Monday, July 27, 2026
Home Blog Page 13

సంక్షేమానికి పెద్దపీట..

తెలంగాణ బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రూ.3.24,234 కోట్లతో భారీ పద్దును ప్రతిపాదించారు. గత బడ్జెట్‌ రూ.3,04,965 కోట్ల తో పోల్చితే ఇది 7.5శాతం అధికం. అలాగే మండలిలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు.

  • ఈ సారి ప్రత్యేకమివే
    రాష్ట్రంలోని అందరికీ ఇందిరమ్మ కుటుంబ బీమా.. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులందరికీ బ్రేక్ ఫాస్ట్.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత పథకం, ఐటిఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు 2000 చొప్పున ఉపకార వేతనం వంటివి ఈసారి ప్రత్యేకంగా ఉన్నాయి.
  • మెజార్టీ కేటాయింపులు
    * ఆరు గ్యారెంటీలకు 50,713 కోట్లు
    * పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి: రూ. 33,688 కోట్లు
    * విద్యాశాఖ: రూ. 26,674 కోట్లు
    * వ్యవసాయ శాఖ: రూ. 23,179 కోట్లు
    * విద్యుత్ శాఖ: రూ. 21,285 కోట్లు
    * వైద్యారోగ్య శాఖ: రూ. 13,679 కోట్లు
    * ఎస్సీ సంక్షేమం: రూ. 11,784 కోట్లు
    * బీసీ సంక్షేమం: రూ. 12,511 కోట్లు
    * ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
    శాఖల వారీగా, ఇతర ప్రాధాన్యాలు..
    కార్మిక ; రూ.998 కోట్లు
    పౌరసరఫరాల: రూ.7,366 కోట్లు
    పశుసంవర్ధక:రూ.1,529 కోట్లు
    మహిళ, శిశు సంక్షేమ: రూ.3,143 కోట్లు
    పర్యాటక : రూ.1,224 కోట్లు
    మైనార్టీ .. రూ.3,769 కోట్లు
    యంగ్‌ ఇండియా స్కూళ్లు: రూ.5 వేల కోట్లు
    మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌: రూ.1,500 కోట్లు
    ఓయూకు: రూ.వెయ్యి కోట్లు
    ఉపకార వేతనాలు: రూ.4,343 కోట్లు
    వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌: రూ.3500 కోట్లు
    ముఖ్య పథకాలకు
    ఇందిరమ్మ ఇళ్లు: రూ.5,500 కోట్లు
    రాజీవ్‌ ఆరోగ్యశ్రీ: రూ.1143 కోట్లు
    కల్యాణ లక్ష్మీ : రూ.3,683 కోట్లు
    మహాలక్ష్మీ: రూ.4,305 కోట్లు
    గృహజ్యోతి: రూ.2,080 కోట్లు
    చేయూత: రూ.14,861 కోట్లు
    మహాలక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ : రూ.723 కోట్లు
    రైతు భరోసా: రూ.18 వేల కోట్లు
    మెట్రో రైలు ఫేజ్‌-2: రూ.600 కోట్లు

పెట్రోల్ సెగ.. భగ్గుమన్న ‘ప్రీమియం’

0

పశ్చిమాసియా యుద్ధ సెగలు భారత్ కు తాకుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర మంట మొదలైంది. గృహావసర సిలిండర్ ధర పెరగగా.. కమర్షియల్ కు పూర్తిగా బ్రేక్ పడింది. సామాన్యులకు బుకింగ్ ఇక్కట్లు మొదలవగా వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రీమియం పెట్రోల్ వంతయింది.

  • లీటరుకు రూ.2.26 పెంపు
    * ప్రీమియం పెట్రోల్ దిగుమతి సరిపడా లేక ఆయిల్ కంపెనీలు ధర పెంచాయి. లీటర్ కు రూ.2.26 పెంచడంతో రూ.115 కు చేరువైంది. త్వరలోనే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
  • మూతపడుతున్న బంకులు
    * రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో బంకుల్లో స్టాక్ కొరత కనిపిస్తుంది. హైదరాబాద్ శివారులో చాలా చోట్ల దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అందుబాటులో ఉన్నచోట ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

యుద్ధం..ఇంకెంతకాలం.. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ మధ్యలో ట్రంప్..

పశ్చిమాసియా..21 రోజులుగా యుద్ధంతో కంపిస్తుంది. క్షణక్షణం బాంబుల మోతతో మారుమోగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. లక్షలాది మంది గాయాల పాలయ్యారు.. కోలుకోలేకుండా ఆస్తి నష్టమూ వాటిల్లింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. ట్రంప్ సహకారంతో దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ ను ఇరాన్ అంతే దీటుగా ఎదుర్కొంటుంది.   అమెరికాకు మద్దతుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తూ సత్తా చాటుతోంది. అంతర్జాతీయ జల రవాణాలో కీలకమైన హోర్ముజ్ జల సంధిని మూసివేసి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది.

