పిడికెలెత్తిన మహిళాశక్తి @ టీఆర్ఎస్
తెలంగాణ రుద్రమసేనగా ఆవిర్భావం
TRS RUDRAMASENA | ఏళ్లుగా మౌనం దాల్చిన ఆ సంద్రం.. క్రమంగా ఉప్పొంగి.. అలజడితో కదిలిపోతోంది. ఎన్ని తుఫానులు ఎదురైనా ఆగని అలలా.. కష్టాల కడలిని దాటి.. భయాలను వీడి.. గెలుపు తీరం వైపు అడుగులేస్తోంది. నయా రాజకీయాలకు వన్నె తెస్తూ ఆడసింహమై రుద్రమ సేనగా ఆవిర్భవించింది.
టీఆర్ఎస్‌లో టీఆర్ఎస్
రాజ్యాంగం ఆమోదించుకున్న పర్వదినం పురస్కరించుకొని పార్టీ మహిళా విభాగం పేరును ప్రకటించారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. మరో టీఆర్ఎస్ (TELANGANA RUDRAMA SENA తెలంగాణ రుద్రమసేన)గా నామకరణం చేశారు. మహిళా నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. రుద్రమ దేవి వారసులుగా రాజకీయ యుద్దంలో కత్తి పట్టాల్సిందే అని సోదరీమణులకు సూచించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పార్టీ జెండా రెపరెపలాడే లక్ష్యంపై దిశానిర్దేశం చేశారు. ప్రజా క్షేత్రంలో పోరుబాటనే అసెంబ్లీకి రాచబాటగా అభివర్ణించారు. మహిళలకు అవకాశాలు ఇచ్చేందుకే తాను పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. గాజులు వేసుకున్న చేతులు చట్ట సభల్లో గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మగవారితో సమానంగా ఓటు హక్కుకల్పించిన రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు నుంచే మహిళలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని వివరించారు.
కవిత మదిలో ఏముంది
ఇటీవల కొంత కాలంగా ప్రజా సమస్యలపై పోరుబాట పట్టిన కవిత ప్రస్తుతం పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇప్పటికే అన్ని విభాగాలను ప్రకటించిన టీఆర్ఎస్ చీఫ్ ప్రస్తుతం మహిళాలోకంపై ఫోకస్ పెంచారు. రాజకీయాల్లో నారీలోకం అడుగులు తప్పనిసరి అంటూ స్పష్టం చేస్తూ ఆచరణలోకి తెస్తున్నారు. జనాభాకే పరిమితం కాకుండా.. పనిలోనూ పదవుల్లోనూ ప్రాధాన్యత దక్కాలని విశ్వసిస్తున్నారు. మన చరిత్ర మనమే రాసుకోవాలని మార్గదర్శకత్వం వహిస్తున్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు.
జయలలిత..మాయావతి సరసన
దేశ రాజకీయాల్లో జయలలిత, మాయావతి వంటి నేతలు తమకంటూ ప్రత్యేకత చాటిన విషయం విధితమే. కవిత కూడా అదే బాటలో నడవాలని యోచిస్తున్నట్లు అవగతమవుతుంది. ఇప్పటికే కొత్త పార్టీ ఏర్పాటు చేసిన ఆమె అడుగులు తాజా పరిణామాల నేపథ్యంలో అటు గానే సాగుతున్నట్లుగా తెలుస్తుంది. తన వాగ్దాటితో ఇప్పటికే ప్రజాక్షేత్రంలో సమస్యలపై సమరభేరి మోగిస్తూ.. అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతుండడం గమనార్హం.
పార్టీ చీఫ్‌లలో ఒక్కరే మహిళ
ప్రధాన పార్టీల అధ్యక్షుల్లో అంతా మగవారే ఉండగా.. ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కవిత నేతృత్వంలో కొనసాగుతోంది. ఈక్రమంలో సహజంగానే మహిళలకు కొంత ప్రాధాన్యం లేకపోలేదు. అన్ని పార్టీల కంటే భిన్నంగా ఉన్న ఈ పరిణామం తెలంగాణ రక్షణసేనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఎన్నికలు మరో రెండేళ్లు మాత్రమే ఉండడంతో ఇప్పటికే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మొదలైంది. అన్ని పార్టీల నేతలు విమర్శనాస్త్రాలకు పదును పెంచడంతో కవిత కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..: సామాజిక న్యాయానికి కవిత జై


