Telangana Politics | ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మొదలైంది. నిన్న మొన్నటి వరకు స్తబ్ధుగా ఉన్న పార్టీలు గొంతు సవరిస్తున్నాయి. జనం మధ్య తచ్చాడేందుకు తహతహలాడుతున్నాయి. అధికార పార్టీపై విపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. మరో వైపు రేవంత్(Revanth) సర్కారు వెయ్యి రోజుల పాలనను వల్లె వేస్తుండగా .. విపక్షాలు మాత్రం హామీల అమలెక్కడ అంటూ తూర్పారా పడుతున్నాయి. తాజాగా అసెంబ్లీ వేదికగా పై చేయి సాధించాలని వ్యూహాలకు పదనుపెడుతున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని గేర్ మారుస్తున్నాయి.
పదేళ్లు తమదే అంటున్న కాంగ్రెస్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి పవర్‌లోకి రావడం ఖాయమంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల హామీల అమలు, పార్టీలో అంతర్గత కలహాలు హస్తం పార్టీకి మైనస్ గా మారే అవకాశాలు లేకపోలేదు. మూడేళ్లు గడుస్తున్నా తరచూ బీఆర్ఎస్ ను విమర్శించడం కారు పార్టీకే కలిసివచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రమశిక్షణ విషయంలో ఇటీవల కొండా సురేఖ ఎపిసోడ్‌లో సీఎం కొంత పై చేయి సాధించినా మహిళా మంత్రి బర్తరఫ్ అంశం ప్రతిపక్షాలకు ఆయుదంగా మారినట్లుగా తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టి ఎన్నికల టీం రెడీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.
అధికారమే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు..
తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ రాష్ట్రం వచ్చాక రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని భావించినా మ్యాజిక్ మార్కుకు చేరుకోలేకపోయారు. ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. అధికారానికి దూరమైన తర్వాత గులాబీ బాస్ అడపాదడపా మినహా మౌనంగానే వ్యవహరిస్తున్నారు. అయితే పార్టీ పరంగా మాత్రం ఎప్పటికప్పడు శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ అంతర్గత సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో నెరవేర్చని హామీలను, ప్రజా సమస్యలను జనం ముంగిట ఉంచాలని దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆక్టివ్‌గా ఉండేలా సూచిస్తున్నారు. ఈక్రమంలోనే సర్కారు తీరుపై ఆ పార్టీ అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడుతోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ సర్కారు తీరును ఎండగట్టేందుకు సన్నద్ధమవుతోంది. అయితే తొలిరోజు చోటు చేసుకున్న పరిమాణాలు ఆ పార్టీకి కొంత మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది.
జోష్ పెంచిన కమలం పార్టీ
హ్యాట్రిక్ విజయాలతో కేంద్రంలో దూసుకుపోతున్న కమలం పార్టీ రాష్ట్రంలోనూ ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెంచింది. తదనుగుణంగా కీలక నేతల వరుస పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. పార్టీలో గ్రూపు తగాదాలపై ఫోకస్ పెంచిన సమన్వయ పరిచేలా దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్, 22ఏ భూములు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని
నిలదీస్తోంది. తాజా అసెంబ్లీ సమావేశాల్లోనే ఇదే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతోంది.
పట్టు సడలకుండా.. మజ్లీస్ ఫోకస్
ఇప్పటి వరకు హైదరాబాద్‌కు పరిమితమైన ఎంఐఎం తన సత్తాను మరోసారి నిలుపుకునేందుకు తహతహలాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్ల తొలగింపు అంశంపై ఈ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటి మాదిరిగానే తన హవా చాటుకోవాలని సన్నద్ధమవుతోంది.
టీఆర్ఎస్ కీలకం కానుందా..
తెలంగాణ రక్షణ సేన పేరిట కవిత ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పార్టీపై ఈ సారి అందరి దృష్టి నెలకొంది. స్వయాన కేసీఆర్ కుమార్తె కావడం.. ప్రజా సమస్యలపై ఫోకస్ పెంచడం.. ఇటీవల వరుసగా జిల్లాల పర్యటనలతో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ఈ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపనుంది.. గ్రేటర్ పరిధిలో పట్టున్న గులాబీ పార్టీని ఏమైనా డ్యామేజ్ చేస్తుందా.. అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో సత్తా చాటితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైలేజ్ పెరిగే అవకాశం లేకపోలేదు.
ఇది కూడా చదవండి.. మారిన గ్రేటర్.. ఎవరికి కలిసొచ్చేనో..?