  • ఫిబ్రవరి 28 నుంచి..
    2026 ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తో పాటు మరికొందరు కీలక అధికారులు మరణించారు. ఒకసారిగా రగిలిపోయిన ఇరాన్ అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది.
  • ఇప్పటివరకు 2500 మందికి పైగా మృతి..
    యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2500 మంది మరణించినట్లుగా అధికారికంగా లెక్కలు చెబుతున్నా అనధికారికంగా ఈ మొత్తం దాదాపు 20 రెట్ల వరకు అధికంగా ఉండవచ్చని అంచనా. మృతులు ఎక్కువగా ఇరాన్, లేబనాన్ లలో ఉండడం గమనార్హం. మరోవైపు 13 మంది అమెరికన్ సైనికులు కూడా మరణించారని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఇందులో భారతీయులు కూడా ఐదుగురు ఉన్నట్లుగా తెలిసింది
  • ప్రపంచంపై ప్రభావం..
    యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, సరఫరా గొలుసులో ఆటంకాలు ఏర్పడటం వంటి ఆర్థిక సంక్షోభాలు మొదలయ్యాయి. భారత్ పై కూడా ఈ ప్రభావం చూపుతోంది.
  • ట్రంప్ కు షాక్ లు..
    * ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జోసెఫ్ కెంట్ తన పదవికి తాజాగా రాజీనామా చేశారు.
    * స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (straight of Hormuz)వద్ద అమెరికా యుద్ధనౌకలకు మద్దతుగా నిలవాలని ట్రంప్ చేసిన పిలుపును కెనడా, ఆస్ట్రేలియా వంటి సుమారు ఏడు మిత్రదేశాలు తిరస్కరించాయి.
    * యుద్ధం విషయంలో నాటో దేశాలు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాయి.
    * యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం ట్రంప్ ప్రభుత్వానికి ఆర్థికంగా సవాలుగా మారింది.
    * ఇరాన్‌తో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండడం గమనార్హం
    * యుద్ధం కారణంగా ఈ నెలాఖరులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగాల్సిన సమావేశాన్ని ట్రంప్ వాయిదా వేశారు.

అమెరికా.. వాళ్లకు ఆఫర్‌ ఇచ్చింది!

అగ్రరాజ్యం అమెరికా అక్రమ వలసదారులపై ఫోకస్‌ పెంచింది. వారిని తిరిగి తమ సొంత దేశాలకు పంపించే కార్యక్రమానికి ఏడాది క్రితమే శ్రీకారం చుట్టింది. తాజాగా మరో బంపర్‌ అఫర్‌ ప్రకటించింది. స్వచ్ఛందంగా యూఎస్ వీడే వారికి ఇచ్చే నగదును మరింత పెంచింది. ఉచిత విమాన ప్రయాణం సైతం కల్పిస్తామని ట్రంప్ సర్కార్ తాజాగా వెల్లడించింది.
గత ఏడాది నుంచే..
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, పత్రాలు లేని వలసదారులకు 2,600( సుమారు 2.4 లక్షల నగదు) డాలర్ల ఎగ్జిట్‌ బోనస్, స్వదేశానికి ఉచిత విమాన ప్రయాణాలను అందించే ‘ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్’ అనే స్వచ్ఛంద స్వీయ-దేశ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2025 జనవరి లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమాన్ని సీబీపీ హోమ్ యాప్ ద్వారా చేపదుతోంది. క్రమబద్ధంగా దేశం విడిచి వెళ్లడాన్ని సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు సుమారు 22 లక్షల మందికి పైగా వినియోగించుకున్నారు. కాగా, అక్రమ వలసదారుల్లో భారతీయులు కూడా ఉన్నారు.
ప్రాజెక్ట్ ముఖ్య వివరాలు..

  • స్వచ్ఛందంగా అమెరికా విడిచి వెళ్లేందుకు నగదు ప్రోత్సాహకంగా 2,600 డాలర్లు అందిస్తారు.
  • ఇది అధికారిక బహిష్కరణకు సురక్షితమైన ప్రత్యామ్నాయం. తద్వారా అరెస్టు లేదా నిర్బంధాన్ని నివారించవచ్చు.
  • అక్రమ వలసదారులు తమ ఉద్దేశాన్ని నమోదు చేసుకోవడానికి, నిష్క్రమణను ప్లాన్ చేసుకోవడానికి, వ్యవహారాలు నిర్వహించుకోవడానికి సీబీపీ హోమ్ యాప్‌ ఉపయోగించవచ్చు.
  • బలవంతపు దేశ బహిష్కరణకు దాదాపు18,245 డాలర్లు ఖర్చు అవుతుండగా.. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కోవ్యక్తి కి సుమారు 5,100 డాలర్ల మాత్రమే కానుంది.
    పత్రాలు లేని వ్యక్తులు ఆర్థిక సాయంతో క్రమబద్ధంగా, మానవతా దృక్పథంతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు ఈ కార్యక్రమం ఒక మార్గాన్ని కల్పిస్తోంది .

