TRS MLC | తెలంగాణ రక్షణ సేన తొలి పోరుకు సన్నద్ధమవుతుంది. నూతన పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు సై అంటుంది. ఇప్పటికే పాంచజన్యంతో ప్రజలకు చేరువవుతున్న టీఆర్ఎస్ (TRS).. ఎమ్మెల్సీ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. దశమి రోజున ముహూర్తం ఖరారు చేసిన ఆ పార్టీ చీఫ్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ సామాజిక న్యాయానికి జై కొట్టారు. అధికారికంగా బహుజన అభ్యర్థిని ప్రకటించి సవాల్ విసిరారు.
ఉద్యమకారుడి పేరు ఖరారు
మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ల కోసం గొంతెత్తిన కవిత.. తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న తొలి అభ్యర్థి విషయంలోనూ ఆచీతూచి స్పందించారు. బీసీలకు పెద్ద పెట్టవేస్తూ గౌడ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడి పేరు ఖరారు చేశారు. వరంగల్-ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బహుజనుల గొంతుకగా మూడేళ్లుగా అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసిన కవిత అదే సంప్రదాయాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనలోనూ కొనసాగించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్
కాంగ్రెస్ ఇప్పటికే అగ్ర కులానికి చెందిన అభ్యర్థిని ప్రకటించగా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన బీసీ అభ్యర్థి పై అందరి దృష్టి నెలకొంది. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం కవిత పార్టీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శ్రీకాంత్ గౌడ్ నేపథ్యం
ఉమ్మడి వరంగల్ (ప్రస్తుత మహబూబాబాద్) జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవి పల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కాకతీయ యునివర్సిటీ నుంచి పీహెచ్ డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతిలో మొదటి నుంచి కవిత వెన్నంటి నడిచారు. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చానెల్స్ డిబేట్లలో, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ గొంతుకగా నిలిచారు.
ప్రతిష్టాత్మకం..
పార్టీ స్థాపించిన ఐదు నెలల తర్వాత మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. బీసీ సంఘాలతో పాటు నిరుద్యోగుల మద్దతు కీలకం కానుండగా.. ఇప్పటికే కవిత ఈ రెండు వర్గాలతో కలిసి నడుస్తుండడం కలిసివచ్చే అవకాశంగా తెలుస్తోంది. ఇది వర్కవుట్ అయితే గెలుపు నల్లేరుపై నడక కానుంది. విజయం తథ్యమైతే రానున్న గ్రేటర్ తో పాటు పరిషత్ లో పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకునే అవకాశం ఉంటుందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తుంది.
పట్టభద్రులు స్పెషల్
సాధారణ ఎన్నికలతో పోల్చితే పట్టభద్రుల ఎన్నికలు కాస్త భిన్నంగా ఉంటాయి. గతంలో అధికార పార్టీ సైతం ఓటమి చవిచూసిన ఘటనలు లేకపోలేదు. ఇప్పటికే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన కవిత పలుమార్లు ఓయూలో విద్యార్థులతో మమేకమై ఉద్యమ బాట పట్టారు. ఆందోళనలూ చేపట్టారు. నిరుద్యోగులకు అండగా నిలిచారు. ఈ క్రమంలో వచ్చిన ఈ ఎన్నిక ఆ పార్టీకి కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే కవిత తొలి విజయం దాదాపు ఖరారు అయినట్లే. అయితే ఈ ఎన్నికలో అర్ధబలం కూడా కీలకమనే విషయం గుర్తించాలి మరి.
ఇది కూడా చదవండి..: టీఆర్ఎస్ పాంచజన్యం @ ఇంద్రవెల్లి


