Mark politcs | కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. అయినా పదేళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. క్షేత్రస్థాయిలో కేడర్ ఉన్నా సమన్వయ పరిచే లీడర్ లేడనే విమర్శలు వెల్లువెత్తాయి. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన గులాబీ పార్టీ తమకు ఎదురు లేదనుకుని దేశ రాజకీయాల వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలో ‘హస్తం’ అందుకున్న రేవంత్.. రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించారు. ముఖ్యమంత్రిగా కొలువుదీరి.. గులాబీ బాస్ ను ‘హౌస్’కు పరిమితం చేశారు.
మార్క్ చూపుతూ..
కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్ మార్క్ చూపుతున్నారు. పార్టీలో పాతుకుపోయిన వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెడుతూనే.. విపక్షాలకు పంచ్ డైలాగ్‌లతో చుక్కలు చూపుతున్నారు. పాలి’ట్రిక్స్’కు పదునుపెడుతూ ఉద్యమనేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ చతురుత ప్రదర్శిస్తూ అధిష్టానానికి చేరువవుతున్నారు. రాజన్న మాదిరిగా రే’వన్’తన్నగా మారాలని తహతహలాడుతున్నారు.
కౌంటర్ సభకు శ్రీకారం..
సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ ను వీడారు. ‘కారు’ గూటికి చేరువయ్యారు. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల సభ ద్వారా ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. అధికారం కోల్పోయాక ఎక్కువగా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్ (Kcr) చాలాకాలం తర్వాత ఈ సభకు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలహీనమైన ఆ పార్టీకి ఉత్తర తెలంగాణ వేదికగా తిరిగి జవసత్వాలు నింపేందుకు గులాబీ బాస్ సిద్ధవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) వ్యూహాత్మకంగా కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తెచ్చారు. కౌంటర్‌గా అదే రోజున మేడిగడ్డ వద్ద భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు.
టార్గెట్ బీఆర్ఎస్సే..
దాదాపు రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం.. కూలేశ్వరంగా మారిందని.. ఇప్పటికే ప్రాజెక్టు అవినితీపై పలు వేదికల ద్వారా ఎండగట్టిన ముఖ్యమంత్రి మరోసారి బీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు చేసేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్‌లో టాక్. కుంగిన మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఆ రోజున పరిశీలించనున్నారు. పునరుద్ధరణ పనులపై అధికారులతో సమీక్షించి.. అనంతరం బహిరంగ సభలో తన పంచ్ డైలాగ్‌లతో గులాబీ పార్టీపై విరుచుకుపడే అవకాశం లేకపోలేదు.
అధిష్టానానికి చేరువవుతూ..
డీలిమిటిషన్ కు సంబంధించి లోక్‌సభలో 50శాతం సీట్ల పెంపు అంశంపై.. దక్షణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి గొంతెత్తిన రేవంత్.. హైబ్రిడ్ మోడల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏక తాటిపైకి తేవడంలో సఫలీకృతం అయ్యారు. తాజాగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంలో సీఎం ఎనుముల కీలకపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలోనూ పడ్డారు. ఫలితంగా మూడు బిల్లులను ఒకేసారి చట్టాలుగా మార్చుదామనుకున్న బీజేపీ సర్కారుకూ గట్టి షాక్ ఇచ్చారు.
పార్టీ బలోపేతం దిశగా..
మరోవైపు పార్టీలో వర్గపోరుకు క్రమంగా చెక్ పెడుతూ వస్తున్నారు. గీత దాటే నేతల విషయంలో అధిష్టానానికి వివరిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పార్టీపై నెగిటివ్ ప్రభావం పడకుండా పావులు కదుపుతున్నారు. తాజాగా వెలుగుమట్ల ఘటన విషయంలో నష్టాన్ని గుర్తించిన ఆయన మరింత పెరగకుండా సత్వర చర్యలకు ఆదేశించారు. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో ‘హస్తం’ బలోపేతంపై ఫోకస్ పెంచారు. పార్టీ రహిత ఎన్నికలు అయినా పంచాయతీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫలితాలపై ప్రభావం చూపారు. మున్సిపల్ లోనూ అదే తీరు కొనసాగించారు. రానున్న పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని భావిస్తున్నారు. నాడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరును అనుసరిస్తున్నారు. రే’వన్’తన్నగా ప్రజల గుండెల్లో ముద్రవేసుకోవాలని ఆరాటపడుతున్నారు.
ఇది కూడా చదవండి : కులం లెక్కలు.. ఐక్యతా రాగాలు..మారనున్న రాజకీయాలు




