Kavitha..Nerella | గోదారమ్మ బిడ్డకు గోసొచ్చిన వేళ అది.. ఇసుక మాఫియా చేతిలో మానేరు కన్నీరు కారుస్తుంటే ఆ గ్రామం చూడలేక పోయింది.. అప్పటికే ఓ దీపం ఆరిపోగా .. పెను ముప్పును ముందే పసిగట్టి ఊరంతా కలిసి అడ్డుకోబోయింది.. నాటి పాలకుల చేతిలో కీలకమైన ఆ మాఫియా ఖాకీలతో చేతులు కలిపింది. ‘అష్ట’ దిగ్బంధనంలో అల్లాడిన ఆ గొంతులు మూగ బోయి.. న(డ)వ లేకపోయాయి. ‘చితి’కి పోయిన అమానవీయ ఘటనను కన్నీళ్లతో ప్రశ్నించి.. విధిరాత కాదని.. తలవంచే సమయం తప్పదంటూ ఇప్పటికే ఆగ్రహించిన ‘తెలంగాణ ఆడబిడ్డ’ నేడు ఆ పల్లె ముంగిటకు రానున్నారు. గల్లంతైన వారి ఆశలకు భరోసా నింపి ఓదార్చనున్నారు.
తొమ్మిదేళ్ల గాయం
నేరెళ్ల సమీపంలోని మానేరులో ఇసుక రవాణా చేసే లారీల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంపునకు గురయ్యే మానేరులో తవ్వకాలకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా కొందరు యథేచ్ఛగా ఇసుక తరలింపు చేపట్టారు. ఈ క్రమంలో 2017 జూలై 2న గ్రామానికి చెందిన బదనపు భూమయ్యను ఇసుక లారీ ఢీకొట్టగా మృతి చెందాడు. కోపోద్రిక్తులైన స్థానికులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. కొన్ని ఇసుక లారీలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనకు 8 మందిని బాధ్యులను చేస్తూ పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా వైద్యుల రిపోర్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. లాఠీదెబ్బల కారణంగా కొందరు బాధితులు అంతర్గత గాయాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ, ఇతర సమస్యలతో ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి కనీసం నడవలేకపోయారు. ఇటీవల ఒకరు మృతి చెందారు కూడా. మొత్తంగా ఈ అమానవీయ ఘటనకు కారకులు ఎవరంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గతంలో ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలని, కారకులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమెను కలిసిన బాధితులకు అండగా ఉంటానని గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం వారిని పరామర్శించాలని నిర్ణయించారు.
నేడు పరామర్శ
నేరెళ్ల గ్రామానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. ముందుగా ఇటీవల మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. అనంతరం ఇతర బాధితులను కూడా పరామర్శించన్నారు.


