TRS PAANCHAJANYAM | పోరాటాల పురిటిగడ్డ మరో సారి తెరపైకి వచ్చింది. జల్..జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డల అమరత్వానికి సాక్షిగా నిలిచిన ఈ ప్రాంతం ప్రస్తుతం రాజకీయ సభలకు సెంటిమెంట్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక మరోసారి ఇక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా తెలంగాణ రక్షణ సేన (TRS) కూడా ఉమ్మడి ఆదిలాబాద్ వేదికగా ఇక్కడినుంచే పాంచజన్యం మోగించేందుకు సన్నద్ధమవుతోంది.
30న సంకల్ప సభ
ఈనెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించేందుకు ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్, కోస్గి (కొడంగల్)లో పాంచజన్య సంకల్ప సభలు నిర్వహించారు. రెండు చోట్ల సక్సెస్ కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ సభను ఆదివాసీల ఆత్మగౌరవ పోరు పతాక ఇంద్రవెల్లి స్తూపం సాక్షిగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ నాయకుడు కావేటి మనోహర్ ను ఇన్చార్జీలుగా నియమించారు. పలువురు సీనియర్ నాయకులకు సభ బాధ్యతలు అప్పగించారు.
- మూడో సభపై సర్వత్రా ఆసక్తి
గత రెండు సభల్లో తన మాటల తూటలతో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించిన పార్టీ చీఫ్ కవిత(Kavitha) ఈ సారి ఏ మేరకు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ, గిరిజనుల గోసను తనదైన శైలిలో ప్రస్తావించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. - ఇటీవల రిమ్స్ లో పసికందుల ప్రమాద ఘటన నేపథ్యంలో ఇక్కడకు స్వయంగా విచ్చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు ఆస్పత్రి అధ్వాన పరిస్థితిపై దుమ్మెత్తి పోశారు. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర వాసులకు పెద్దదిక్కుగా ఉన్న ఈ వైద్యశాలలో సమస్యలు పరిష్కరించాలని సర్కారుకు అల్టిమేటం సైతం జారీ చేశారు. ఘటనపై తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించారు. ఇటీవల ఆ నివేదికను గవర్నర్కు సైతం అందజేశారు. తాజాగా హైకోర్టు సైతం రిమ్స్ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడం గమనార్హం.
- ఈ ప్రాంతంలో ప్రధానంగా పత్తి, సోయా, శనగ, వరి వంటి పంటలు సాగవుతాయి. ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేక మనస్తాపానికి గురైన రైతన్నలు వరుసగా ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకంగా 30 మంది వరకు తనువు చాలించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో అన్నదాతలకు ఇచ్చే భరోసాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఆవశ్యకత, ఇంజినీరింగ్ కళాశాల వంటి తదితర ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించాలని గిరిపుత్రులు విజ్క్షప్తి చేస్తున్నారు.
- తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదివాసీలు ఇటీవల ఐటీడీఏ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఏజెన్సీ ప్రాంతంలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా సింగరేణితో పాటు ప్రాణహిత తదితర నీటిప్రాజెక్టులపై టీఆర్ఎస్ చీఫ్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.
ఇది కూడా చదవండి.. : తెలంగాణలో పొలిటికల్ హీట్.. గేర్ మారుస్తున్న పార్టీలు


