచ్చింది. ఈ సారి కూడా కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితం కావడం గమనార్హం. సైకిల్ పార్టీ ఈ సారి కోటా తెరవలేదు.
మారిన గ్రేటర్ స్వరూపం ..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపం ఇటీవల మారిపోయింది. జీహెచ్ఎంసీని ప్రభుత్వం మూడు కార్పోరేషన్లుగా పునర్ వ్యవస్థీకరింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్‌ఎంసీ గత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026 వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.
పెరిగిన డివిజన్లు..
గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా.. డీలిమిటేషన్ తర్వాత 243కు చేరాయి. విలీన మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో మరో 57 నూతనంగా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 300 కు చేరింది.
జోన్లు ఇలా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఆరు జోన్లు (శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్)గా, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించారు. సైబరాబాద్ కార్పొరేషన్‌లో మూడు జోన్‌లు(శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), 76 డివిజన్లుగాఉన్నాయి. మల్కాజిగిరిని పరిశీలిస్తే ఈ కార్పొరేషన్ పరిధిలో ఎల్‌బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి మూడు జోన్లుగా ఉండగా డివిజన్లు 74 ఉన్నాయి.
ఇది కూడా చదవండి.. : నవంబర్‌లో గ్రేటర్.. ? ఆ పార్టీల స్ట్రాటజీ డిఫరెంట్!


