Chitchat war | ‘పేరు’తో మొదలైన ఆ పోరు చినికి చినికి గాలి వానగా మారిందా.. అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి తాజా పరిస్థితులు. కొత్త పార్టీ వేళ ఇటు కవిత(kavitha).. అటు కేటీఆర్(ktr) చిట్‌చాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఎవరేమన్నారంటే..
కొత్త పార్టీ పేరు విషయంలో జాగృతి అధ్యక్షురాలు ఇటీవల చిట్‌చాట్‌లో ‘బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చని..’ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై గులాబీ పార్టీలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో కేటీఆర్ తాజాగా చిట్‌చాట్‌లో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ‘ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీపరంగా నష్టపోయాం.. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పును పరిశీలిస్తున్నాం.. అయితే అధినేత నిర్ణయమే ఫైనల్’ అంటూ చెప్పకొచ్చారు. అలాగే ‘మా నుంచి తప్పులు తెలుసుకున్నాం.. సరిదిద్దుకుంటున్నాం..’ అనడంతో పాటు.. ‘జైలుకు వెళితేనే సీఎం అవుతారనేది భ్రమ..’ అంటూనే ‘ పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు.. కానీ ఏడిపించకూడదు ‘ అంటూ పరోక్షంగా కవితను ఉద్దేశించి చేసిన విమర్శలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారి తీశాయి.
జాగృతి నుంచి ప్రతి విమర్శలు..
జాగృతి నుంచి కూడా ప్రతి విమర్శలు మొదలయ్యాయి. మీడియా డిబేట్లలో ఇప్పటికే పలువురు స్పందిస్తున్నారు.
- ‘ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మా పార్టీని టార్గెట్ చేసే క్రమంలో నా బిడ్డను అరెస్టు చేసిందని, ఆమె ఏ తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే విషయాన్ని.. ‘ సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. న్యాయస్థానం కూడా ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం మరిచిపోయారా.. అని పేర్కొంటున్నారు. మరోవైపు ‘ జైలుకు పోతే కాదు.. జైలుకు పంపబడితే ముఖ్యమంత్రులు అవుతున్నారనే విషయాన్ని రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.
- గతంలో పార్టీ పరిస్థితులను.. కవిత లేఖ ద్వారా వివరించి సరిచేసుకుంటే బాగుంటుందని పేర్కొంటే దానిని అధిష్టానం తీవ్రంగా పరిగణించ లేదా.. ఈ క్రమంలోనే చివరికి ఆమెపై వేటు వేయలేదా.. ఇప్పుడు అదే అంశాన్ని కేటీఆర్ ‘మా నుంచి కూడా కొన్ని తప్పులు జరిగాయి.. సరిదిద్దుకుంటున్నాం’ అంటూ పేర్కొనడం ఆలస్యంగా మేల్కొన్నట్లుగా భావించవచ్చా.. అని పేర్కొంటున్నారు.
- ఇంటి ఆడబిడ్డను ఓ వ్యక్తి అసభ్యకరంగా తూలనాడితే కనీసం స్పందించలేదని, ‘ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిదా..’ అని కూడా ప్రశ్నిస్తున్నారు.
- ఇలా అన్న చెల్లెలు చిట్ చాట్ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం విమర్శలు.. ప్రతివిమర్శలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.
- ఇది కూడా చదవండి : కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!




