Friday, September 25, 2026

KAIRATHABAD | ఓవ‌ర్ టు ఖైర‌తాబాద్‌.. అంద‌రి దృష్టి అటువైపే

KAIRATHABAD | ఖైర‌తాబాద్‌.. ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌. ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌( DANAM NAGENDER) పై అన‌ర్హ‌త వేటు ప‌డిన నేప‌థ్యంలో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీలు అల‌ర్ట్ అవుతున్నాయి. వ‌రుస ఉప ఎన్నిక‌ల్లో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ ఇక్క‌డ కూడా స‌త్తా చాటాల‌ని భావిస్తుండ‌గా.. సిట్టింగ్‌ సీటును కాపాడుకోవాల‌ని బీఆర్ఎస్ ఫోక‌స్ పెంచింది. మ‌రోవైపు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని క‌మ‌లం పార్టీ యోచిస్తోంది. ఇక తొలిసారిగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని క‌విత పార్టీ తెలంగాణ ర‌క్ష‌ణ సేన కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన టీడీపీ సైతం ఈ సారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న‌ట్లుగా స‌మాచారం.
అధికార కాంగ్రెస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కం..
గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేంద‌ర్‌పై అనూహ్యంగా అన‌ర్హ‌త వేటు ప‌డింది. ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ ఎన్నిక‌ను అధికార పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఎలాగైనా గెలిచి ప్ర‌భుత్వ ప‌నితీరుపై రెఫ‌రెండంగా ప్ర‌జ‌ల ముందుంచాల‌ని రేవంత్ స‌ర్కారు భావిస్తుంది. సీఎం సైతం దీనిని చాలెంజ్‌గా తీసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. జూబ్లిహిల్స్ ఫ‌లితమే ఇక్క‌డా పున‌రావృతం అవుతుంద‌ని హ‌స్తం శ్రేణులు ఇప్ప‌టికే పేర్కొంటున్నాయి. అయితే అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. నాగేంద‌ర్‌నే కొన‌సాగిస్తారా.. మ‌రెవ‌రినైనా రంగంలోకి దింపుతారా.. అనేది త్వ‌ర‌లోనే స్ప‌ష్టం కానుంది. ఒక‌వేళ్ల దానం గెలిస్తే మాత్రం మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నే ఊహాగానాలు సైతం వినిప‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.
ఫోక‌స్ పెంచిన బీఆర్ ఎస్‌..
త‌మ పార్టీ సింబ‌ల్‌పై గెలిచిన‌ త‌ర్వాత ఫిరాయించిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ అంశాన్ని బీఆర్ఎస్ సీరియ‌స్‌గా తీసుకుంది. విష‌యాన్ని స్పీక‌ర్‌తో పాటు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లి తొలి స‌క్సెస్ న‌మోదు చేసుకుంది. ఈ క్ర‌మంలో వ‌స్తున్న ఉప ఎన్నిక‌లోనూ విజ‌యం సాధించాల‌ని ఆ పార్టీ భావిస్తోంది. మూడేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల ముందుంచి గెలుపొందాల‌ని యోచిస్తోంది. రానున్న‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ విజ‌యం కీల‌క‌మ‌ని గులాబీ బాస్ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్ర‌ధానంగా ఇక్క‌డి నుంచి మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ త‌న‌యుడు సాయికిర‌ణ్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. మ‌న్నె గోవ‌ర్ధ‌న్ రెడ్డి త‌దిత‌రుల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నా.. యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌డం, త‌ల‌సానికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే గెలుపు సుల‌భ‌త‌రమ‌వుతుంద‌ని ఆ పార్టీ భావిస్తున్న నేప‌థ్యంలో కేసీఆర్ నిర్ణ‌యం ఆసక్తిక‌రంగా మారింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం గులాబీ బాస్‌తో ఎర్ర‌వల్లి నివాసంలో సుదీర్ఘంగా స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.
