relations killed | ఆత్మీయతలు అడుగంటుతున్నాయి..బంధాలు భస్మమవుతున్నాయి. నైతికతకు చిరునామా కరువవుతుంది. సమాజంలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మనిషన్న వాడు మనీ’చీ’ గా మారుతున్న తీరును ఎండ కడుతున్నాయి. కన్నతండ్రి ‘కనురెప్పలు’ సైతం కడసారిలోనూ కను మరుగవుతున్నాయి. చితి పెట్టలేని ఆ కూతుళ్ల కాటిన్యం కర్మను మరిచి కల్లోలమవుతున్న వేళ కోట్లాది అంతరాత్మలు ఆలోచనలో పడ్డాయి.
- ఆ తండ్రికి ముగ్గురూ ఆడపిల్లలే. అయినా అధైర్య పడలేదు. వారినే కొడుకులుగా భావించి అల్లారు ముద్దుగా పెంచాడు. ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేశాడు. అయితే ఆ బిడ్డలు అమ్మానాన్నతో బంధం అక్కడికే చాలనుకున్నారు. మలిదశలో కన్నవారితో కర్కశంగా వ్యవహరించారు. ఆశ్రమంలో చేర్చి చేతులు దులుపుకున్నారు. అయినా పేగు బంధం ఆ బిడ్డలను నిత్యం స్మరిస్తూనే ఉంది. కొంతకాలానికి మనోవేదనతో తల్లి లోకం విడిచింది. ఒంటరైన ఆ తండ్రి మౌనంగా రోదిస్తూ అర్ధాంగి బాటనే అనుసరించాడు. అయినా ఆ కూతుళ్ల కారుణ్యం చూపలే. కాటిన్యం వీడలే. అమ్మతనం మరిచి చివరి చూపు కూడా చీదరించుకున్న ఆ ముగ్గురిని సభ్య సమాజం తూర్పారా పట్టింది. కష్టంగా తుది వీడ్కోలు పలికినా ఆ బిడ్డల ఔదార్యాన్ని ఆ తండ్రి మరిచిపోలే. కర్మఫలం చూడాలనుకున్నాడో ఏమో.. కనురెప్పల మాటున దాగి మరో సారి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు. నేత్రదానంతో సజీవంగా నిలిచిపోయాడు.
- ముంబై చెందిన వస్త్ర వ్యాపారి శివ చరణ్(Shivacharan)- మీనా(Meena) దంపతులకు ముగ్గురు కూతుళ్లు. కొడుకులు లేరని భావించిన ఆ తల్లిదండ్రులు వారినే పుత్రులుగా భావించారు. ప్రయోజకాలను చేసి పెళ్లిళ్లు చేశారు. పెద్దమ్మాయి నేపాల్ లో, రెండో కూతురు ఉత్తరప్రదేశ్‌లో, మూడో బిడ్డ ముంబైలో స్థిరపడ్డారు. మలిదశలో బిడ్డలు, మనుమలతో కలిసి జీవిద్దాం అనుకున్న పేగుబంధానికి చేదు అనుభవం ఎదురయింది. వృద్ధాశ్రమంలో చేరాల్సి వచ్చింది. ఫోన్ ద్వారానే ఆ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో తల్లి కన్నుమూసింది. ఆమె ఆలోచనలు.. ఒంటిరితనం భరించలేని ఆ తండ్రి కూడా భార్య వద్దకే చేరాడు. చేయి పట్టి ప్రపంచాన్ని చూపిన నాన్న లోకం విడిచినా ఆ బిడ్డల్లో కనికరం కనిపించలేదు. చితికి దూరమైన ఆ ముగ్గురిలో పెద్దబిడ్డ మనీ* షీ* గా జాలి చూపింది. అంత్యక్రియలకు డబ్బులు పంపి ఆన్‌లైన్‌లో చూస్తూ కపట ప్రేమను చాటుకుంది. చివరి మజిలి ఆలస్యమయ్యే క్రమంలో “ఇంకెంతసేపండి.. స్నానం చేయాలే.. భోజనం తినాలే” అన్న ఆ బిడ్డ మాటలు మానవత్వాన్నిమంటగలిపాయాయి. ఈ అమానవీయ ఘటనపై సోషల్‌మీడియాలో పలువురు నెటిజన్లు “మాయమైపోతున్నడమ్మ.. మనిషన్నవాడు” అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
- ఇది కూడా చదవండి.. సామాజిక తెలం‘గాణమై’.. క దిలి వస్తున్న వి రోచిత త పస్వి


