Thunderstorm | వానాకాలం వచ్చేసింది. వర్షాలతోపాటు అప్పుడప్పుడు పిడుగులు సైతం పడుతుంటాయ్. వీటితో ప్రాణ, ఆస్తినష్టం సైతం సంభవిస్తాయి. అప్రమత్తత, అవగాహనతో వీటి బారిన పడకుండా ఉండవచ్చు. వెలుగులా వచ్చి జీవితాలను చీకటి చేసే ప్రకృతి వైపరీత్యాన్ని తెలుసుకుందామా మరి.
పిడుగులంటే..
పిడుగు (Lightning) .. ఆకాశంలో మేఘాల రాపిడి వల్ల ఏర్పడే సహజ విద్యుత్ ప్రసారం. దీనిని అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి వైపరీత్యంగా పరిగణిస్తారు. మేఘాల కింది భాగంలో ఉండే రుణావేశం.. భూమిపై ఉండే ధనావేశాన్ని ఆకర్షించే క్రమంలో రెండింటి మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతోంది. ఈ క్రమంలో విద్యుత్ మార్గం ఏర్పడి భూమి వైపుగా వేగంగా దూసుకొస్తుంది. వీటి బారిన పడి దేశంలో ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మూగ జీవాలు సైతం అకస్మాత్తుగా తనువు చాలిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలతో పాటు అవగాహనతో ప్రాణ, ఆస్తి నష్టం నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కడ పడుతాయి..
మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే క్రమంలోనే ఉరుములు, మెరుపులు పుడతాయి. ఒక పిడుగులోసుమారు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇది క్షణాల వ్యవధిలోనే జీవాలను కాల్చి బూడిద చేయగలిగేంత సామర్థ్యం అన్నమాట. ప్రధానంగా ఈ పిడుగులు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో పడే అవకాశం ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నాసా పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం ద్వారా ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో సెన్సర్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సంబంధిత అధికారులు అంచనాకు వస్తారు. ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. పెను ప్రమాదం బారిన పడకుండా చర్యలు చేపడుతారు.
జాగ్రత్తలివే..
ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకూడదు. అలాగే కరెంట్ స్తంభాలు, లోహపు వస్తువులు, సెల్‌టవర్ల సమీపంలోకి వెళ్లకూడదు. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. పొలాల్లో పనిచేస్తున్న సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. చెట్లు, గుడిసెల కిందకు కాకుండా త్వరగా సురక్షితమైన ప్రదేశాలకు చేరుకోవాలి. అలాగే ఎత్తైన భవనాల పక్కన నిలబడకూడదు. ఆ సమయంలో ఇంట్లో టీవీ వంటివి వాడకూడదు. ఎలక్ట్రికల్ ఉపకణాల ప్లగ్ లను తొలగించాలి. లేదంటే హై ఓల్టేజ్ కారణంగా వస్తువులు పాడైపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు మెరుపులతో పడుతున్న వర్షాన్ని సైతం చూడరాదు.
పిడుగు బాధితులకు పరిహారం
పిడుగు పాటుతో మృతి చెందితే బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విపత్తు నిర్వహణ కింద ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి, పశువులు వంటి జీవాలు మృతి చెందిన సందర్భాల్లోనూ అవసరమైన సాయం మంజూరు చేస్తోంది.
ఇది కూడా చదవండి.. చల్లని కబురు.. నైరుతి వచ్చేసినట్లేనా!


