Thursday, August 6, 2026

sankalpa sabha | సామాజిక తెలం‘గాణమై’.. (క)దిలి వస్తున్న (వి)రోచిత (త)పస్వి

sankalpa sabha | ఆరు దశాబ్దాల ఆకాంక్ష.. అమరుల త్యాగాలు.. సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించినా సకల జనులు ఆశించిన సామాజిక తెలంగాణ మాత్రం స్వప్నంగానే మిగిలింది. పుష్కర కాలం దాటినా.. పాలకులు మారినా ప్రజల తలరాత మారడం లేదని మౌనంగా రోధిస్తున్న పోరుబిడ్డలెందరో. ఇంకెంత కాలం అంటూ పంచభూతాలు సైతం ప్రశ్నిస్తున్న త‌రుణం. ఈ క్ర‌మంలో  ముక్కోటి గొంతుకగా పాంచజన్యం మోగబోతుంది. మరో పోరుబాటకు తెలంగాణ రక్షణ సేన సై అంది. క దిలి వస్తున్న వి రోచిత త పస్వి పొలికేకకు ముహూర్తం ఖరారైంది. మ‌రో తెలం‘గాణం’లో శృతి క‌లిపేందుకు అడుగులు సైతం వడివడిగా పడుతున్నాయి.
నాటి నినాదమే..
సామాజిక తెలంగాణ అంటే.. అన్ని వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ఫలాలు సమానంగా అందడమే. అయితే ఇప్పటికీ ఆ కల సాకారం కాలేదు. భౌగోళిక తెలంగాణ వచ్చి ప‌న్నెండేళ్లు దాటింది. సామాజిక తెలంగాణ మాత్రం ఇంకా నినాదమై నినదిస్తోంది. ప్రభుత్వాలు మారాయి.. కండువాలు మారాయి. కానీ అణగారిన వర్గాల జీవితాలు మాత్రం బాగుప‌డ‌డం లేదు. దగాపడ్డ గుండెలకు ధైర్యంగా సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రజల పక్షాన పోరాడేందుకు తెలంగాణ రక్షణ సేన ముందడుగు వేసింది. కవిత నేతృత్వంలో సంకల్ప సభకు గురువారం సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదిక కానుంది. నాడు ఉద్యమ పార్టీలో భాగస్వామ్యమైన ఆ పార్టీ చీఫ్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జ‌యశంక‌ర్‌సార్ స్ఫూర్తితో..
ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత శక్తి వంతులైన వలస పాలకుల పీడన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ సహా లక్షలాది మంది ఉద్యమించారు. స్వ‌రాష్ట్ర సాధ‌న‌లో నెత్తిన బ‌తుక‌మ్మ‌తో పిడికిలెత్తిన ఆడ‌బిడ్డ మ‌రోసారి గ‌ర్జించేందుకు సిద్ధమయ్యారు. సామాజిక తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ జ‌యంతి రోజున ఉద్య‌మ శంఖారావం పూరించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రానికి కొత్త రాజకీయాలను పరిచయం చేస్తూ అందులో ఆయా వర్గాలను భాగస్వామ్యం చేయబోతున్నారు
అన్ని ఏర్పాట్లు పూర్తి..
ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర నలుమూలల నుంచి రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ఇప్ప‌టికే సరూర్ నగర్ సభకు చేరుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సాధికారత లక్ష్య సాధన కోసం కవిత ఈ వేదిక నుంచి ప్రకటన చేయ‌నున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిలో మార్పు తీసుకురావడానికి తాము ఎలాంటి ఎజెండా తీసుకుబోతున్నామో స్పష్టత ఇవ్వనున్నారు.
స‌భాప్రాంగ‌ణంలో..
సభా ప్రాంగణంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, మహాత్మా జ్యోతిబా పూలే, మాతా సావిత్రి బాయి పూలే, భాగ్యరెడ్డి వర్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మాన్యశ్రీ కాన్షి రామ్, కుమురం భీమ్, కొండా లక్ష్మణ్ బాపూజీ త‌దిత‌ర తెలంగాణ ఉద్య‌మ యోధుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి..:  నేరెళ్ల గాయానికి తెలంగాణ ఆడబిడ్డ భరోసా..

 

 

Hot Topics

Related Articles