Saturday, March 28, 2026
spot_img

కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!

ఆ తండ్రికి గారాల పట్టి.. బిడ్డకు కూడా డాడీ అంటే అంతే ప్రాణం. ఏమయిందో ఏమో.. వారి మధ్య ఎడబాటు పెరిగింది. అగాధంగా మారింది. దగ్గరే ఉన్నా కదలని పెదవులు. తప్పని మౌనం. ఆ కనురెప్పల మాటున దాగిన కన్నీటి సంద్రం వారికి మాత్రమే తెలుసు. ఆ పెద్దాయన బీఆర్ఎస్ అధినేత కాగా ఆమె కల్వకుంట్ల కవిత.

  • అసలు ఏమైంది?
    ఉద్యమ నేత కేసీఆర్ కు కవిత అంటే పంచ ప్రాణాలు. స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం విధితమే. ఆమె కూడా అంతే. పెళ్లయినా ఇంటిపేరు మార్చుకోకుండా తన తండ్రి పై ఉన్న మమకారాన్ని ‘కల్వకుంట్ల’గా సుస్థిరపరుచుకున్నారు. నాన్న ఆశీర్వాదంతో బతుకమ్మతో మొదలైన ఆమె ప్రస్థానం తొలి ప్రయత్నంలోనే పార్లమెంటులోకి అడుగులు పడ్డాయి. తన వాగ్దాటితో తెలంగాణ గోడు వినిపించడమే కాదు.. నిధులు రాబట్టడంలోనూ సక్సెస్ అయ్యారు. తండ్రికి తగ్గ తనయురాలుగా అందరి మన్ననలూ అందుకున్నారు. అయితే మలి ప్రయత్నం.. ‘కలిసి’ రాలే. ఒంటరిగా మారిన ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఉద్యమ నేత.
  • రాజకీయ కక్షలకు బలి?
    సీన్ కట్ చేస్తే.. దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలనే భావనతో 2022 డిసెంబర్ 22న బీఆర్ఎస్ గా మారిన గులాబీ పార్టీకి అప్పటి నుంచే రాజకీయ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే కేంద్ర సర్కారు పావులు కదిపిందనే విమర్శలున్నాయి. రాజకీయ కక్షలో భాగంగానే తన బిడ్డపై లిక్కర్ కేసు తెరపైకి తెచ్చారని స్వయంగా కేసీఆరే ప్రకటించిన విషయం తెలిసిందే. తన బిడ్డ కడిగిన ముత్యం వలే త్వరలోనే వస్తుందని చెప్పిన ఆయన మాట ఇటీవలే అక్షరసత్యం అయింది కూడా.
  • మూడోసారి చేజారిన అధికారం
    దాదాపు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆ పార్టీకి సాధారణంగా కొంత వ్యతిరేకత ఉండడం మామూలే. అయితే అభ్యర్థులను ఎక్కువగా మార్చకుండా బరిలో నిలవడం, ప్రత్యర్థుల హామీలను పట్టించుకోకపోవడం తదితర కారణాలతో మూడోసారి గులాబీ పార్టీకి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 2023లో అధికారం కోల్పోయాక అందరిలో ఒక్కసారిగా నిస్తేజం. వెంటనే వచ్చిన పార్లమెంట్ లోనూ ఊహించని ఫలితాలు వారిని మరింత నిరాశకు గురి చేశాయి. ఈ క్రమంలోనే కవిత రాసిన లేఖ లీకై రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ‘తన తండ్రి దేవుడని.. చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ’ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఇలా మొదలైన గ్యాప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. చివరకు క్రమశిక్షణ పేరిట తండ్రి ఆజ్ఞగా.. సస్పెన్షన్ వేటుకు దారి తీసింది. అయితే కవిత కూడా అంతే దీటుగా స్పందిస్తూ రాజీనామాస్త్రాన్ని సంధించారు. రాజకీయ శక్తిగా తిరిగి వస్తానంటూ సాక్షాత్తు పెద్దల సభలో ప్రతిన భూని జనం బాట పట్టారు. ప్రజల గొంతుక గా మారి బాధితుల పక్షాన పిడికిలెత్తుతున్నారు.
  • కొత్త పార్టీ వైపు అడుగులు
    సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త పార్టీ వైపు తన అడుగులు ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేసిన కవిత తాజాగా నిజామాబాద్ వేదికగా ఆ ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 25పైనే ఉంది.
  • ఎదుగుతున్నట్లా…ఎదురుతిరిగినట్లా?
    కన్నబిడ్డ ఓ పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిందని సంతోషపడాలా.. తండ్రి ఆజ్ఞను దిక్కరించిందని బాధపడాలో తెలియని విచిత్ర పరిస్థితి ఆ మాతృమూర్తిది. గుండెల్లో దాగిన ప్రేమను చూపలేక ఆ తండ్రి మౌనంగా రోదిస్తున్నారా.. తనను బహిష్కరించిన కన్న ప్రేమను నిత్యం గుర్తుకు చేసుకుంటూ ఆ బిడ్డ క్షణక్షణం కన్నీటి పర్యంతమవుతుందా.. అనేది ఆ ముగ్గురికే తెలుసు. కాలం కరుణిస్తే మళ్లీ అందరూ ఒక్క చోటుకు చేరుతారా.. లేదా ఎప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగానే ఉండిపోతారా వేచి చూడాల్సిందే.
spot_imgspot_img

Hot Topics

Related Articles