Electric vehicles | రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ఈవీ (Electric vehicles) పై పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో విక్రయాలు ఊపందుకుంటున్నాయి. దేశంలో, రాష్ట్రంలో వెల్లడైన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం.
మండుతున్నపెట్రో ధరలు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. పది రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం. ఆయిల్ కంపెనీలు లీటరుపై ఏకంగా రూ.8లకు పైగా బాదాయి. ఈ పెంపు మున్ముందు కూడా కొనసాగనున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనం ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తున్నారు. ఈవీ వెహికిల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు.
అన్ని రకాల వేరియంట్స్ అందుబాటులోకి..
ఇటీవల ఆయా కంపెనీలు అన్ని రకాల వేరియంట్లలో విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో వినియోగదారులు సైతం మక్కువ చూపుతున్నారు. గతంతో పోల్చితే వీటి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం రాష్టవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఈ-వాహనాలు ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 1.30లక్షలకు పైగా బైక్‌లు ఉండగా.. మరో13 వేల వరకు కార్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వాల ప్రోత్సాహకాలు ఇలా..
ధ్వని, వాయు కాలుష్యం తగ్గించాలనే లక్ష్యంతో హరిత రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వాలు సైతం ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తున్నాయి. కేంద్రం ఇప్పటికే పీఎం ఈ డ్రైవ్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2024లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాంను జూలై చివరి వరకు పొడిగించారు. 2.47 మిలియన్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రోత్సాహకాల ద్వారా మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈ ఏడాది మే 24 నాటికి దాదాపు 2.35 మిలియన్ల వాహనాలకు సబ్సిడీలు అందించాయి. బ్యాటరీ సామర్థ్యం మేరకు మొదటి ఏడాది కిలోవాట్‌కు రూ.5,000 వరకు తగ్గంచగా.. రెండో ఏడాదిలో దానిని రూ.2,500 కు తగ్గించి అందిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు అంబాసిడర్లుగా ఉండేలా వారికి 20 శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది.
పెరిగిన అమ్మకాలు
2026 నాటికి దేశంలో ఈవీ మార్కెట్ వాటా మొత్తం వాహనాల అమ్మకాల్లో సుమారు 5.8 శాతానికి చేరువైంది. అందుబాటులో వచ్చిన మోడల్స్, రాయితీల నేపథ్యంలో అమ్మకాల్లో దాదాపు 75 శాతం వరకు వార్షిక వృద్ధి కనిపిస్తోంది. ఈవీ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ అత్యధికంగా 60-70శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాటా నెక్సాన్, పంచ్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్ దూకుడు పెంచింది. దాదాపు 28శాతం మార్కెట్ వాటా సొంతం చేసుకుని టాప్‌లో నిలిచింది. రవాణా శాఖ గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈవీ కొనుగోళ్లు 35శాతం పైబడి వృద్ధి సాధించడం గమనార్హం.
ఇది కూడా చదవండి.. తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులు ఎంతో తెలుసా..




