Bjp Focous | కమలం పార్టీలో ప్రక్షాళన ఉంటుందా.. అంతర్గత విభేదాలపై అధిష్టానం దృష్టి సారించిందా.. సారథ్య మార్పు తథ్యమా.. అంటే తాజా పరిస్థితులు అవుననే సంకేతాలిస్తున్నాయి. ఉత్తరాదిపై పూర్తిస్థాయిలో పట్టు బిగించిన బీజేపీ ప్రస్తుతం దక్షణాదిపై ఫోకస్ పెంచింది. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది.
మెజార్టీ రాష్ట్రాల్లో పాగా..
దేశవ్యాప్తంగా ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ(Bjp), మిత్రపక్షాల ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. 29 రాష్ట్రాలకు (ఢిల్లీ కలిపి)గాను 17చోట్ల కమలం ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి పాలన సాగుతోంది. మొత్తంగా 21 చోట్ల అంటే దాదాపు 70శాతం పైబడి రాష్ట్రాల్లో కాషాయం హవా కనిపిస్తుంది. కేవలం ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే ప్రతిపక్షాల పాలనలో ఉండడం గమనార్హం.
సమన్వయంపై ఫోకస్
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మూడింటిని కైవసం చేసుకున్న బీజేపీ ఊపుమీదుంది. కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసిన కాషాయ పార్టీ తాజాగా దక్షణాదిపై ఫోకస్ పెంచింది. తెలంగాణపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని భావిస్తోంది. అలాగే నేతల మధ్య సమన్వయం పెంచే దిశగా రాష్ట్ర సారథ్యంలో కీలకమైన మార్పు తేవాలని యోచిస్తున్నటుగా తెలుస్తోంది. ప్రక్షాళనలో భాగంగా కొందరు సీనియర్ల సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవడం, గవర్నర్ గా అవకాశం కల్పించడం, ఒకరిద్దరిని కేంద్ర కేబినేట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్‌లో మార్పులుండేనా..?
రాష్ట్రం నుంచి ప్రస్తుతం కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్నారు. వీరిలో ఒకరిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్థానాన్ని ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సారథిని మార్చాల్సి వస్తే ప్రధానంగా బీసీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఓ సీనియర్‌కు గవర్నర్ పదవి దక్కనున్నట్లుగా చర్చ సాగుతోంది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి.. ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులు ఎంతో తెలుసా..




