TIMS | హైదరాబాద్ సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) త్వరలో అధికారిక ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టుల భర్తీ పై దృష్టి సారించింది. ఈ బాధ్యతను నిమ్స్ కు అప్పగించింది. టిమ్స్‌లో వివిధ విభాగాల్లో మొత్తం 184 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నిమ్స్ మంగళవారం మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వైద్య విభాగం, సాంకేతిక అనుబంధ ఆరోగ్యం, పరిపాలన , సహాయక సర్వీసుల్లో ఉన్న ఈ ఖాళీలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూలై 6 వరకు అవకాశం కల్పించింది.
- పోస్టుల వివరాలు ఇలా…
వైద్య విభాగం : 31
ఇందులో ఐదు ప్రొఫెసర్ పోస్టులు, రెండు అసోసియేట్ ప్రొఫెసర్, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన వారిని యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సీటీవీఎస్ తదితర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నియమిస్తారు.
సాంకేతిక , అనుబంధ ఆరోగ్యం : 122
టెక్నీషియన్ పోస్టుల్లో ప్రధానంగా బ్లడ్ బ్యాక్, ఎంఆర్ఐ, సీటీ, ఎక్స్‌రే, క్యాత్ ల్యాబ్, ల్యాబ్, అనస్థీషియా, సీఎస్‌ఎస్‌డీ, ఈసీజీ, బయోమెడికల్ విభాగాల్లో ఉన్నాయి. ఇక అనుబంధ ఆరోగ్య విభాగాలను పరిశీలిస్తే మెడికల్ రికార్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, స్టాటిస్టిషియన్, రిజిస్ట్రార్, అకౌంట్స్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి.
పరిపాలన సహాయక సిబ్బంది : 31
న్యాయ అధికారి, పీఆర్వో, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్లు, పర్‌ఫ్యూజనిస్టులు, బయోమెడికల్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హార్డ్‌వేర్‌ఇంజినీర్ వంటి పోస్టుల తో పాటు ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్లు, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్, ప్లాస్టర్ అసిస్టెంట్లు వంటివి ఉన్నాయి. - గుర్తుంచుకోండి..
వైద్య విభాగం పోస్టులకు జూలై 6న ఉదయం 9 గంటలకు నిమ్స్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి.
టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ తదితర పోస్టులకు జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌లో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఇంటర్వ్యూ, రాతపరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడుతారు. - అర్హతలు , వయోపరిమితి వివరాలు
వైద్య విభాగం పోస్టులకు ..: సంబంధిత సూపర్ స్పెషాలిటీ విభాగంలో DM/M.Ch/DNB/DrNB అర్హత ఉండాలి. అలా గే నిమ్స్ , ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం బోధనా అనుభవం తప్పనిసరి. ఆయా విభాగాలు అనుసరించి గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 సంవత్సరాలు.
మిగతా పోస్టులకు : సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఎస్సీ, డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర విద్యార్హతలను నిర్ణయించారు. వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5ఏళ్ల, దివ్యాంగులకు 10ఏళ్ల సడలింపు ఉంటుంది. - దరఖాస్తు, ఫీజుల వివరాలు..
వైద్య విభాగం పోస్టులకు అర్హులైన వారు నిమ్స్ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపూర్తి చేయాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ పత్రాలతో జూలై 6 న ఉదయం 9 గంటలకు నిమ్స్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ. 2వేలు , ఎస్‌సీ, ఎస్‌టీ వారు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర పోస్టులకు నోటిఫికేషన్‌లో ఇచ్చిన దరఖాస్తు పూర్తి చేయాలి. విద్యార్హత పత్రాల జిరాక్స్‌లను జతపరిచి జూలై 6వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది.జనరల్ అభ్యర్థులు రూ.1,000 , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. - ఈ ఫీజును ‘ది డైరెక్టర్, నిమ్స్, హైదరాబాద్’ పేరిట డీడీ రూపంలో లేదా నిమ్స్ ఐపీ బిల్లింగ్ కౌంటర్ వద్ద నేరుగా చెల్లించవచ్చు.
- ఇది కూడా చదవండి.. మెగాస్టార్ ను కలిసిన బీజేపీ చీఫ్..చిరు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారా..?


