save singareni |సింగరేణి సంస్థ మనుగడ.. కార్మికుల సమస్యలపై తెలంగాణ జాగృతి ఫోకస్ పెంచింది. గతంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగిన కవిత త్వరలో పార్టీ పెట్టబోతున్న క్రమంలో కోల్‌బెల్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆమె ఈ ప్రాంతం నుంచే పోటీ చేస్తారా.. అందులో భాగంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా.. వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆరు జిల్లాల పరిధిలో కోల్‌బెల్ట్
రాష్ట్రంలో కోల్‌బెల్ట్ ప్రాంతం ఆరు జిల్లాల పరిధిలో విస్తరించింది. కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు, ఓపెన్‌కాస్టులు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 12 అసెంబ్లీ, 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. లోక్‌సభ విషయానికి వస్తే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబ్‌బాద్, ఖమ్మం స్థానాల్లో నల్లసూరీలది కీలక పాత్ర. ఉత్తర తెలంగాణలో ఇవి మెజారిటీ స్థానాలు కావడం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
సమస్యల ఎజెండాతో ముందుకు..
టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)కు అనుబంధంగా కొనసాగిన టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా వెలుగొందింది. ఆ సమయంలో కవిత గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. దీంతో ఆమెకు ఈ ప్రాంతంపై, కార్మికుల సమస్యలపై అవగాహన ఉంది. త్వరలో పార్టీ పెట్టబోతున్న క్రమంలో బొగ్గు గని కార్మికుల సమస్యలపై ఫోకస్ పెంచినట్లు తెలిసింది. ఇందులో భాగంగా తాజాగా ‘సేవ్ సింగరేణి’ (save singareni )పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఐదు తీర్మానాలతో కార్మిక వర్గం దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అలాగే కార్మికవర్గానికి ఇబ్బందికరంగా మారిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటుతో పాటు అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలన్నారు. నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను సింగరేణి సంస్థనే ఆపరేట్ చేయాలన్నారు.
పట్టు సాధించేలా..
ప్రధానంగా సింగరేణి ప్రాంతాల్లో కార్మిక కుటుంబాలతో పాటు పరోక్షంగా ఉపాధి పొందే ఉండే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కార్మికుల సమస్యలపై ఫోకస్ చేస్తే రానున్న రోజుల్లో ఆవిర్భవించనున్న కవిత కొత్త పార్టీకి మంచి మైలేజ్ ఉండే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఒకవేళ తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ‘ఆమె’కు అందలం దక్కేనా.. రానున్న ఎన్నికల్లో మహిళా శక్తి కీలకం కానుందా?.. ఎవరికి కలిసొచ్చేనో..!