క‌మలం వ్యూహాలు ఆస‌క్తిక‌రం
బీజేపీ కూడా ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటుంది. ప్ర‌ధానంగా దానం అన‌ర్హ‌త పిటీష‌న్‌ను కోర్టులో ఆ పార్టీ ఎల్‌పీ నేత మ‌హేశ్వ‌ర్‌రెడ్డి నేతృత్వంలో దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌మ‌లం అధిష్టానం ఈ ఎన్నిక‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. బ‌ల‌మైన అభ్య‌ర్థి ఎంపిక‌పై ఫోక‌స్ పెంచింది. గ‌త‌ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన చింత‌ల రామ చంద్రారెడ్డి తో పాటు ఇంద్ర‌సేనారెడ్డి, బ‌ద్దం బాల్‌రెడ్డి కుమారుడు మ‌హిపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. రానున్న గ్రేటర్‌తో పాటు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలంటే ఈ గెలుపు కీల‌క‌మ‌ని ఆ పార్టీ అధినాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అభ్య‌ర్థి ఎంపిక‌తో పాటు గెలుపు బాధ్య‌త‌ల‌ను కీల‌క నేత‌ల‌కు అప్ప‌గించాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.
పతంగి పార్టీ మ‌ద్ద‌తు ఎవ‌రికో..?
గ్రేట‌ర్ ప‌రిధిలో ఏఐఎంఐఎం కీల‌క‌మైనా ఈ నియోజ‌క‌ర్గంలో అంత‌గా బ‌లం లేక‌పోవ‌డంతో ఈ సారి పోటీ చేస్తుందా ఎవ‌రికైనా మ‌ద్ద‌తు ఇస్తుందా అనేది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రం. గ‌తంలో బీఆర్ ఎస్‌కు అనుబంధంగా కొన‌సాగినా తాజాగా పతంగి పార్టీ కాంగ్రెస్‌తో కొంత‌మేర‌ స‌ఖ్య‌త‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఈ పార్టీ మ‌ద్ద‌తు కీల‌కం కానుంది. గెలుపోట‌ముల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం లేక‌పోలేదు.
టీడీపీ, జ‌న‌సేన కూడా బ‌రిలో ఉంటాయా…
ఏపీలో కూట‌మీగా బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కొన‌సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నిక‌లో క‌మలం పార్టీ త‌ప్ప‌నిస‌రి బ‌రిలో ఉంటుంద‌ని ఇప్ప‌టికే సంకేతాలున్నాయి. మ‌రోవైపు ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ‌లోనూ త‌మ పార్టీ పోటీకి సై అని కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో టీడీపీ సైతం ప్రాతినిధ్యం వ‌హించ‌గా తాజాగా ఆ పార్టీ వైఖ‌రి ఎలా ఉంటుందో అని స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రెండు పార్టీలు మిత్ర ప‌క్షానికి అండ‌గా ఉంటాయా.. లేదా పోటీకి సై అంటాయా అనేది త్వ‌ర‌లోనే స్ప‌ష్టం కానుంది.
తెలంగాణ ర‌క్ష‌ణ సేన సైతం పోటీలో..?
క‌విత సార‌థ్యంలోని తెలంగాణ ర‌క్ష‌ణ‌సేన సైతం ఈ సారి బ‌రిలో ఉంటుంద‌ని ఆ పార్టీలో టాక్ వినిపిస్తుంది. బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం అన్వేషిస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఫార్వర్డ్ బ్లాక్ త‌ర‌ఫున తమ‌ అభ్య‌ర్థ‌లు రంగంలోకి దింపి ప‌లుచోట్ల గెలుపొందిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో తొలిసారిగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో బ‌రిలో నిల‌వాల‌ని ఆ పార్టీ చీఫ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్లీన్ ఇమేజ్‌తో పాటు సామాజిక‌, ఆర్థికంగా అనుకూల‌మైన అభ్య‌ర్థి పోటీలో నిలిపితే గెలుపోట‌ముల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశముంటుంద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి.. తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్‌.. గేరు మారుస్తున్న పార్టీలు

 

Hot Topics

Related Articles