గుడ్‌ న్యూస్‌.. ఈపీఎఫ్ కనీస పింఛన్‌ త్వరలో పెరగుతుందట!

0

ఈపీఎఫ్ కనీస పింఛన్‌ పెరగనుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశమిది. రిటైర్‌మెంట్‌ తర్వాత చందాదారులు పొందే పింఛన్‌కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.వెయ్యి కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఈ మేరకు నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది.
ఇప్పటి వరకు ఉన్న కనీస పింఛన్‌ సరిపోవడం లేదంటూ, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలంటూ పెన్షనర్లు ఏళ్లుగా ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా దేశ రాజదానిలో ఇటీవల మూడు రోజుల పాటు ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది. మినిమమ్‌ పింఛన్‌పై పెన్షనర్ల నుంచి వినతులు వచ్చినట్లుగా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇది ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునఃసమీక్షించాలని సూచించింది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1,000గా ఉండగా.. దీనిని 2014లో చివరిసారిగా సవరించారు. తాజాగా రూ.7500లకు పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. దీనిపై కేంద్రం త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2026 బడ్జెట్‌లో లేదంటే రాబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చు.
ప్రభుత్వ పరిశీలనలో..
పింఛన్‌ పెంపుపై ప్రభుత్వం పరిశీలనలో మూడు అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో రూ.3,000, రూ.5,000 లేదా రూ.7,500కు పెంచాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

గ్యాస్ రాదాయే.. కట్టలు పిరమాయే

0

ఓ మామ.. నమస్తే. ఎటో గవర గవరగా పోతున్నవ్ ఏంది అని రాకేష్ అనంగనే.. ఏం లేదు అల్లుడు.. ఇంట్ల గ్యాస్ అయిపోతంది.. బుక్ చేస్తే అయితలేదు.. బయట దొరక లేదంటుండ్రు కదా.. అందుకే ఏజెన్సీ దిక్కు పోతన్న అని పల్సర్ బండి రేస్ చేసిండు రాములు. ఓ మామ ఒక్క నిమిషం ఆగు. నీకు ఈ ముచ్చట తెల్వదా.. గ్యాస్ బుకింగ్ ఇప్పుడు టౌన్ల 25 రోజులకు, పల్లెల 45 రోజులకు పెంచిండ్రు. నువ్వు అక్కడికి పోయినా లాభం లేదు. నిన్ననే మన సాయి గాడు పోయి పొద్దంత నిలబడి ఉత్త చేతులతోనే వచ్చిండు. డీలరు టైం అయినంక బుక్ చేసుకుంటే ఇంటికే వస్తది పో.. అన్నడట..! తమాం లేదని కట్టెల కోసం ఇప్పుడే వాడు బాయికడికి బండి కట్టిండు. అవ్..అల్లుడు నేను కూడా పోవుడు దండగే అంటావా.. సిలిండర్ వచ్చి నెల కాలేదు మరి.. ఏమన్న బ్లాక్ లో దొరుకుతదా.. వంద, రెండు వందలు ఎక్కువైనా మంచిదే.. తెలిసినోళ్లు ఎవలన్న ఉన్నరా.. చెప్పు అని అనంగనే.. ఓ మామ బయట కూడా అంతా స్ట్రిక్టే ఉన్నది. ఎక్కడన్నా ఉన్నా డబుల్ రేట్ అంటుండ్రు.. దానికన్నా నువ్వు కూడా ఇన్ని కట్టెలు తెచ్చుకో పోరాదే అనే మాట పూర్తిగాక ముందే.. మా బాయి కాడ ఒక్క పుల్ల లేదు.. గా ఈరసామి దగ్గర అడుగుతా.. అని తలకాయ పైకి ఊపిన రాములు చూస్తూ .. ఓ మామా మొన్నటి దాకా వంద రూపాయలకు అమ్మిన మూట ఇప్పుడు వాడు రూ.రెండు వందలు అంటుండట.. అట్లయితే ఇగ గుట్టకు పోవాల్సిందే అంటూ బండిని ఇంటి వైపు తిప్పాడు రాములు.
(గ్యాస్ ఇక్కట్లు మొదలైన నేపథ్యంలో పల్లె ముచ్చట..)

‘బండి’కి మళ్లీ రాష్ట్ర పగ్గాలు వస్తున్నాయా.. ‘అంజన్న’.. ఆశీర్వాదంతో ‘కమలం’ వికసిస్తుందా!

