Thursday, June 25, 2026

Bayalata | ‘బయలాట’కు కొత్త ఊపిరి

  • తెలంగాణ గ్రామీణ సంస్కృతికి పునరుజ్జీవం
  • బీజీఏ థియేటర్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ చేయూత‌

Bayalata | కాలం మారుతున్నా… వినోద రూపాల్లో మార్పులొస్తున్నా.. గ్రామీణ సంస్కృతిలో భాగ‌మైన ప‌లు క‌ళారూపాలు నేటికీ ప‌ల్లె ముంగిట‌ క‌దలాడుతూనే ఉన్నాయి. భావి త‌రాల‌కు వార‌స‌త్వ సంప‌ద‌గా నిలుస్తున్నాయి. ప‌ల్లె గుండెలో పుట్టి… ప్రజల జీవితాలతో మమేకమై… సాంస్కృతిక వార‌ధిగా మారిన‌ క‌ళారూపాల్లో బ‌య‌లాట ఒక‌టి. ఆద‌ర‌ణ క‌రువైన ఇప్ప‌టికీ ప్ర‌త్యేక‌త‌ సంత‌రించుకున్న ఈ క‌ళ‌కు పున‌రుజ్జీవం అందించేందుకు ప‌లు సంస్థ‌లు చేయూత‌నందించేందుకు ముందుకు వ‌చ్చాయి.
ఈ క‌ళ ప్ర‌త్యేక‌త‌లు..
బయలాట (Bayalata) అనేది బహిరంగ వీధి నాటక ప్రక్రియ. దీనిని తెలుగులో వీధి నాటకాలు లేదా యక్షగానం అని కూడా పిలుస్తారు. ఆరుబ‌య‌ట, ఆలయాల ఎదుట తాత్కాలిక వేదికలు ఏర్పాటు చేసి రాత్రంతా ప్రదర్శిస్తారు. ఇతిహాసాలు, పురాణాలు, స్థానిక వీరుల కథలే ప్రధానాంశాలుగా ఉంటాయి. వీటిలో దశరత్, సన్నత, దొడ్డట, యక్షనాగ మొదలైనవి ప్ర‌ధాన‌ రూపాలు. హార్మోనియం, డ్రమ్స్ (చండే) , తాళాలతో పాటు నృత్యం, గానం ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
అప్పిరెడ్డిప‌ల్లిలో వ‌ర్క్‌షాప్‌..
ఈ జానపద కళను మరింత బలోపేతం చేయ‌డంతో పాటు భావితరాలకు అందించాల‌నే ల‌క్ష్యంతో బీజీఏ థియేటర్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా సంక‌ల్పించింది. ఈమేర‌కు క‌ళాకారుల‌కు ప్ర‌త్యేక‌ శిక్షణ ఇచ్చి కొత్త అవకాశాలు కల్పించాల‌ని భావించింది. ఇందులో భాగంగా 60 రోజుల బయలాట డ్రామా ట్రైనింగ్ వర్క్ షాప్‌న‌కు శ్రీ‌కారం చుట్టింది. నారాయణపేట జిల్లా, మద్దూరు మండలం, అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం రాత్రి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఆగస్టు 25వ తేదీ వరకు శిబిరం కొన‌సాగ‌నుంది. ఇందులో కళకు సంబంధించిన అభినయం, సంభాషణ, గాత్ర నైపుణ్యం, రంగస్థల నిర్వహణ, పాత్రల రూపకల్పన, జానపద ప్రదర్శన శైలులు వంటి అనేక అంశాలపై క‌ళాకారుల‌కు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా థియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్ కాడం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న బయలాట నాటక కళను సంరక్షించడం మాత్రమే కాకుండా దానిని భావితరాలకు చేరవేసి… కళాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ వర్క్ షాప్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అంత‌రించి పోతున్న క‌ళ‌కు జీవం పోస్తున్న వీరిని ప‌లువురు క‌ళాభిమానులు ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి.. సనత్‌నగర్ టిమ్స్‌లో ఉద్యోగావ‌కాశాలు.. ఆల‌స్య‌మెందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Hot Topics

Related Articles