రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా.. జాతీయ పార్టీ పాగా వేస్తుందా….లేదా ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయా.. మహిళా శక్తి ప్రభావం ఎవరికి కలిసివస్తుంది.. డీలిమిటేషన్ సన్నాహాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆయా పార్టీలు ఇప్పటికే అంతర్గతంగా ఫోకస్ కూడా పెంచినట్లు తెలుస్తుంది. జాతీయ పార్టీలతో పాటు కొత్త పార్టీ దిశగా పావులు కదుపుతున్న కవిత కూడా దీనిపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. స్వయంగా ఆమె అధ్యక్షురాలుగా పార్టీ రూపుదిద్దుకుంటున్న తరుణంలో మహిళా ప్రాధాన్యం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది.
కవితకు ఢిల్లీ వేదికగా పోరాటం కలిసొచ్చేనా
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కవిత మూడేళ్ల క్రితం ఢిల్లీ వేదికగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షతోపాటు బిల్లుకు ఏకాభిప్రాయం కోసం దేశవ్యాప్తంగా 47 రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాశారు. ఈ క్రమంలో ‘నారీ శక్తి వందన్ అదినియమ్’ పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఇటీవల ఆమోదించింది. వచ్చే ఎన్నికల్లో దీనిని అమలు చేసే దిశగా కేంద్రం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి : తండ్రిని ఫాలో అవుతున్న తనయ.. పార్టీ విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్న కవిత
స్త్రీ శక్తి కీలకం కానుందా..
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు రానున్న ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు చాలా పార్టీలు ఈ అంశాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ రిజర్వేషన్ అమలు జరిగితే తప్పనిసరిగా కోటా ప్రకారం కేటాయించాల్సిందే. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నప్పటికీ ప్రధానంగా మహిళా అధ్యక్షురాలు గా రానున్న కవిత పార్టీకి కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు.




