Pavan vs Telangana | ఆ ఒక్క మాట.. తెలంగాణను మళ్లీ భగ్గుమనేలా చేసింది. ఆవిర్భావ దినోత్సవం రోజే అగ్గి రాజేసింది. అస్తిత్వమే రణ నినాదంగా మారింది. ఉద్యమకారుల హెచ్చరికలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌లకు ఈ ప్రాంతవాసులు మండి పడుతున్నారు. రాజకీయ పార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. బరాబర్ ఈ ప్రాంతం మా జాగిరే అంటూ బాజాప్తా స్పష్టం చేస్తున్నాయి.
జూన్ 2. తెలంగాణ అవతరం దినోత్సవం. సబ్బండ వర్గాలకు పండుగ రోజు. అమరవీరులను స్మరించుకునే తరుణంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. “తెలంగాణ మీ అయ్య జాగీరా” అంటూ చేసిన హాట్ కామెంట్స్ ఈ ప్రాంత వాసుల్లో ఆగ్రహం తెప్పించాయి. ఇది తెలంగాణ అస్తిత్వంపై దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ దీనిపై ఘాటుగా స్పందించింది. బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రక్షణ సేన తమ దైన శైలిలో పవన్‌పై విరుచుపడ్డాయి.
మాటల యుద్ధం.. ఎవరు ఏమన్నారంటే..
- “హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావ్ అంటున్నారు.. మీరెవరు నన్ను బెదిరించడానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా..” అంటూ పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.
- మంత్రి పొన్నం (PONNAM) స్పందిస్తూ “ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజల అయ్యల జాగీరే..” అంటూ కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాకుంగా గతంలో పవన్ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించారు. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదని పేర్కొనడం ఆయనకు ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమకు నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఈ ప్రాంత వాసుల దిష్టితోనే కోనసీమ కొబ్బరి ఎండిపోయిందంటూ గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
- “దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు.. కానీ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన చారిత్రక పోరాటం, ప్రజల త్యాగాలు, ఆత్మగౌరవ భావనను మాత్రం తక్కువ చేయొద్దు. ఇది ముమ్మాటికి తెలంగాణ భూమి పుత్రుల జాగీరే..” అంటూ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
- ” ఆంధ్రా ప్రజలతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. సమస్యంతా అక్కడి రాజకీయ నాయకులతోనే.. మా అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే ఊరుకోం.. రాజధాని కట్టటం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. తెలంగాణ ఇస్తే 11 రోజులు అన్నం మానేసి పవన్ కళ్యాణ్ కు ఇక్కడేం పని?.. ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ” తమతో పెట్టుకున్న వాళ్లెవరు బాగుపడలేదని… ఇప్పటికే ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ సాధించుకున్నామని.. మళ్లీ పెట్టుకుంటే పళ్లు రాలుతాయని.. టీఆర్ఎస్ 2.0 అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ” హెచ్చరించారు.
- ” ఇది ముమ్మాటికీ మా అయ్యల జాగీరే .. మీరొచ్చి ఏమి మా హైదరాబాద్ కట్టలే.. గండికోట నిర్మించలే.. మరోసారి తెలంగాణ ప్రజలను ఇలా అగౌరవ పరిచేలా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త.. ” అంటూ తెలంగాణ ఉద్యమకారుడు పృథ్విరాజ్ పేర్కొన్నారు.
- ” పవన్.. ముందు నీ తాత జాగీరు.. తండ్రి జాగీరు.. ఎక్కడో.. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.. ” అని ఎమ్మెల్యే వీరేశం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
- ఇది కూడా చదవండి.. పుష్కర కాలమైనా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే!




