రాష్ట్రంలో బీజీపీకి మంచి రోజులు వస్తున్నాయా అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో పుంజుకుంటున్నట్లుగా ఇటీవల జరిగిన పుర పోరులో స్పష్టమైనది. గతంతో పోల్చితే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు నారాయణపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆదిలాబాద్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న విషయం విధితమే. బైంసా బల్దియనూ ఎంఐఎంకు దక్కకుండా స్వతంత్రులకు మద్దతుగా నిలిచి ఆదిపత్యం ప్రదర్శించింది. మరికొన్ని చోట్ల వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానంగా పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర తెలంగాణలో కొంతమేర పట్టు సాధించినట్లు తెలుస్తుంది.
అందరి చూపు ‘బండి’ పైనే
2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఎన్నికయ్యారు. అయితే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని లక్ష్యంతో అధిష్టానం ఆయన కు 2020 మార్చి 11న రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను తన మాటల తూటాలతో ఎక్కుపెట్టి పార్టీని అన్నీ తానై ముందుకు నడిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టి కార్యకర్తల్లో జోష్ పెంచారు. ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ మారిపోయాయి. తదుపరి ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటడం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు సైతం పేర్కొన్నారు. ఏమైందో ఏమో కానీ సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు అధిష్టానం సంజయ్ ను తప్పించింది. 2023 జులై 4 వరకు అంటే దాదాపు మూడున్నర ఏళ్ల పాటు కొనసాగారు. తదనంతరం కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ జోష్ ను మాత్రం కొనసాగించలేక పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బండికి జులై 29న పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మళ్లీ ఘన విజయం సాధించారు. జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీ తానై..
ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బండి పూర్తిస్థాయిలో ఫోకస్ పెంచారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని బల్దియాపై కాషాయ జెండా రెపరెపలాడించారు. ఒక్కసారిగా కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఈ క్రమంలోనే అంజన్న ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇటీవల గెలిచిన వారితో పాటు శ్రేణులతో కలిసి శనివారం పాదయాత్ర బాట పట్టారు.
మహాశక్తిని దర్శించుకుని అంజన్న బాట పట్టి
కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుంచి బయలుదేరి సాయంత్రానికి అంజన్న సన్నిధికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామిని దర్శించుకున్నారు. పార్టీ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర కాషాయ శ్రేణుల్లో జోష్ పెంచింది. సంజయ్ అన్నకు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించే యోచన అధిష్టానం చేస్తున్నట్లుగా అక్కడక్కడ వినిపించింది. అదే నిజమైతే ఆ పార్టీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం లేకపోలేదు. అయితే ఆ పార్టీ పెద్దల మదిలో ఏముందో మరికొంత కాలం వేచి చూడాల్సిందే.



