New Updates | కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి పలు విభాగాల్లో కీలక మార్పులను అమలులోకి తీసుకురానున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, ఇంధన రంగాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా మరి.
పాన్ కార్డు విషయంలో..
ఇక నుంచి ఒక రోజులో రూ.50వేల కంటే ఎక్కువ నగదు జమ చేయడానికి పాన్ కార్డు అవసరం లేదు. ఒకవేళ ఆర్థిక సంవత్సరంలో మీ అన్ని బ్యాంకు ఖాతాల నుంచి చేపట్టే నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలకు సంబంధించి రూ.10 లక్షలు దాటితే మాత్రమే కార్డు అందించాల్సి ఉంటుంది. అలాగే ఆస్తి క్రయ విక్రయాల కోసం పాన్ పరిమితి గతంలో రూ.10 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం రూ.20 లక్షలకు పెంచారు. అలాగే ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం ఈ (2026-27) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి అడ్వాన్స్ టాక్స్ వాయిదా చెల్లింపునకు జూన్ 15 తుది గడువు. ఈ పరిధిలోకి వచ్చే వారు సకాలంలో చెల్లించకపోతే ప్రతి నెల ఒక శాతం చొప్పున వడ్డీ పెనాల్టీ పడనుంది.
యూపీఐ మోసాలకు ఇక చెక్
డిజిటల్ మోసాలు అరికట్టే చర్యల్లో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వినియోగదారులకు రిలీఫ్ ఇచ్చేలా అప్‌డేట్ తీసుకువచ్చింది. మనం డబ్బులు ఎవరికైనా పంపాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తాం. ఈ సమయంలో గ్రహీత (ఆ వ్యక్తి) బ్యాంకులో నమోదు చేసుకున్న పేరు మాత్రమే ఇకపై స్క్రీన్‌పై కనిపిస్తుంది. గతంలో మారుపేర్లతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడేవారు. అలాంటి వాటికి ఇది చెక్ పెడుతుంది. అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూపీఐ ద్వారా నేరుగా ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణలను అవకాశం కల్పిస్తుంది. అయితే సదరు మెంబర్‌ను అనుమతించేందుకు గాను పలు పరీక్షలు చేస్తోంది. తద్వారా మోసాలకు తావు లేకుండా ప్రక్రియ సులభతరం కానుంది.
ఏటీఎం చార్జీలు పెరిగే అవకాశం..
ఓ వైపు ఆన్‌లైన్, డిజిటల్ పేమెంట్లు సులువుగా మారుతున్నతరుణంలో సంప్రదాయ బ్యాంకింగ్ కాస్త ఖరీదు కానుంది. పలు వాణిజ్య బ్యాంకులు ఏటీఎం చార్జీలను సవరిస్తున్నాయి. దీనివల్ల లిమిట్ దాటి నగదు విత్‌డ్రా చేసినా, మినీ స్టేట్‌మెంట్ , బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటివి సేవలు ఎక్కువ సార్లు వినియోగించినా కొంత మేర చార్జీలు పెరగనున్నాయి.
పెరిగిన గ్యాస్ ధరలు
ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ , సీఎన్‌జీ ధరలను సమీక్షిస్తున్నాయి. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ. వెయ్యి వరకు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా జూన్ 1 నుంచి మరో రూ.42 లు పెంచడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఇక బ్యాంకుల వంతు.. ఏఐ దెబ్బకు ఊడిపోనున్న ఉద్యోగాలు!