రాష్ట్రంలో బీజీపీకి మంచి రోజులు వస్తున్నాయా అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో పుంజుకుంటున్నట్లుగా ఇటీవల జరిగిన పుర పోరులో స్పష్టమైనది. గతంతో పోల్చితే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు నారాయణపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆదిలాబాద్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న విషయం విధితమే. బైంసా బల్దియనూ ఎంఐఎంకు దక్కకుండా స్వతంత్రులకు మద్దతుగా నిలిచి ఆదిపత్యం ప్రదర్శించింది. మరికొన్ని చోట్ల వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానంగా పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర తెలంగాణలో కొంతమేర పట్టు సాధించినట్లు తెలుస్తుంది.
అందరి చూపు ‘బండి’ పైనే
2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఎన్నికయ్యారు. అయితే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని లక్ష్యంతో అధిష్టానం ఆయన కు 2020 మార్చి 11న రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను తన మాటల తూటాలతో ఎక్కుపెట్టి పార్టీని అన్నీ తానై ముందుకు నడిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టి కార్యకర్తల్లో జోష్ పెంచారు. ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ మారిపోయాయి. తదుపరి ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటడం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు సైతం పేర్కొన్నారు. ఏమైందో ఏమో కానీ సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు అధిష్టానం సంజయ్ ను తప్పించింది. 2023 జులై 4 వరకు అంటే దాదాపు మూడున్నర ఏళ్ల పాటు కొనసాగారు. తదనంతరం కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ జోష్ ను మాత్రం కొనసాగించలేక పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బండికి జులై 29న పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మళ్లీ ఘన విజయం సాధించారు. జూన్ 9న  కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీ తానై..
ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బండి పూర్తిస్థాయిలో ఫోకస్ పెంచారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని బల్దియాపై కాషాయ జెండా రెపరెపలాడించారు. ఒక్కసారిగా కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఈ క్రమంలోనే అంజన్న ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇటీవల గెలిచిన వారితో పాటు శ్రేణులతో కలిసి శనివారం పాదయాత్ర బాట పట్టారు.
మహాశక్తిని దర్శించుకుని అంజన్న బాట పట్టి
కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుంచి బయలుదేరి సాయంత్రానికి అంజన్న సన్నిధికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామిని దర్శించుకున్నారు. పార్టీ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర కాషాయ శ్రేణుల్లో జోష్ పెంచింది. సంజయ్ అన్నకు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించే యోచన అధిష్టానం చేస్తున్నట్లుగా అక్కడక్కడ వినిపించింది. అదే నిజమైతే ఆ పార్టీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం లేకపోలేదు. అయితే ఆ పార్టీ పెద్దల మదిలో ఏముందో మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ఎల్లలు దాటిన అభిమానం.. కవితకు వినూత్నంగా బర్త్ డే విషెస్

0

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జావేద్ మాలిక్ అనే కళాకారుడు బిల్డింగ్ టెర్రస్ పై గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత భారీ పటాన్ని చిత్రించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన జాగృతి యువ నాయకులు మైలారం అరుణ్ రెడ్డి, కృష్ణారెడ్డి తమ అభిమాన అధినేత్రికి వినూత్నంగా ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పరాభవ నామ సంవత్సరం ఎవరికి కలిసొచ్చెనో?

ఈ నెల 19న ఉగాది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆరంభం కానుంది. ఈ ఏడాది రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దామా మరి.
ధనస్సు, మీనం వారు పట్టిందల్లా బంగారమే..
* ఈ ఏడాది ధనస్సు, మీనరాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. అదృష్టం వీరు వైపు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అత్యధికంగా (14) ఉండడమే కాకుండా.. రాజ్యపూజం కూడా ఉన్నత స్థితిలో ఉండనుంది. ఇక మేష, వృశ్చిక రాశుల వారికి ఆదాయం 11 ఉండనుంది. మిధునం కన్యారాశుల వారికి 8, అలాగే వృషభం తుల, సింహరాశుల వారికి 5 ఆదాయం పర్వాలేదనిపిస్తుండగా.. మకరం, కుంభం, కర్కాటకం వారికి కేవలం రెండు ఆదాయంతో చివరి స్థానంలో ఉండనున్నారు.
* వృషభం, తులా రాశుల వారికి అత్యధికంగా 14 వ్యయం ఉండడం గమనార్హం.
* సింహం, మీన రాశి వారికి రాజ్యపూజం ఏడుగా ఉండగా.. మిధునం, మకరం వారికి కేవలం ఒకటిగా ఉండడం విశేషం.
* అవమానం విషయానికి మిధునం,కర్కాటకం, మీనం వారికి అత్యధికంగా ఏడుగా కనిపిస్తుంది.

బిగ్ అలర్ట్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు పెరిగిందండోయ్..

గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా 25 రోజులకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో తాజా పరిస్థితులు, దేశంలో బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల ఉత్పత్తిని పెంచాలని ఆయా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.